-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Troubles for the sand
-
ఇసుక కోసం కష్టాలు
ABN , First Publish Date - 2020-06-23T09:41:30+05:30 IST
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న 72 గంటల్లో కొనుగోలుదారులకు ఇసుక సరఫరా చేస్తామన్న పాలకులు, అధికారుల ప్రకటనలు ఉత్తుత్తివేనని ..

ఆన్‌లైన్‌లో బుక్ చేసి రెండు వారాలైనా సరఫరా కాని వైనం
నర్సీపట్నం డిపోలో 2,100 టన్నుల ఇసుక కోసం 200 మంది నిరీక్షణ
రూ.26 లక్షలు చెల్లించి...పక్షం రోజుల నుంచి ప్రదక్షిణలు
నర్సీపట్నం, జూన్ 22: ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న 72 గంటల్లో కొనుగోలుదారులకు ఇసుక సరఫరా చేస్తామన్న పాలకులు, అధికారుల ప్రకటనలు ఉత్తుత్తివేనని భవన నిర్మాణదారులు ఆరోపిస్తున్నారు. డబ్బు చెల్లించి పక్షం రోజులు అయినా ఇంటికి ఇసుక చేరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నర్సీపట్నం(గబ్బాడ)లోని ప్రభుత్వ ఇసుక డిపోలో ఈ నెల 7వ తేదీ నుంచి ఇసుక సరఫరా నిలిచిపోయింది. సుమారు 200 మంది భవన నిర్మాణదారులు తమ అవసరాల కోసం 2,100 టన్నుల ఇసుక కోసం ఆన్‌లైన్ నమోదు చేసుకుని ప్రభుత్వానికి సుమారు రూ.26 లక్షలు చెల్లించారు. వీరంతా 15 రోజుల నుంచి ఇసుక కోసం నిరీక్షిస్తున్నారు. ఇసుక సరఫరా కాకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. వర్షాలు మొదలైతే పనులు చేయడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో పలువురు ఇసుక కోసం రోజూ డిపో చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా ఇసుక ఎప్పుడు వస్తుందో చెప్పలేమని అంటున్నారు.
ఇదిలావుండగా నర్సీపట్నం డిపోకు రెండు వారాల నుంచి ఇసుక సరఫరా కాకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలిసింది. రాజమండ్రి నుంచి నర్సీపట్నానికి ఇసుక రవాణా చేసేందుకు కిలోమీటర్‌కు రూ.4.90 చెల్లించనున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇసుక రవాణాకు ఇటీవల మళ్లీ టెండర్లు పిలవగా ఒక కాంట్రాక్టర్ రూ.3.30లకే సరఫరా చేస్తానంటూ అందరికన్నా తక్కువ ధరకు టెండర్ వేశారు. కానీ ఆయన ఇంతవరకు ఇసుక రవాణా చేయలేదు. అధికారులు కూడా పట్టించుకోలేదు. దీంతో ఈ నెల 7వ తేదీ నుంచి ఇసుక రావడం లేదు. పది రోజుల క్రితం పది టన్నుల ఇసుకను బుక్ చేసి డబ్బులు చెల్లించానని, ఇంతవరకు సరఫరా కాలేదని పట్టణానికి చెందిన బి.తాతాజీ వాపొయారు. ఇసుక వస్తుందని రోజూ ఎదురు చూడడమే తప్ప ఎప్పుడు వస్తుందో డిపో సిబ్బంది కూడా చెప్పడంలేని సీహెచ్ సత్యనారాయణ అనే భవన నిర్మాణదారుడు వాపోయారు.