సాగునీటిపై చిన్నచూపు

ABN , First Publish Date - 2020-12-15T06:14:16+05:30 IST

మన్యంలో చిన్న తరహా సాగునీటి వనరుల బాగోగులను ప్రభుత్వం గాలికొదిలేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్‌ఎంఐకి కనీస స్థాయిలో కూడా నిధులు కేటాయించలేదని గిరిజన రైతులు చెబుతున్నారు.

సాగునీటిపై చిన్నచూపు
మరమ్మతులకు నోచుకోని జి.మాడుగుల మండలం వెన్నెల గ్రామంలోని చెక్‌డ్యామ్‌

ఏజెన్సీలో చెక్‌డ్యామ్‌ల డనిర్వహణను గాలికొదిలేసిన వైసీపీప్రభుత్వం

గత ఏడాది రూ.10 కోట్లు మాత్రమే మంజూరు

రూ.3 కోట్లు బిల్లులు మాత్రమే క్లియర్‌

రూ.3.5 కోట్ల బిల్లులు పెండింగ్‌

ఈ ఏడాది ప్రతిపాదనలు కూడా అడగని వైనం

ఖాళీగా ఎస్‌ఎంఐ ఇంజనీర్లు

ఇతర శాఖలకు డెప్యూటేషన్‌

గత ప్రభుత్వ హయాంలో ఏటా రూ.25 కోట్లతో పనులు


పాడేరు, డిసెంబరు 14: మన్యంలో చిన్న తరహా సాగునీటి వనరుల బాగోగులను ప్రభుత్వం గాలికొదిలేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్‌ఎంఐకి కనీస స్థాయిలో కూడా నిధులు కేటాయించలేదని గిరిజన రైతులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏటా సుమారు రూ.25 కోట్లతో సాగునీటి వనరుల నిర్మాణం, నిర్వహణ పనులు చేపట్టేవారని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏడాదిన్నర కాలంలో పట్టుమని రూ.10 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఏజెన్సీలో గిరిజన రైతులకు చెక్‌డ్యామ్‌లే ప్రధాన సాగునీటి వనరులు. మన్యంలోని 11 మండలాల్లో 1,566 చిన్నతరహా సాగునీటి (చెక్‌ డ్యామ్‌లు) వనరులున్నాయి. వీటికింద 66 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. భారీవర్షాలు, వరదల ఉధృతి కారణంగా చెక్‌ డ్యామ్‌లు దెబ్బతింటుంటాయి. దీంతో రెండేళ్లకోసారి నిర్వహణ (మరమ్మతు) పనులు చేస్తుండాలి. ఇదే సమయంలో రెండు, మూడు దశాబ్దాల క్రితం నిర్మించి, పూర్తిగా ఛిద్రమైన చెక్‌డ్యామ్‌ల స్థానంలో కొత్తవి నిర్మించాలి. లేకపోతే నీరు నిల్వ వుండక ఆయకట్టు రైతులు ఇబ్బంది పడతారు. తెలుగుదేశం హయాంలో చిన్నతరహా సాగునీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ, నీరు-చెట్టు పథకాల ద్వారా ఏటా రూ.25 కోట్లతో చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు, కొత్త నిర్మాణాలు, పంట కాలువల తవ్వకం వంటి పనులు జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు-చెట్టు పథకాన్ని ఎత్తివేశారు. చెక్‌డ్యామ్‌ల నిర్వహణపై శీతకన్ను వేశారు. గత ఏడాది నవంబరులో 96 సాగునీటి వనరుల మరమ్మతులకు రూ.10 కోట్లు మంజూరు చేయాలంటూ ఎస్‌ఎంఐ అధికారులు జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. డిసెంబరులో ఆమోదం లభించింది. ఆయా పంచాయతీల ప్రత్యేక అధికారులు పనులు చేపట్టారు. వీటిలో 30 పనులకు రూ.3 కోట్ల మేర బిల్లులు మంజూరయ్యా యి. మరో 35 పనులకు సుమారు రూ.3.5 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులు చేపట్టిన ఆయా ప్రత్యేకాధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బిల్లులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు యత్నిస్తున్నప్పటికీ ఫలితం వుండడంలేదు. సొంతసొమ్ముతో పనులు చేయించామని, బిల్లులు క్లియర్‌ అవుతాయో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇక 2020- 21 ఆర్థిక సంవత్సరంలో చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. సాగునీటి వనరుల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు.  


నియోజకవర్గానికి రూ.20 కోట్లు కేటాయించినా...

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.20 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో కూడా సాగునీటి వనరులకు చోటు లభించ లేదు. ఈ నిధులను మెటల్‌ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. 


ఇంజనీర్ల డెప్యూటేషన్‌

చిన్నతరహా నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఖాళీగా వున్నారన్న భావనతో ప్రభుత్వం వారిని డెప్యూటే షన్‌పై ఇతర శాఖలకు పంపుతున్నది. ఏజెన్సీ ఎస్‌ఎం ఐలో ఇద్దరు డీఈఈలు, పది మంది ఏఈఈలు ఉన్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, విలేజ్‌ క్లినిక్‌ భవన నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతను వీరికి అప్పగించారు.

Updated Date - 2020-12-15T06:14:16+05:30 IST