నేటి నుంచి టిడ్కో ఇళ్ల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-27T06:21:28+05:30 IST

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలో గత తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం ప్రారంభం కాబోతోంది.

నేటి నుంచి టిడ్కో ఇళ్ల పంపిణీ

21న ముగిసిన లాటరీ తీసినట్టు అధికారుల ప్రకటన

ఇంతవరకూ బయటపెట్టకపోవడంతో

లబ్ధిదారుల్లో అనుమానాలు 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలో గత తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం ప్రారంభం కాబోతోంది. అయితే లబ్ధిదారుల ఎంపికకు లాటరీ ప్రక్రియ ఈనెల 21వ తేదీనే ముగిసిందని అధికారులు ప్రకటించినప్పటికీ జాబితాను ఇప్పటివరకూ బహిర్గతం చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం ఉత్తర నియోజకవర్గ పరిధిలో ఇళ్ల పంపిణీ ప్రారంభించనున్నట్టు జీవీఎంసీ అధికారులు ప్రకటించడంతో జాబితాలో తమ పేరు ఉంటుందో...ఉండదోనని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. 


జీవీఎంసీ పరిధిలో టిడ్కో ఇళ్ల కోసం 30,083 మంది డీడీలు చెల్లించగా, 24,192 ఇళ్ల నిర్మాణం మాత్రమే జరిగింది. దీంతో లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు లాటరీ తీయాలని నిర్ణయించారు. ఈ నెల 21న స్వర్ణభారతి స్టేడియంలో లాటరీ ప్రక్రియ పూర్తిచేసినట్టు అధికారులు ప్రకటించారు. ఎంపికైన వారి జాబితాలను అన్ని జోనల్‌ కార్యాలయాలకు పంపించినట్టు వెల్లడించారు. అయితే జోనల్‌ కార్యాలయాల్లోగానీ, వార్డు సచివాలయాల్లోగానీ ఎంపికైన వారి జాబితాలను ప్రదర్శించకపోవడంతో అసలు లాటరీ తీశారా? లేదా? అనే అనుమానాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో లాటరీ ప్రక్రియ ముగిసిందని, ఆదివారం నుంచి ఇళ్ల పంపిణీ జరుగుతుందని అధికారులు ప్రకటించారు. ముందుగా ఉత్తర నియోజకవర్గం పరిధిలో ఎంపికైన వారికి ఆదివారం కైలాసపురంలోని డీఎల్‌బీ మైదానంలో మంజూరు పత్రాలను అందజేయనున్నట్టు యూసీడీ పీడీ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు తెలిపారు. అలాగే 29న పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు శ్రీహరిపురం కోరమాండల్‌ గేటు ఎదురుగా, 30న దక్షిణ నియోజకవర్గం పరిధి లబ్ధిదారులకు ఇందిరా ప్రియదర్శిని మైదానంలో, తూర్పు నియోజకవర్గం పరిధిలోని వారికి ఏఎస్‌ రాజా కళాశాల ప్రాంగణం లేదా స్వర్ణభారతి స్టేడియంలో, జనవరి ఒకటిన భీమిలి నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు మధురవాడలో, రెండున గాజువాక, మూడున పెందుర్తి, ఆరున అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల అందజేత కార్యక్రమం జరుగుతుందన్నారు. లాటరీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టామని, ఇళ్లు దక్కని వారికి ఇంటి స్థలం హామీ పత్రాలను అందజేస్తామని పీడీ తెలిపారు.

Updated Date - 2020-12-27T06:21:28+05:30 IST