-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » visakhapatnam news janatha curfew lockdown
-
జనతా కర్ఫ్యూ తరహాలో మన్యంల లాక్‌డౌన్
ABN , First Publish Date - 2020-03-25T12:05:14+05:30 IST
జనతా కర్ఫ్యూ తరహాలో మన్యంల లాక్‌డౌన్

144 సెక్షన్ పక్కాగా అమలు చేసిన పోలీసులు
రోడ్లపైకి రాని జనం.. ఇళ్లకే పరిమితం
రోడ్డెక్కని వాహనాలు.. తెరచుకోని దుకాణాలు
రద్దయిన లోతుగెడ్డ, జి.మాడుగుల సంతలు
(పాడేరు ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): జనతా కర్ఫ్యూ తరహాలో మంగళవారం మన్యంలో లాక్‌డౌన్ జరిగింది. పోలీసులు ఎక్కడికక్కడ మోహరించి 144 సెక్షన్‌ను పక్కగా అమలు చేశారు. పాడేరు, అరకులోయ, చింతపల్లి, ఇతర మండలాల్లో లాక్‌డౌన్ పక్కగా కొనసాగుతున్నది. నిత్యవసర, మందుల దుకాణాలు మినహా హోటళ్లు, లాడ్జీలు పూర్తిగా మూసేశారు. ఆర్టీసీ, ప్రైవేటు జీపులు, ఆటోలు సైతం రోడ్డెక్కలేదు. పాడేరులో అంబేడ్కర్ సెంటర్ మొదలుకుని మెయిన్‌రోడ్లు, వీధులన్నీ నిర్మానుష్యంగానే ఉన్నాయి.
చింతపల్లిలో మంగళవారం లాక్‌డౌన్ పక్కాగా అమలు జరిగింది. లోతుగెడ్డ వారపు సంత రద్దయ్యింది. విశాఖ ఏజెన్సీలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చింతపల్లి ఏఎస్పీ ఎస్. సతీశ్‌కుమార్ హెచ్చరించారు. పాడేరు ఐటీడీఏ పీవో డీకే.బాలాజీ గరికబంద వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును మంగళవారం ఆయన తనిఖీ చేశారు.