విశాఖ లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-03-23T09:04:05+05:30 IST

కరోనా కేసు నమోదు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ జిల్లాలో లాక్‌ డౌన్‌ ప్రకటించాయి. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది...

విశాఖ లాక్‌డౌన్‌

  • 31 వరకు స్వీయ నిర్బంధం
  • ప్రజా జీవనంపై ఆంక్షలు
  • అత్యవసరాలకుతప్ప బయటకురాకూడదు
  • మీటరు దూరం పాటించాల్సిందే
  • బస్సులు, ప్రైవేటు వాహనాలు... అన్నీ బంద్‌
  • అందుబాటులో నిత్యావసరాలు, గ్యాస్‌, పెట్రోల్‌


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం) : కరోనా కేసు నమోదు నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ జిల్లాలో లాక్‌ డౌన్‌ ప్రకటించాయి. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. ఈ నెలాఖరు వరకూ కొనసాగుతుంది. కరోనా వైరస్‌ కట్టడి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. కోవిడ్‌-19 కేసులు నమోదవుతున్న జిల్లాల్లోనే ఈ లాక్‌డౌన్‌ ప్రకటించాయి. రాష్ట్రంలో ఆరు కేసులు ఇప్పటివరకు నమోదుకాగా అందులో రెండు విశాఖపట్నంలోనే వుండడంతో ఈ నగరంపై ప్రభుత్వం దృష్టిసారించింది.


లాక్‌డౌన్‌ అంటే..?

లాక్‌డౌన్‌...ఒకవిధంగా స్వీయ నిర్బంధమే. నిబంధనలతో ప్రజా జీవనం సాగించాలి. కరోనా వైరస్‌ ఒకచోట నుంచి మరొక చోటకు వ్యాప్తిచెందకుండా కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకనే మొత్తం ప్రజా రవాణా వ్యవస్థను స్తంభింపజేశారు. దేశవ్యాప్తంగా రైళ్లను నిలిపివేస్తున్నారు. ఇక రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ బస్సులు అన్నింటినీ నిలిపివేస్తున్నట్టు రవాణా శాఖా మంత్రి పేర్ని నాని ఆదివారం ప్రకటించారు. డిపోల నుంచి ఒక్క బస్సు కూడా కదలదని ప్రకటించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నామని, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు వెళ్లవని, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి బస్సులు రావని స్పష్టంచేశారు.


అన్ని రవాణా వాహనాలు బంద్‌

నిత్యావసర సరకులను చేరవేసే వాహనాలు తప్పించి ప్రయాణికులను చేరవేయడానికి ఉద్దేశించే వాహనాలు ఏవీ తిరగడానికి అనుమతించడం లేదని మంత్రి పేర్కొన్నారు. కార్లు, టాక్సీలు, ప్రైవేటు బస్సులు, టెంపోలు, ఆటోలు ఏవీ బయటకు తీయకూడదని ఆదేశించారు. అత్యవసరమై ఎవరైనా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే ఆ వాహనంలో రోగి, ఒక సహాయకుడు తప్ప ఇంకెవరూ వుండకూడదని స్పష్టంచేశారు. ఈ వాహనాలను రవాణా శాఖాధికారులు నియంత్రించాలని, ఆ బాధ్యత వారిదేనని పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. ఇది స్వీయ నియంత్రణే తప్ప నిర్బంధం కాదని, కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.


అన్ని దుకాణాలు మూసివేత

ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులు విక్రయించే దుకాణాలు తప్పితే ఇంకే వ్యాపారాలు కొనసాగకూడదని, వాటిని మూసివేయించాలని జిల్లా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ నిబంధనల ప్రకారం కిరాణా దుకాణాలు, పాలబూత్‌లు, మెడికల్‌ షాపులు తప్ప ఇంకేవీ తెరవకూడదు. మద్యం దుకాణాలు, పబ్‌లు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. నిర్మాణాలన్నీ ఎక్కడివక్కడ ఆపేయాలని ఆదేశించారు. అంటే వాటికి సంబంధించిన సామగ్రి విక్రయించే దుకాణాలు (హార్డ్‌వేర్‌, ఎలక్ర్టికల్‌, పెయింట్‌, సిమెంట్‌, ఇసుక తదితరాలు) కూడా మూసివేయాలి.


హోటళ్లు కూడా...

బయట ప్రాంతాల నుంచి ఎవరూ వచ్చే అవకాశం లేదు కాబట్టి, నగరంలోని వారు బయటకు రారు కాబట్టి హోటళ్లను కూడా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే నగరంలోని హోటళ్లు వెలవెలబోతున్నాయి. నోవాటెల్‌లో నలుగురు, దసపల్లాలో ముగ్గురు మాత్రమే ఖాతాదారులు వున్నారని, ఇతర హోటళ్ల పరిస్థితి కూడా ఇలాగే వుందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి.  


గ్యాస్‌, పెట్రోల్‌

ప్రజలకు అవసరమైన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ విక్రయాలకు ఆయా కేంద్రాలు అందుబాటులో వుంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. వీటికి ఇబ్బందులు రావని పేర్కొంది. నిత్యావసర సరకుల ధరలు పెంచితే నిఘా వేసి కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. 


Updated Date - 2020-03-23T09:04:05+05:30 IST