తుని ఘటనపై విచారణ వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-08-01T09:40:36+05:30 IST
తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపుగర్జన సందర్భంగా 2016లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టిన ఘటనపై నమోదైన ..

మానవ హక్కుల వేదిక డిమాండ్
విశాఖపట్నం, జూలై 31(ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపుగర్జన సందర్భంగా 2016లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టిన ఘటనపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఆ ఘటనపై 69 కేసులు నమోదు కాగా ప్రభుత్వం మొదట 51 కేసులు, రెండోసారి 17 కేసులను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని ఇది అధికార దుర్వినియోగమని వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుధ, రాష్ట్ర కార్యదర్శి వై.రాజేశ్‌ల శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు.
ఇలా కేసులు ఉపసంహరించడం వల్ల ప్రజలకు రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై నమ్మకం పోతుందని పేర్కొన్నారు. రైతులు, అంగన్‌వాడీ వర్కర్లు, మునిసిపల్, సఫాయి కార్మికులు, అసంఘటిత కార్మికులు న్యాయమైన హక్కుల కోసం శాంతియుత నిరసన వ్యక్తంచేసినపుడు పెట్టిన కేసుల విషయంలో ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే కేసుల రద్దు జీఓలను ఉపసంహరించుకొని విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.