23 ఏళ్ల క్రితం విశాఖలో జరిగిన ఘోరమిది.. ఏకంగా 60 మంది..

ABN , First Publish Date - 2020-05-09T15:52:25+05:30 IST

విశాఖ నగరంలోని హెచ్‌పీసీఎల్‌లో 1997 సెప్టెంబరు 14న లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ లీకై సంభవించిన విస్ఫోటంలో 60 మంది మృత్యువాతపడ్డారు. సంస్థలోని భారీ స్పియర్స్‌లోకి నౌక నుంచి వచ్చిన గ్యాస్‌ను లోడింగ్‌ చేశారు.

23 ఏళ్ల క్రితం విశాఖలో జరిగిన ఘోరమిది.. ఏకంగా 60 మంది..

మల్కాపురం (విశాఖపట్నం): విశాఖ నగరంలోని హెచ్‌పీసీఎల్‌లో 1997 సెప్టెంబరు 14న లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ లీకై సంభవించిన విస్ఫోటంలో 60 మంది మృత్యువాతపడ్డారు. సంస్థలోని భారీ స్పియర్స్‌లోకి నౌక నుంచి వచ్చిన గ్యాస్‌ను లోడింగ్‌ చేశారు. అనంతరం స్పియర్‌ దిగువనున్న వాల్వు లీక్‌ కావడంతో సంస్థ మొత్తం గ్యాస్‌ వ్యాపించింది. అది గుర్తించని ఓ ఉద్యోగి క్యాంటీన్‌లోకి వెళ్లి స్టవ్‌ వెలిగించడంతో పెద్ద శబ్దంతో విస్ఫోటం సంభవించింది. ఈ ఘటనలో 60 మంది చనిపోయారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తేవడానికి ఐదు రోజుల సమయం పట్టింది. ఆ తరువాతే గ్యాస్‌ లోడింగ్‌లో క్రమేపీ మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం విశాఖ రిఫైనరీలోనే భూగర్భంలో భారీ స్పియర్స్‌ ఉంచి వాటిలో గ్యాస్‌ నిల్వ చేస్తున్నారు. గ్యాస్‌ ఫిల్లింగ్‌ కోసం పెట్రోపార్కు వరకు  భూగర్భం నుంచే పైప్‌లైన్‌ వేశారు. గ్యాస్‌ లోడింగ్‌కు సాగర దుర్గా బీచ్‌ సమీపంలో సొరంగం తవ్వి ఫిల్లింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.


నాటి ఉక్కు పేలుడులో 19 మంది మృతి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 2012 జూన్‌ 13న గ్యాస్‌ ప్రెజర్‌ వల్ల సంభవించిన అగ్ని ప్రమాదంలో 19 మంది మృతిచెందారు. విస్తరణ పనుల్లో భాగంగా స్టీల్‌ మెటల్‌షాప్‌లో ఉత్పత్తి పక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా బ్లోయింగ్‌కు గ్యాస్‌ అందలేదు. దీంతో ఉక్కు అధికారులు, కాంట్రాక్టు సంస్థలు దస్తూరి అండ్‌ కో, బ్లూ స్టార్‌ ఉద్యోగులు ప్రెజర్‌ రెగ్యులేటర్‌ స్టేషన్‌ (పీఆర్‌ఎస్‌)లో లోపాన్ని సరిదిద్దుతుండగా రాత్రి పది గంటల సమయంలో పేలుడు సంభవించింది. దీంతో అక్కడి 19 మందిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మిగిలినవారు గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు.

Updated Date - 2020-05-09T15:52:25+05:30 IST