అల్లిపురం జల్లెడ.. కరోనా బాధితుడి ఇంటిని పరిశీలించిన అధికారుల బృందం

ABN , First Publish Date - 2020-03-21T10:08:55+05:30 IST

విశాఖపట్నానికి కరోనా వైరస్‌ను తీసుకొచ్చిన 66 ఏళ్ల వృద్ధుడు నివసిస్తున్న అల్లిపురం ప్రాంతం ప్రస్తుతం పూర్తిగా అధికారుల పర్యవేక్షణలో ఉంది. మూడు కిలోమీటర్ల వరకు కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆ పరిధిలో

అల్లిపురం జల్లెడ.. కరోనా బాధితుడి ఇంటిని పరిశీలించిన అధికారుల బృందం

  • చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో గల 7,050 కుటుంబాల సర్వే
  • 140 బృందాల నియామకం
  • వారిలో ఎవరైనా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా
  • అనే విషయం తెలుసుకునేందుకు యత్నం
  • బయట నుంచి రాకపోకలు నిలిపివేత
  • అనధికారిక కర్ఫ్యూ వాతావరణం
  • విమ్స్‌లో 200 క్వారంటైన్‌ పడకలు సిద్ధం
  • కాంటాక్ట్‌ లిస్టు తయారీ..వివరాల సేకరణ


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): విశాఖపట్నానికి కరోనా వైరస్‌ను తీసుకొచ్చిన 66 ఏళ్ల వృద్ధుడు నివసిస్తున్న అల్లిపురం ప్రాంతం ప్రస్తుతం పూర్తిగా అధికారుల పర్యవేక్షణలో ఉంది. మూడు కిలోమీటర్ల వరకు కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆ పరిధిలో నివసిస్తున్న 7,050 కుటుంబాల గురించి సర్వే చేస్తున్నారు. ఇందుకోసం 140 బృందాలను ఏర్పాటుచేశారు. వారిలో ఎవరినైనా ఆ వృద్ధుడు కలిశాడా? మాట్లాడాడా? వాళ్లింటికి వెళ్లాడా??...అందులో ఎవరికైనా జ్వరం, జలుబు లక్షణాలు ఉన్నాయా? అనే వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వే శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కాగా శనివారం నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ కుటుంబాల్లో ఎవరికి ఎటువంటి లక్షణాలు కనిపించినా వారికి చికిత్స చేయడానికి, పరిశీలనలో వుంచడానికి విమ్స్‌ ఆస్పత్రిలో 200 పడకలతో క్వారంటైన్‌ వార్డులు సిద్ధం చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మూడు కిలోమీటర్ల పరిధి సర్వే పూర్తయిన తరువాత ఐదు కిలోమీటర్ల పరిధిలో వివరాలు సేకరించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌, వలంటీర్‌లతో సర్వే

శుక్రవారం ఉదయమే వైద్య, ఆరోగ్య శాఖ, విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)కు చెందిన ఉన్నతాధికారుల బృందం అల్లిపురంలో గల బాధితుడి ఇంటిని పరిశీలించింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు విషయాన్ని తెలియజేయడంతోపాటు వైరస్‌ లక్షణాలు ఎవరిలోనైనా వున్నాయేమోనని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. వైరస్‌ సోకిన వ్యక్తి వున్న ఇంటికి మూడు కిలోమీటర్లు పరిధిలో అంటే 28, 30 వార్డుల్లో మొత్తం సర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయించి అందుకు అనుగుణంగా 141 బృందాలను నియమించారు. ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు, వలంటీర్‌లతో కూడిన ఈ బృందం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. 


అనధికార కర్ఫ్యూ

అల్లిపురం ప్రాంతంలో శుక్రవారం అనధికార కర్ఫ్యూ వాతావరణం దర్శనమిచ్చింది. అల్లిపురంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎవరూ బయటకు రాకుండా, ఇతర ప్రాంతాలకు చెందినవారు అక్కడకు వెళ్లకుండా అధికారులు పూర్తిగా రహదారులను దిగ్బంధించారు. డాబాగార్డెన్స్‌, రైల్వేస్టేషన్‌, వన్‌టౌన్‌ తదితర ప్రాంతాల నుంచి అల్లిపురం ప్రాంతానికి వెళ్లే మార్గాలను మూసివేశారు. తాజా పరిస్థితులను చూసి పలువురు స్థానికులు భయాందోళన చెందుతున్నారు.  


