మళ్లీ కరోనా టెన్షన్
ABN , First Publish Date - 2020-03-08T09:13:42+05:30 IST
కరోనా వైరస్ మరోసారి నగరవాసులను కలవరపాటుకు గురిచేసింది. శనివారం మరో రెండు అనుమానిత కేసులు నమోదుకావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నగరానికి చెందిన...

- నగరంలో మరో రెండు అనుమానిత కేసులు నమోదు
- సింగపూర్ వెళ్లొచ్చిన డాక్టర్ దంపతులకు లక్షణాలు
- ఛాతీ ఆసుపత్రిలో చికిత్స
- నమూనాలు సేకరించి హైదరాబాద్ పంపిన వైద్యులు
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): కరోనా వైరస్ మరోసారి నగరవాసులను కలవరపాటుకు గురిచేసింది. శనివారం మరో రెండు అనుమానిత కేసులు నమోదుకావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నగరానికి చెందిన ఓ డాక్టర్ సతీసమేతంగా వారం కిందట సింగపూర్ వెళ్లారు. పర్యటన ముగించుకుని శనివారం ఉదయం బెంగళూరు, అక్కడి నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు కరోనా స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న బృందానికి వైద్యుని భార్య కొద్దిరోజులుగా తాను పడుతున్న ఇబ్బందిని తెలియజేశారు. రెండు రోజులుగా జలుబు, దగ్గు బాధపడుతున్నట్టు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన స్ర్కీనింగ్ బృందం వెంటనే భార్య,భర్తలను నగరంలోని ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించింది. సాయంత్రం ఇద్దరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి పంపించారు.
మెడికల్ స్టోర్స్‌పై దాడులు
మాస్క్‌లు, శానిటైజర్స్ అధిక రేట్లకు విక్రయిస్తున్నారని పత్రికల్లో వస్తున్న కథనాలపై స్పందించి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాల మేరకు స్థానిక డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్ శనివారం పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. శనివారం జిల్లాలో 28 మెడికల్ స్టోర్స్‌పై దాడులు నిర్వహించి 5,363 మాస్క్‌లు, 22 శానిటైజర్స్ అందుబాటులో వున్నట్టు గుర్తించారు. మూడు షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించి కేసులు నమోదుచేశారు. వీటిలో హెచ్‌బీ కాలనీలోని ఆధార్ జనరిక్ మెడిసిన్స్, సీతమ్మధారలోని యునైటెడ్ మెడికల్స్, సెవెన్ హిల్స్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ఉన్నాయి.