విజయసాయి, అవంతికి ఎందుకు చిర్రెత్తుకొచ్చింది!?

ABN , First Publish Date - 2020-12-28T18:40:00+05:30 IST

విశాఖలో ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి అవంతికి ఎందుకు చిర్రెత్తుకొచ్చింది.

విజయసాయి, అవంతికి ఎందుకు చిర్రెత్తుకొచ్చింది!?

విశాఖలో ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి అవంతికి ఎందుకు చిర్రెత్తుకొచ్చింది. నాయకులు, అధికారులపై ఎందుకు ఫైర్‌ అయ్యారు. సొంత పార్టీపై ఓ నాయకుడు విమర్శలు చేస్తే మంత్రి అవంతి ఎలా రియాక్ట్‌ అయ్యారు? వైఎస్సార్ కప్ పేరుతో నిర్వహించిన క్రికెట్‌ పోటీల ప్రారంభ కార్యక్రమాన్ని సక్సెస్‌ కాకపోవడానికి రీజన్‌ ఏమిటి? క్రిస్మస్‌ వేడుకల్లో జరిగిన పొరపాట్లు ఏమిటి? వాచ్ దిస్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్ స్టోరీ.. 


అసలేం జరిగింది..!?

విశాఖ‌లో ఇటీవల జరిగిన రెండు కార్యక్రమాల్లో జనసమీకరణ తగ్గడం ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌కు తెగ చిరాకు తెప్పించాయట. ఈ విషయంపై నాయకులు, అధికారులపై వారు కారాలు, మిరియాలు నూరారట. విజ‌య‌సాయిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్‌ జన్మదిన వేడుక‌లకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల కేక్ క‌టింగ్‌లు,  ర్యాలీలు, చీర‌లు పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. ఒకవైపు విజయసాయి, మరోవైపు మంత్రి అవంతి,ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. 


సాయంత్రం 4 అవుతున్నా..

వైఎస్సార్ కప్ పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు నుండి జనవరి 9 వరకు ఈ పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. యువతను పార్టీ క్యాడర్‌ను మరింత ఆకట్టుకోవాలని స్పోర్ట్స్ స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఉదయం నుంచి పార్టీ కార్యక్రమాలు, సీఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు అన్నిచోట్ల నిర్వహించడంతో..సాయంత్రం స్పోర్ట్‌ స్టేడియంలో ప్రారంభ కార్యక్రమానికి క్రీడాకారులు, కార్యకర్తలు కరువయ్యారు. అప్పటివరకు పాసులు ఉన్నవారికి మాత్రమే  లోపలికి అనుమతించారు. సాయంత్రం నాలుగవుతున్నా కుర్చీలు నిండే పరిస్థితి  కనిపించలేదట. దీంతో పాసులు  అక్కర్లేదు.. ఎవరు వచ్చినా లోపలికి అనుమతించాలని స్వయంగా మంత్రి అవంతి పోలీసులకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నేతలు వచ్చే సమయానికి కాస్త జనం కనిపించారట. అంతకు ముందు వచ్చిన కార్యకర్తలు, క్రీడాకారులు, అసలు ప్రారంభోత్సవం జరిగే సమయానికి రాలేదట.


అన్ని సీట్లు ఖాళీ..

జన సమీకరణలో నేతలు విఫలమయ్యారని విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారట. చివరికి విజయసాయి రెడ్డి మాట్లాడే సమయానికి ముందువరుస సీట్లలో తప్పితే వెనకాల అన్ని సీట్లు ఖాళీగా కనిపించాయట. మరుసటి రోజు ఇదే విషయం దినపత్రికల్లో వచ్చేసరికి పార్టీ నేతలకు విజయసాయిరెడ్డి గట్టిగానే క్లాస్‌ పీకినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లోనూ ఇలాంటి సీన్ రిపీట్ అయింది. ఈ వేడుకల్లో అధికారులు, నేతలు తప్పితే సంబరాలు జరుపుకునే క్రిస్టియన్లు కనిపించలేదట. ఈ కార్యక్రమానికి వచ్చిన వైసిపి నేత రెహ్మాన్ బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసేటప్పుడు నలుగురిని పిలిస్తే ఎవరైనా వస్తారు కదా అన్నారట. మీడియాలో వచ్చేందుకు హడావుడి చేస్తే వాటి వల్ల ప్రయోజనం ఉండదని విమర్శించారు. అందరిని కలిసికట్టుగా కలుపుకొనిపోతేనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయని పెదివి విరిచారు.


ఏమీ చేయలేని పరిస్థితి..

అన్ని మతాలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈ విషయంలో మంత్రి అవంతి కలుగజేసుకుని..కోవిడ్ నిబంధనల వలన ఎక్కువ మందిని పిలవలేదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సొంతపార్టీ నేతలే బహిర్గతంగా విమర్శించడంపై మంత్రికి కోపం వచ్చినా ఏం చేయలేని పరిస్థితిలో సైలెంట్‌గా ఉండిపోయారట. దాంతో కలెక్టర్‌తో మాట్లాడుతూ కాస్త జనాలు వచ్చేలా చూసుకోవాలి కదా అని అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారట. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రి అవంతికి చిరాకు వస్తే, సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో విజయసాయి రెడ్డికి మిగతా నేతలకు కోపం వచ్చిందంటున్నారు. 

Updated Date - 2020-12-28T18:40:00+05:30 IST