లాక్‌డౌన్‌!

ABN , First Publish Date - 2020-03-25T12:00:04+05:30 IST

లాక్‌డౌన్‌!

లాక్‌డౌన్‌!

  • హైవేపైకి యథాప్రకారం వాహనాలు
  • కొన్ని ప్రాంతాల్లోనే కట్టుబాట్లు
  • వీధుల్లో ఇష్టానుసారంగా రాకపోకలు
  • మంత్రుల హెచ్చరికతో చర్యలకు దిగిన పోలీసులు


విశాఖపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): నగరంలో లాక్‌డౌన్‌ నవ్వులపాలవుతోంది. పోలీసులు ప్రధాన రహదారులు, జంక్షన్లకే పరిమితమవుతున్నారు. నిత్యవసర సరకులకు వెళ్లేవారిని ఇబ్బంది పెట్టకూడదనే నిబంధన ఉండడంతో వీధి రోడ్ల గురించి పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో వీధుల్లో రయ్‌...రయ్‌ మంటూ తిరిగిన యువకులు అదే జోరులో హైవేపైకి వచ్చి హల్‌చల్‌ చేస్తున్నారు. మధురవాడ మొదలుకొని గాజువాక వరకు ఇదే పరిస్థితి.


ప్రధాన జంక్షన్లు అయిన హనుమంతువాక, మద్దిలపాలెం, సత్యం జంక్షన్‌, గురుద్వారా, కంచరపాలెం, ఎన్‌ఏడీ జంక్షన్‌, సిరిపురం, టైకూన్‌, జగదాంబ, ఆర్టీసీ కాంప్లెక్స్‌.. ఇలా కొన్ని ప్రాంతాల్లోనే పోలీసులు మోహరించారు. బారికేడ్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఎవరూ వెళ్లకుండా చేశారు. అయితే ఒకవైపు వెళ్లడానికి అనుమతించి, రెండో వైపు రాకుండా చేశారు. అయితే చాలామంది రాంగ్‌ రూట్‌లో ప్రయాణిస్తూ కనిపించారు. హెల్మెట్లు లేకుండా మరికొందరు ప్రయాణించడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.


విశాఖ వచ్చిన మంత్రులు ఆళ్ల నాని, కురసాల కన్నబాబులు ఈ పరిస్థితిని గమనించి పోలీసు అధికారులు లాక్‌డౌన్‌ను సీరియ్‌సగా తీసుకోవాలని హెచ్చరించడం గమనార్హం.! రవాణా శాఖ అధికారులు కూడా రోడ్లపైకి వచ్చి, ఆటోలు, ఇతర వాహనాలను తనిఖీ చేయాలని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో సాయంత్రం నాలుగు తరువాత పోలీసులు మరింత కచ్చితంగా వ్యవహరించి కేసులు నమోదు చేశారు. వాహనాలను సీజ్‌ చేశారు. బుధవారం నుంచి లాక్‌డౌన్‌ మరింత పక్కాగా అమలు చేస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

Read more