పోటెత్తిన పర్యాటకులు
ABN , First Publish Date - 2020-12-07T05:49:08+05:30 IST
కరోనా వైరస్ లాక్‌డౌన్ అనంతరం విశాఖ మన్యంలోని పర్యాటక ప్రాంతాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. ఉదయం నుంచే మంచు అందాలను ఆస్వాదించారు.

కిటకిటలాడిన పర్యాటక ప్రదేశాలు
ఉదయం నుంచే సందడే సందడి
బొర్రాగుహలుకు 7,500 మంది సందర్శన
మ్యూజియంకు 4,500 మంది..
పద్మాపురం గార్డెన్ కు 3,282 మంది..
కొత్తపల్లి జలపాతానికి పది వేల మంది..
బొర్రాగుహలు ఆదాయం రూ.5.6 లక్షలు
కొత్తపల్లి జలపాతానికి రూ.లక్ష ఆదాయం
కొత్తపల్లి జలపాతం వద్ద నాలుగు గంట ట్రాఫిక్‌జామ్
అరకులోయ/అరకురూరల్/అనంతగిరి/పాడేరురూరల్/చింతపల్లి, డిసెంబరు 6:
కరోనా వైరస్ లాక్‌డౌన్ అనంతరం విశాఖ మన్యంలోని పర్యాటక ప్రాంతాలకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. ఉదయం నుంచే మంచు అందాలను ఆస్వాదించారు. పది గంటల దాటిన తర్వాత ఎటుచూసినా పర్యాటకులే కనిపించారు. ప్రముఖ పర్యాటక కేంద్రాలైన బొర్రాగుహలు, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, కటికి జలపాతం, డుంబ్రిగుడ చాపరాయి, జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతాల వద్ద పర్యాటకులు సందడి చేశారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రిసార్టులు రద్దీగా మారాయి. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. పర్యాటకులు పోటెత్తడంతో వాహనాల పార్కింగ్‌కు స్థలాలు లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పార్కింగ్ చేశారు.
అందాల అరకులోయలో ఉదయం నుంచే పర్యాటకులు సందడి చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి మంచు అందాలను ఆస్వాదించారు. గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, కాఫీ హౌస్‌లు కిక్కిరిసిపోయాయి.
బొర్రా గుహలును ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 7,500 మంది పర్యాటకులు సందర్శించగా, రూ.5.6 లక్షల ఆదాయం వచ్చింది. అరకులోయలో మ్యూజియంకు 4,500 మంది, పద్మాపురం గార్డెన్‌కు 3,282 మంది పర్యాటకులు సందర్శించారు. గతంలో ఎప్పుడూ ఇంతమంది సందర్శించలేదని గిరిజన మ్యూజియం మేనేజర్ బొంజిబాబు తెలిపారు. బొర్రాగుహలుకు సాయంత్రం ఆరు గంటలు అయినప్పటికీ సందర్శకులు వస్తునే ఉండడంతో టూరిజం అధికారులు టిక్కెట్‌లను విక్రయిస్తునే ఉన్నారు. కార్తీకమాసం, ఆదివారం కావడంతో పర్యాటక ప్రాంతాలన్నీ పర్యాటకులతో కళకళలాడుతూ కనిపించాయి.
డుంబ్రిగుడ మండల పరిధిలోని చాపరాయి జలపాతం ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యాటకుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు అనేక ఇబ్బందులు పడ్డారు.
జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం కిక్కిరిసిపోయింది. ఆదివారం ఒక్కరోజు పది వేల మంది పర్యాటకులు సందర్శించారు. రూ.లక్ష ఆదాయం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. కొత్తపల్లి జలపాతం వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది. సందర్శకులు వేల సంఖ్యలో రావడంతో వాహనాలన్నీ రోడ్డుపై ఇష్టానుసారంగా నిలిపివేయడంతో రాకపోకలు నాలుగు గంటల సేపు నిలిచిపోయాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. జలపాతానికి ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.