సాధారణ సేవలకు విమ్స్‌ సంసిద్ధత

ABN , First Publish Date - 2020-11-19T05:36:38+05:30 IST

స్టేట్‌ కొవిడ్‌ ఆస్పత్రి విమ్స్‌ సాధారణ వైద్య సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది.

సాధారణ సేవలకు విమ్స్‌ సంసిద్ధత

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన అధికారులు

 ఆస్పత్రిలో జీరోకు చేరిన కొవిడ్‌ వైరస్‌ బాధితుల సంఖ్య

 కొవిడ్‌ రోగుల కోసం సగం బెడ్లు  కేటాయించేందుకు ప్రతిపాదన

(విశాఖపట్నం/ఆంధ్రజ్యోతి) 

స్టేట్‌ కొవిడ్‌ ఆస్పత్రి విమ్స్‌ సాధారణ వైద్య సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది.  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకేఒక్క రోగి కూడా కోలుకోవడంతో సోమవారం అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. గత ఎనిమిది నెలలుగా కొవిడ్‌ వైరస్‌ బాధితుల కోసమే కేటాయించిన ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం ఒక్క కరోనా రోగి కూడా లేడు. దీంతో, సాధారణ సేవలపై అధికారులు దృష్టి సారించారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 60 ఏళ్లుపైబడిన వైరస్‌ బాధితులకు సేవలను అందించాలన్న ఉద్దేశంతో విమ్స్‌ను స్టేట్‌ కొవిడ్‌ ఆస్పత్రిగా ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటివరకు ఆస్పత్రిలో రెండు వేల మందికిపైగా సేవలు పొందగా, సుమారు 200 వరకు బాధితులు చికిత్స పొందుతూ మృతి చెందారు. 

300-300 ఫార్ములా..

 విమ్స్‌లో 600 పడకలు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది కలిపి సుమారు 520 మంది ఉన్నారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో,  300- 300 ఫార్ములాను అధికారులు తెరపైకి తీసుకువచ్చారు. సాధారణ వైద్య సేవలకు 300, కొవిడ్‌ బాధితుల కోసం మరో 300 పడకలను సిద్ధంగా ఉంచుతామని అధికారులు ప్రతిపాదనలను పంపించారు. ఇందుకోసం ఏ కేటగిరీలో ఉన్న ఆస్పత్రిని బి కేటగిరీలోకి మార్చాలని అధికారులు కోరుతున్నారు. 

సెకండ్‌ వేవ్‌తో తాత్సారం.. 

సాధారణ వైద్య సేవలు అందించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విమ్స్‌ అధికారులు ప్రతిపాదనలను పంపించినప్పటికీ, సెకెండ్‌ వేవ్‌ ఉంటుందనే నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఉన్నతాధికారులు తాత్సారం చేస్తున్నట్టు తెలిసింది.   





Updated Date - 2020-11-19T05:36:38+05:30 IST