-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » villagers demand under pass way
-
అండర్ పాస్‌వే కోసం ఆందోళన బాట
ABN , First Publish Date - 2020-12-07T05:02:30+05:30 IST
అనకాపల్లి- పెందుర్తి- ఆనందపురం ఎన్‌ఏహెచ్- 16 ఆరు లైన్ల రహదారి విస్తరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో రాంపురం-గొరపల్లి రోడ్డు వద్ద అండర్ పాస్ వే నిర్మించాలని పరిసర ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్‌ఏహెచ్-16 ఆరు లైన్ల రోడ్డు పనుల అడ్డగింత
మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్డు వద్ద ఎందుకు నిర్మించరని నిలదీత
పెద్ద ఎత్తున ఆందోళనకు సన్నద్ధం
పెందుర్తి, డిసెంబరు 6: అనకాపల్లి- పెందుర్తి- ఆనందపురం ఎన్‌ఏహెచ్- 16 ఆరు లైన్ల రహదారి విస్తరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో రాంపురం-గొరపల్లి రోడ్డు వద్ద అండర్ పాస్ వే నిర్మించాలని పరిసర ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. 15 గ్రామాలకు చెందిన విశాఖ, విజయనగరం జిల్లాల వాసులు పెందుర్తి మీదుగా విశాఖ, అనకాపల్లికి ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మార్గంలో పెందుర్తి మండలానికి చెందిన హర్షవర్థన్‌నగర్, కరకవానిపాలెం, గంగమ్మపేట, కోట్నివానిపాలెం, గవరపాలెం, గొల్లలపాలెం గ్రామాలు, విజయనగరం జిల్లాకు చెందిన కొత్తవలస, సంతపాలెం, గనిశెట్టిపాలెం, దెందేరు, గులివిందాడ రామచంద్రాపురం, గవరపాలెం, మిందివలస గ్రామాలున్నాయి. అందుకే ఈ మార్గం డిస్ట్రిక్ట్ మేజర్ రోడ్డుగా గుర్తింపు పొందింది. గొరపల్లి- కొత్తవలస రోడ్డును అనుసంఽధానిస్తూ అండర్ పాస్‌వే నిర్మించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. గొరపల్లి- కొత్తవలస రోడ్డును అనుసంధానిస్తూ అండర్ పాస్‌వే నిర్మించకపోతే అర కిలో మీటరు ప్రయాణించి రాంగ్‌రూట్‌లో రోడ్డును దాటాల్సి వస్తుంది. ఆయా గ్రామాలకు రోజూ వందలాది ఆటోలు, కార్లు, లారీలు ఇటుగా రాకపోకలు సాగిస్తుంటాయి. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు నిత్యం రోడ్డు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ అండర్ పాస్‌వే నిర్మించకపోతే కష్టాలు తప్పవని వారంతా వాపోతున్నారు.
పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం
పెందుర్తి మండలంలోని రాజయ్యపేట, గుర్రమ్మపాలెంలో సుమారు 800 మీటర్ల దూరంలో రెండు అండర్ పాస్ వేలు నిర్మించారు. అయితే జిల్లా మేజర్ రోడ్డు 119గా గుర్తింపు పొందిన గొరపల్లి రోడ్డులో అండర్ పాస్‌వే ఎందుకు నిర్మించరని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్షవర్థన్‌నగర్ వద్ద జరుగుతున్న విస్తరణ పనులను ఇటీవల అడ్డుకున్నారు. సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. కానీ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనిపై సంబంధిత అధికారుల వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా వారు స్పందించలేదు.