మహా సంగ్రామం

ABN , First Publish Date - 2020-03-08T09:08:35+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)కు సుదీర్ఘకాలం తరువాత ఎట్టకేలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసే ...

మహా సంగ్రామం

  • ఎట్టకేలకు జీవీఎంసీకి ఎన్నికలు
  • మేయర్‌ పదవి బీసీలకు కేటాయింపు
  • రేపే నోటిఫికేషన్‌ జారీ
  • 11 నుంచి నామినేషన్ల స్వీకరణ
  • 14న పరిశీలన
  • ఉపసంహరణకు 16 వరకూ గడువు
  • 23న పోలింగ్‌
  • 27న లెక్కింపు
  • 31న మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)కు సుదీర్ఘకాలం తరువాత ఎట్టకేలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసే అవకాశం వుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే మేయర్‌ పదవిని బీసీలకు కేటాయించడంతోపాటు ఓటర్ల సంఖ్య ఆధారంగా సామాజిక వర్గాలకు వార్డులు కేటాయిస్తూ శనివారం ప్రభుత్వం గెజిట్‌ జారీచేసింది. దీంతో జీవీఎంసీకి షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 23న ఎన్నిక జరగడం దాదాపు ఖాయమని అధికారులతోపాటు రాజకీయ పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు.


జీవీఎంసీకి చివరిసారిగా 2007లో ఎన్నికలు జరిగాయి. అప్పటివరకూ విశాఖపట్నం నగర పాలక సంస్థగా వున్న వీఎంసీలోకి గాజువాక మునిసిపాలిటీతోపాటు 32 పంచాయతీలను విలీనం చేసి 72 వార్డులతో గ్రేటర్‌ విశాఖ నగర పాలక సంస్థగా ఏర్పాటుచేస్తూ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి 32, కాంగ్రెస్‌కు 27 వార్డులు దక్కగా మిగిలినచోట్ల ఇండింపెంట్లు గెలుపొందారు. అప్పట్లో అధికారంలో వున్న కాంగ్రెస్‌ పార్టీ ఇండిపెండెంట్ల సహాయంతో మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంది. మేయర్‌గా పులుసు జనార్దనరావు, డిప్యూటీ మేయర్‌గా దొరబాబు ఎన్నికయ్యారు.


2012లో పాలకవర్గం గడువు ముగిసిన అనంతరం భీమిలి, అనకాపల్లి మునిసిపాలిటీలతోపాటు భీమిలి వైపు వున్న ఐదు పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీలో విలీనం చేసింది. దీనిపై భీమిలితోపాటు అటు వైపు వున్న ఐదు పంచాయతీలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో అప్పటి నుంచి ఎన్నికల నిర్వహణ సాధ్యపడలేదు. సుమారు ఎనిమిదేళ్లుగా జీవీఎంసీ ప్రత్యేక అధికారి పాలనలోనే ఉంది. కార్యవర్గం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం ద్వారా ఏటా కేటాయించే రూ.100 కోట్లను గత మూడేళ్లుగా నిలిపివేసింది. దీంతో జీవీఎంసీకి ఎన్నిక జరిపితే ఆ నిధులను తిరిగి రాబట్టుకోవచ్చుననే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు వున్న ఆటంకాలను తొలగించడంపై దృష్టిసారించింది. అందులో భాగంగా భీమిలికి జీవీఎంసీకి మధ్య వున్న నిడిగట్టు, జేవీ అగ్రహారం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నగరపాలెం పంచాయతీలను పంచాయతీరాజ్‌ శాఖ నుంచి డీనోటిఫై చేయించి, జీవీఎంసీలో విలీనం చేసింది.


అలాగే భీమిలి, గాజువాక మునిసిపాలిటీలతో కూడిన జీవీఎంసీ విస్తీర్ణం 688 చదరపు కిలోమీటర్లకు పెరగడంతో 17,500 మందికి ఒక వార్డు చొప్పున 98 వార్డులుగా పునర్విభజన చేసి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. అనంతరం వార్డుల సరిహద్దులు నిర్ధారిస్తూ గెజిట్‌ జారీచేసింది. ఆ తరువాత జీవీఎంసీ అధికారులు కొత్తవార్డుల్లో ఏ సామాజిక వర్గానికి చెందినవారు ఎంతమంది వున్నారనేది లెక్కించి రిజర్వేషన్‌ ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. విలీనం, వార్డుల పునర్విభజనపై కొంతమంది కోర్టులో కేసులు వేసినప్పటికీ వాటిని కోట్టేయడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి.  


బీసీలకు మేయర్‌ పదవి

జీవీఎంసీ మేయర్‌ పదవిని రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి బీసీలకు కేటాయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జీవీఎంసీ మేయర్‌ పదవిని ఓసీ జనరల్‌ కేటాయిస్తూ వచ్చినప్పటికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను ఆకట్టుకునేందుకు బీసీ కేటగిరికీ చెందినవారినే మేయర్‌గా ఎంపిక చేసేవి. ప్రస్తుతం  బీసీలకే మేయర్‌ పదవిని కేటాయించడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆ కేటగిరీకి చెందినవారు తమ ప్రయత్నాలను ప్రారంభించేసారు.


వార్డు రిజర్వేషన్లపై గెజిట్‌ జారీ:

వార్డు రిజర్వేషన్లపై రాష్ట్రప్రభుత్వం శనివారం గెజిట్‌ జారీచేసింది. దీనిప్రకారం జీవీఎంసీ పరిధిలోని 98 వార్డుల్లో ఎస్టీకి ఒకటి (జనరల్‌), ఎస్సీలకు ఎనిమిది (జనరల్‌కు నాలుగు, ఎస్సీ మహిళలకు నాలుగు), బీసీలకు 33 (బీసీ జనరల్‌కు 17, బీసీ మహిళలకు 16), అన్‌రిజర్వుడు 56 (జనరల్‌ మహిళలకు 29, అన్‌రిజర్వుడు జనరల్‌కు 27) చొప్పున కేటాయించింది. ఏ వార్డును ఎవరికి కేటాయించారనేదానిపై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. 


రేపే నోటిఫికేషన్‌ జారీ

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీచేసిన షెడ్యూల్‌ ప్రకారం మునిసిపల్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. 11 నుంచి 13 వరకూ నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ల పరిశీలన, 16న నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు అభ్యర్థుల తుది జాబితా విడుదల ఉంటుంది. 23న ఎన్నికలు నిర్వహించి 27న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. 31న మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహిస్తారు. 


వార్డుల కేటాయింపు ఇలా..

అన్‌రిజర్వుడు మహిళ 29

అన్‌రిజర్వుడు 27

బీసీ జనరల్‌ 17

బీసీ మహిళ 16

ఎస్సీ మహిళ 4

ఎస్సీ జనరల్‌ 4

ఎస్టీ జనరల్‌ 1

Updated Date - 2020-03-08T09:08:35+05:30 IST