భయం..భయం.. 

కరోనా వైరస్‌ బారినపడిన వ్యక్తికి తామెప్పుడైనా తారసపడ్డామా..?, ఎక్కడైనా అనుకోకుండా..? కలిశామా..? అన్న ఆందోళన ఈ ప్రాంతవాసుల్లో కనిపిస్తోంది. ఒక్క ఆ వ్యక్తి వద్దే వైరస్‌ ఆగిపోతుందో, లేక ఇంకా ఎంతమందికి వ్యాప్తి చెందుతుందో అని ఈ ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి వరకు ఈ ప్రాంతవాసులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అధికారులు వీలైనంత వరకు ఇళ్లల్లోనే వుండాలని, బయటకు రావొద్దని సూచించారు. 


ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించకుండా.. 

పాజిటివ్‌ కేసు నమోదైన వ్యక్తి చుట్టుపక్కల నుంచి వైరస్‌ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా అధికారులు తక్షణ చర్యలను చేపట్టారు. ఇంటి చుట్టుపక్కల  బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడంతోపాటు సోడియం హై పోక్లోరైడ్‌ సొల్యూషన్‌ స్ర్పే చేశారు. దీనివల్ల వైరస్‌ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా వుంటుందని అధికారులు చెబుతున్నారు. 


కాంటాక్ట్స్‌ జాబితా తయారీ

66 ఏళ్ల వృద్ధుడు మక్కా నుంచి వచ్చాక హైదరాబాద్‌, విశాఖపట్నం నగరాల్లో ఎవరెవరిని కలిశారో అధికారులు కాంటాక్టు జాబితా తయారు చేస్తున్నారు. హైదరాబాద్‌లో వాళ్ల అమ్మాయి, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఎక్కిన కాచీగూడ ఎక్స్‌ప్రెస్‌, ఏసీ బోగీ నంబరు బీ1- సీటు నంబరు 58, దాని పక్కన గల ఎనిమిది సీట్లలో ప్రయాణించినవారు, ఆ బోగీలోకి వెళ్లిన వెండర్లు, రైలు దిగిన తరువాత ఇంటికి చేరడానికి ఎక్కిన ఆటో, ఆ తరువాత రోజు ఎన్‌ఏడీ జంక్షన్‌లో డాక్టర్‌ దగ్గరకు వెళ్లడానికి ఎక్కిన ఆటో, క్లినిక్‌లో డాక్టరు, ఇతర సిబ్బంది, అటు నుంచి ఇంటికి చేరిన ఆటో, మళ్లీ రెండో రోజు ఎక్కిన ఆటో, తిరిగి వచ్చిన ఆటో వివరాలు సేకరిస్తున్నారు. అలాగే ఛాతీ ఆస్పత్రికి వెళ్లిన ఆటో వివరాలు తీసుకుంటున్నారు. ఈ మధ్యలో ఆయన మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేశారని, మక్కా నుంచి తీసుకువచ్చిన జలాన్ని బంధువులకు ఇచ్చారని తెలిసింది. మక్కా నుంచి వచ్చాక ఆయన ఎవరెవరిని కలిసిందీ తెలుసుకుంటున్నారు. వారికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు.


విదేశాల నుంచి 1100 మంది రాక

కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి ఎవరెవరు వస్తున్నారు? ఏ జిల్లాకు వెళుతున్నారనే విషయాన్ని ఇమ్మిగ్రేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా జాబితా రూపొందిస్తోంది. వారి లెక్కల ప్రకారం విశాఖపట్నం జిల్లాకు ఇటీవల 850 మంది వచ్చారు. అదే విధంగా వార్డు వలంటీర్లతో ఇంటింటికి సర్వే నిర్వహించినప్పుడు 221 మంది విదేశాల నుంచి వచ్చినట్టు రికార్డు అయింది. విదేశాల నుంచి వచ్చిన వారు విశాఖపట్నంలో మొత్తం 1100 మంది ఉన్నారు. వారి క్వారంటైన్‌ పీరియడ్‌ పూర్తయ్యేవరకు నిరంతరం వైద్యబృందాలు వారిని పరిశీలిస్తున్నాయని జాయింట్‌ కలెక్టర్‌ వివరించారు. 

Updated Date - 2020-03-21T10:08:55+05:30 IST