గ్రావెల్‌ తవ్వకాలపై విజిలెన్స్‌

ABN , First Publish Date - 2020-12-28T05:53:56+05:30 IST

ఇంతవరకు విపక్ష పార్టీల సానుభూతిపరులు, తటస్థులు నిర్వహిస్తున్న గ్రావెల్‌, రాయి క్వారీల్లో తనిఖీలు చేపట్టి, లీజు నిబంధనలకు విరుద్ధంగా త్వకాలు చేపట్టారంటూ కోట్లాది రూపాయల జరిమానా విధించిన గనుల శాఖ.... ఇప్పుడు అధికార పార్టీ నేతల మైనింగ్‌ అక్రమాలపై దృష్టి సారించింది.

గ్రావెల్‌ తవ్వకాలపై విజిలెన్స్‌
రాంబిల్లి మండలం పంచదార్ల కొండవాలులో జరిపిన గ్రావెల్‌ తవ్వకాలు(ఫైల్‌ ఫొటో)

రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో అడ్డగోలుగా గ్రావెల్‌ తవ్వకాలు

తాత్కాలిక అనుమతుల పేరిట భారీగా గ్రావెల్‌ తరలింపు

సెజ్‌ కంపెనీలు, బార్క్‌, ఎన్‌ఏవోబీల్లో ల్యాండ్‌ లెవెలింగ్‌కు సరఫరా

కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్న అధికార పార్టీ నాయకులు

తెరవెనుక ‘ఎలమంచిలి’ ముఖ్యనేత 

స్థానికుల ఫిర్యాదులతోపాటు ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు

తన భూమిలో గ్రావెల్‌ తవ్వారంటూ ఓ వైసీపీ నేత సైతం గనుల శాఖ మంత్రికి ఫిర్యాదు

విచారణ చేపట్టాలని అమాత్యుల ఆదేశం

తాత్కాలిక పర్మిట్లు, గ్రావెల్‌ తవ్వకాలపై గనుల శాఖ విజిలెన్స్‌ విచారణ

భారీగా జరిమానాలు విధించే అవకాశం


(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి)

ఇంతవరకు విపక్ష పార్టీల సానుభూతిపరులు, తటస్థులు నిర్వహిస్తున్న గ్రావెల్‌, రాయి క్వారీల్లో తనిఖీలు చేపట్టి, లీజు నిబంధనలకు విరుద్ధంగా త్వకాలు చేపట్టారంటూ కోట్లాది రూపాయల జరిమానా విధించిన గనుల శాఖ.... ఇప్పుడు అధికార పార్టీ నేతల మైనింగ్‌ అక్రమాలపై దృష్టి సారించింది. ఎలమంచిలి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు బినామీలతో నిర్వహిస్తున్న గ్రావెల్‌ క్వారీల్లో అక్రమ తవ్వకాలపై విచారణకు శ్రీకారం చుట్టింది. అనుమతులకు మించి భారీగా గ్రావెల్‌ తవ్వనట్టు ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో గనుల శాఖలో కదలిక వచ్చింది. తాత్కాలిక పర్మిట్ల పేరుతో ఏళ్లతరబడిగా సాగుతున్న గ్రావెల్‌ తవ్వకాల్లో అక్రమాల నిగ్గుతేల్చాలని నిర్ణయించింది.


రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్థిక మండలి(ఎస్‌ఈజడ్‌-సెజ్‌)లో ప్రైవేటు కంపెనీలు, ఫ్యాక్టరీలు నిర్మాణ సమయంలో ల్యాండ్‌ ఫిల్లింగ్‌ కోసం భారీ మొత్తంలో గ్రావెల్‌ అవసరమైంది. ఇంకా  బార్క్‌, ఎన్‌ఏవోబీల నిర్మాణం చేపట్టడంతో గ్రావెల్‌కు మరింత గిరాకీ పెరిగింది. ఎలమంచిలి నియోజకవర్గం రాజకీయాల్లో సుమారు 15 ఏళ్ల నుంచి చక్రం తిప్పుతున్న ఓ ముఖ్యనాయకుడు, ఆయన అనుచరులు... గ్రావెల్‌ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవాలని భావించారు. బినామీలను రంగంలోకి దించారు. రాంబిల్లి మండలం పంచదార్ల, ధారభోగాపురం; అచ్యుతాపురం మండలం నునపర్తి పంచాయతీ నడింపల్లిలోని కొండవాలు ప్రాంతాల్లో గ్రావెల్‌ తవ్వకాల కోసం పదేళ్ల క్రితం గనుల శాఖకు దరఖాస్తు చేశారు. రాంబిల్లి మండలం పంచదార్ల కొండలో సర్వే నంబరు-1లో 20 నుంచి 25 హెక్టార్ల వరకు గ్రావెల్‌ తవ్వకాల కోసం పలుచోట్ల గత పదేళ్లలో పలుమార్లు తాత్కాలిక పర్మిట్లు తీసుకున్నారు. అచ్యుతాపురం మండలం నునపర్తి పంచాయతీ నడింపల్లిలో సర్వే నంబరు 80 నుంచి 95 వరకు కూడా పలుచోట్ల సుమారు 20 హెక్టార్లలో కూడా గ్రావెల్‌ తవ్వకాలకు తాత్కాలిక పర్మిట్లు పొందారు. ఈ క్వారీల నుంచి లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తరలించారు. నడింపల్లిలో కొండ నుంచి గ్రావెల్‌ తరలించడానికి ప్రత్యేకించి రోడ్డు వేశారు. తాత్కాలిక పర్మిట్లు ఇచ్చిన క్వారీల్లో గ్రావెల్‌ తవ్వకాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన గనుల శాఖ అధికారుల కాళ్లకు ‘మామూళ్ల’ బంధాలు వేశారు. దీంతో ఈ శాఖ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి అయినా చూడలేదు. అక్రమ మైనింగ్‌పై ఎవరైనా గనుల శాఖకు ఫిర్యాదు చేస్తే.... అక్రమార్కులు వారిని వేధించడం, బెదిరించడం వంటివి చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పోలీసు శాఖల అధికారులు తమకేమి పట్టనట్టుగా వ్యవహరించడంతో అక్రమార్కులు బరితెగించారు. ఈ రెండు మండలాల్లో గ్రావెల్‌ తవ్వకాలపై ఈ ఏడాది ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. లాక్‌డౌన్‌ సమయంలోనూ గ్రావెల్‌ తరలించిన వైనాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం ధారభోగాపురం గ్రామస్థుల ఫిర్యాదుతో గనుల శాఖ విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. అక్కడి క్వారీల్లో తనిఖీలు చేసి, గ్రావెల్‌ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారించి జరిమానా విధించారు. కానీ పంచదార్ల, నడింపల్లి క్వారీల్లో విచారణ చేయలేదు. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాల ఆధారంగా కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో వైసీపీ కృష్ణా జిల్లా వ్యక్తికి చెందిన నడింపల్లిలోని భూమిలో గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టడంతో ఆయన నేరుగా గనుల శాఖామంత్రికి ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన గనుల శాఖ మంత్రి.... రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో గ్రావెల్‌ తవ్వకాలకు సంబంధించి తాత్కాలిక పర్మిట్లపై విచారణ చేపట్టాలని ఆ శాఖ విజిలెన్స్‌ అధికారులను ఆదేశించారు. దీంతో కొద్దిరోజుల నుంచి ఆయా గ్రావెల్‌ క్వారీల్లో తనిఖీలు నిర్వహించి, కొలతలు తీస్తున్నారు.


డి.పట్టా భూముల్లో గ్రావెల్‌ తవ్వకాలు

రాంబిల్లి మండలం పంచదార్ల, ధారభోగాపురం; అచ్యుతాపురం మండలం నునపర్తి పంచాయతీ నడింపల్లిలోని కొండవాలు ప్రాంతాల్లో గతంలో నిరుపేదలకు డి.పట్టా భూములను ప్రభుత్వం పంపిణీ చేసింది. అక్రమార్కులు ఈ భూముల్లో గ్రావెల్‌ తవ్వకాల కోసం ఆయా పట్టాదారులను నయానో భయానో లొంగదీసుకున్నారు. పట్టా భూములు సాగుకు అనువుగా లేవని, వీటిని అభివృద్ధి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని రెవెన్యూ శాఖకు దరఖాస్తు పెట్టుకున్నారు. రోజుల వ్యవధిలోనే అనుమతులు ఇచ్చేలా సదరు నాయకుడి అనుచరులు చక్రం తిప్పారు. అనంతరం డి.పట్టా భూముల్లో తవ్వే మట్టి, గ్రావెల్‌ అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ రెవెన్యూ శాఖ జారీ చేసిన ఎన్‌ఓసీలతో గనుల శాఖకు దరఖాస్తు చేశారు. యథావిధిగా అక్కడ కూడా ఆగమేఘాలమీద అనుమతులు లభించాయి. దీంతో గ్రావెల్‌ తవ్వకాలపై విచారణ అనంతరం డి.పట్టా కలిగిన రైతులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని గనుల శాఖ నిర్ణయించింది. కాగా తీసుకున్న పర్మిట్ల కన్నా ఎన్నోరెట్టు అధికంగా గ్రావెల్‌ తవ్వినందున కోట్లాది రూపాయలు జరిమానా విధించే అవకాశం వుందని గనుల శాఖ వర్గాల సమాచారం. 


Updated Date - 2020-12-28T05:53:56+05:30 IST