అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలి
ABN , First Publish Date - 2020-12-07T05:55:51+05:30 IST
అనకాపల్లి - ఆనందపురం రహదారిలోని శంకరం గ్రామం వద్ద అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

శంకరం గ్రామస్థులు, దళిత సంఘాల నేతల డిమాండ్
అనకాపల్లి రూరల్, డిసెంబరు 6: అనకాపల్లి - ఆనందపురం రహదారిలోని శంకరం గ్రామం వద్ద అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రహదారిపై బైఠాయించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రహదారిపై ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం గుత్తేదారు తొలగించారు. విషయం తెలుసుకున్న స్థానికులు, దళిత నేతలు సంఘటన స్థలం వద్ద ఆందోళన చేపట్టారు.
రహదారి విస్తరణకు తాము సహకరిస్తున్నామని, విగ్రహం అడ్డుగా ఉదని తమ దృష్టికి తేస్తే మరో చోట ఏర్పాటు చేసుకుంటామని, సమాచారం లేకుండా ధ్వంసం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారకులను అరెస్టు చేసే వరకు కదిలేది లేదని భీష్మించారు. దీంతో రూరల్ ఎస్‌ఐ దాసరి ఈశ్వరరావు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడారు. విగ్రహం ధ్వంసానికి కారకులైన వారిని గుర్తించి, అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.