-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » visakhapatnam news vehicles
-
విచ్చలవిడిగా వాహనాల రాకపోకలు
ABN , First Publish Date - 2020-03-25T12:00:48+05:30 IST
విచ్చలవిడిగా వాహనాల రాకపోకలు

- ట్రాఫిక్ కట్టడి చేయాల్సింది పోలీసులే..
- రవాణా శాఖ ఎంవీఐలు రోడ్లపైకి రావాలి
- నేటి నుంచి మైదానాల్లోనూ రైతుబజార్లు
- త్వరలో వ్యాన్ల ద్వారా కూరగాయల విక్రయాలు
- వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు
విశాఖపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): విశాఖ ప్రజలు రహదారులపై విచ్చలవిడిగా వాహనాలతో తిరుగుతున్నారని, వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులదేనని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. హైవేతో పాటు వీధుల్లోనూ వాహనాల రాకపోకలు యథావిఽధిగా ఉన్నాయని, లాక్‌డౌన్ వాతావరణమే కనిపించడం లేదన్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచే పరిస్థితిలో మార్పు రావాలని సీపీ మీనాకు ఆదేశించారు. మంగళవారం జరిగిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆటోలు తిరగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. రవాణా శాఖకు చెందిన మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్లు రోడ్లపైకి వచ్చి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు రాయాలని ఆదేశించారు. అత్యవసర సేవలందించే కంపెనీలు, సంస్థలు కనీస సిబ్బందితో పనిచేయాలన్నారు.
మైదానాల్లో రైతుబజార్లు
నగరంలో 13 రైతుబజార్లకు జనాలు పెద్దసంఖ్యలో వస్తున్నారని, సామాజిక దూరం పాటించాల్సి ఉన్నందున రైతుబజార్లకు కొన్ని సూచనలు చేస్తున్నామన్నారు. రైతులను రెండు గ్రూపులుగా విభజించి, ఒక రోజు ఒక గ్రూపు, మరో రోజు ఇంకో గ్రూపు వచ్చేలా చూడాలని ఆదేశించారు. పాఠశాలలు, కాలేజీల మైదానాలు, లేదంటే స్టేడియాలు వుంటే వాటిలో బజారు ఏర్పాటు చేసి కొంత మంది రైతులను అక్కడికి తరలించాలన్నారు. ఇది బుధవారం నుంచే అమల్లోకి రావాలని, ఎవరైనా ధరలు పెంచి విక్రయిస్తే వారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొద్ది రోజుల తర్వాత వీధుల్లోకి వ్యాన్ల ద్వారా కూరగాయలు పంపిస్తామని, మొబైల్ మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
జీవీఎంసీ పనితీరు పెరగాలి
జీవీఎంసీ అధికారులు నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా నిర్వహించాలని, ఇన్‌చార్జి కమిషనర్ ఈ బాధ్యత తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మీడియాపై ఎటువంటి ఆంక్షలు లేవని, వారు ఎక్కడికైనా వెళ్లవచ్చునని, అందుకు పోలీసులు సహకరిస్తారన్నారు.