జిల్లాలో మూడు డ్రైవింగ్ స్కూళ్లు
ABN , First Publish Date - 2020-03-16T06:54:56+05:30 IST
జిల్లాలో మూడు డ్రైవింగ్ స్కూళ్లు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పౌర రవాణా శాఖ (ఏపీపీటీడీ) విశాఖ రీజియన్ యాజమాన్యం నిర్ణయించింది.
ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వనున్న ఏపీ పౌర రవాణా శాఖ
ద్వారకా బ్‌సస్టేషన్, మార్చి 15: జిల్లాలో మూడు డ్రైవింగ్ స్కూళ్లు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పౌర రవాణా శాఖ (ఏపీపీటీడీ) విశాఖ రీజియన్ యాజమాన్యం నిర్ణయించింది. విశాఖపట్నం, అనకాపల్లి, అరకు ప్రాంతాల్లో ఈ డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నది. పీటీడీకి చెందిన డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్లు, అత్యున్నత నైపుణ్యం కలిగిన డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ సమక్షంలో సీనియర్ డ్రైవర్లు ఈ శిక్షణ ఇవ్వనున్నారు.
రాష్ట్రంలో భారీ వాహనాలు, బస్సులు నడిపేందుకు అర్హత కలిగిన డ్రైవర్ల కొరతగా ఎక్కువగా ఉందని, పబ్లిక్, ప్రైవేటు రంగాల్లో ఈ పరిస్థితి ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ ఒక డ్రైవింగ్ స్కూల్ నడపాలని నిర్ణయించింది. దీనిని నిర్వహించే బాధ్యతలను పీటీడీకి అప్పగించింది. ఇందులోభాగంగానే జిల్లాలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో డ్రైవింగ్ స్కూళ్లు నడిపేందుకు పీటీడీ విశాఖ రీజియన్ యాజమాన్యంనిర్ణయించింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ అర్హతలు తప్పనిసరి
ఎల్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్సు పొంది ఒక సంవత్సరం పూర్తిచేసి ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎల్‌ఎల్‌ఆర్ కలిగివుండాలి. లేకుంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఎల్‌ఎల్‌ఆర్ తీసుకోవాలి. అభ్యర్థి వయస్సు 20 ఏళ్లు పైబడి ఉండాలి. విద్యార్హత నిబంధన లేదు. శిక్షణ పొందగోరే అభ్యర్థులు రూ.20,000 ఫీజును సంబంధిత డిపో మేనేజర్ కార్యాలయంలో చెల్లించి రశీదు పొందాలి. ఒక్కో బ్యాచ్‌కు గరిష్ఠంగా 16 మంది అభ్యర్థుల పేర్లు నమోదయ్యాక 40 రోజుల పాటు శిక్షణ ప్రారంభమవుతుంది.
16 రోజులు శిక్షణ తరగతులు, మిగిలిన రోజులు రోజుకు 16 గంటల చొప్పున ప్రాక్టికల్ డ్రైవింగ్ శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో భోజన వసతి సౌకర్యాలను పీటీడీ సమకూరుస్తుంది. కనీసం 32 రోజులు శిక్షణ పూర్తి చేసినవారు హెచ్‌ఎంవీ లైసెన్సు పొందేందుకు అర్హులు. శిక్షణ సమయంలో అభ్యర్థుల డ్రైవింగ్ నైపుణ్యాన్ని తరచూ విశ్లేషించడం జరుగుతుంది. నిర్దేశిత పరీక్షను పూర్తిచేసిన అభ్యర్థులకు సంబంధిత రవాణాశాఖ అధికారులకు ఫారం-5 సర్టిఫికెట్‌తో పాటు ఫారం 14, 15లను సమర్పించి ఆర్టీఏ వారి డ్రైవింగ్ టెస్ట్‌కు పంపించి హెవీ డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు సిఫార్సులు చేసి లైసెన్సు అందజేయడం జరుగుతుందని రీజనల్ మేనేజర్ ఎంవై దానం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.