సింహగిరి... విచారణ పక్కదారి!

ABN , First Publish Date - 2020-06-06T16:20:08+05:30 IST

సింహాచలం దేవస్థానం భూముల్లో అనధికార నిర్మాణాలు, కొండపై గ్రావెల్‌ తవ్వకాలను..

సింహగిరి... విచారణ పక్కదారి!

చందనోత్సవం నాడు అనధికారికంగా స్వామి వారి నిజరూప దర్శనం చేసుకున్న ప్రైవేటు వ్యక్తులు

ఆ విషయం పత్రికల్లో రావడంతో విచారణ కమిటీ నియామకం

విచారణాధికారి సమర్పించిన నివేదికలో ఆ ఊసే లేదు!

పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకేనని ప్రచారం


సింహాచలం(విశాఖపట్నం): సింహాచలం దేవస్థానం భూముల్లో అనధికార నిర్మాణాలు, కొండపై గ్రావెల్‌ తవ్వకాలను తన నివేదికలో తప్పుబట్టిన దేవదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ (ఎస్టేట్స్‌) చంద్రశేఖర్‌ ఆజాద్‌ అసలు విషయాన్ని మరుగుపరచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో సింహాచలం వరాహలక్ష్మీనృసంహస్వామి చందనోత్సవం (నిజరూపం దర్శనం) కార్యక్రమానికి ఈ ఏడాది భక్తులను అనుమతించరాదని ప్రభుత్వం, దేవస్థానం నిర్ణయం తీసుకున్నాయి. పాలక మండలి చైర్మన్‌, ఈవో సహా ముఖ్యులు మాత్రమే హాజరుకావాలని నిర్దేశించాయి. అయితే ఆ రోజున కొంతమంది అనధికారికంగా స్వామి నిజరూప దర్శనం చేసుకున్నారు.


ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం, పత్రికల్లో రావడంతో దేవదాయ శాఖ విచారణ కమిటీ వేసింది. ఆ కమిటీ చందనోత్సవం రోజున అనధికారికంగా ఎంతమంది దర్శనం చేసుకున్నారు?, వారు ఎవరు?, వారికి సహకరించింది ఎవరు?, వారిని సిఫారసు చేసింది ఎవరు?... అనే అంశాలపై విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాల్సి ఉంది. అయితే అవేవీ ప్రస్తుతం బయటకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయాన్ని వదిలేసి అక్రమ నిర్మాణాలు, గ్రావెల తవ్వకాలపై మాత్రమే దృష్టిసారించడం అందరినీ విస్మయపరుస్తోంది.


విశ్వసనీయ సమాచారం ప్రకారం... చందనోత్సవ వేళ సుమారు 60 మంది వరకు స్వామి వారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ఆ విధంగా దర్శనం చేసుకున్న వారిలో అత్యధికులు దేవదాయ శాఖకు చెందినవారు వుండగా, ఆ తరువాత స్థానంలో పోలీసు శాఖకు చెందినవారు వున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం సీసీ ఫుటేజీల పరిశీలన ద్వారా తెలుసుకున్న అధికారులు పైస్థాయి వ్యక్తుల దృష్టికి తీసుకువెళ్లగా...‘లైట్‌గా’ తీసుకోవాలని చెప్పినట్టు సమాచారం. దాంతో అనధికారికంగా స్వామి వారి నిజరూప దర్శనం చేసుకున్న వారి పేర్లు బయటకు రాలేదని ప్రచారం జరుగుతోంది. చందనోత్సవ ఘటనతో ముడిపెట్టి దేవాలయ ఇన్‌చార్జి ప్రధానార్చకుడిని సస్పెండ్‌ చేయడం, అనంతరం విశాఖ శారదా పీఠాధిపతి చొరవతో విధుల్లోకి తీసుకోవడం తెలిసిందే. 


ముందు వారిపై చర్యలు చేపట్టాలి

సింహాచలం విచారణకు కమిటీ దేనికి వచ్చిందో ముందు ఆ నివేదికను బయటపెట్టి, అక్రమంగా దర్శనాలు చేసుకున్నవారు, అందుకు కారకులైన వారిపై చర్యలుచేపట్టాలని అన్నివర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


ఇది కూడా చదవండి:

------------------------

ప్చ్‌..ఆయన ‘లాభం లేదు!’Updated Date - 2020-06-06T16:20:08+05:30 IST