భర్తను హత్య చేసిన భార్య

ABN , First Publish Date - 2020-12-27T06:34:23+05:30 IST

మండలంలోని గోరాపూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో సెప్టెంబరు 4న జరిగిన గిరిజనుడు హత్య కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేశామని, వీరిలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు అరకు సీఐ పైడయ్య తెలిపారు.

భర్తను హత్య చేసిన భార్యగిరిజనుడి హత్య కేసులో ఇద్దరిపై కేసు

డుంబ్రిగుడ, డిసెంబరు 26: మండలంలోని గోరాపూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో సెప్టెంబరు 4న జరిగిన గిరిజనుడు హత్య కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేశామని, వీరిలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు అరకు సీఐ పైడయ్య తెలిపారు. శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అరకులోయ మండలం పానిరంగని గ్రామానికి చెందిన కారా రాము అలియాస్‌ రామచందర్‌(45) అనే గిరిజనుడు మూడు నెలల క్రితం గోరాపూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడన్నారు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేసిన అనంతరం కేసును అరకులోయ పోలీసులకు అప్పగించారన్నారు. మృతి చెందిన గిరిజనుడు హత్యకు గురైనట్టు గుర్తించారన్నారు. మృతుడి భార్య జమునను విచారించగా.. లోతేరు పంచాయతీ కుక్కటిగుడ గ్రామానికి చెందిన రవితో కలిసి హత్య చేసినట్టు అంగీకరించిందన్నారు. అప్పుగా ఇచ్చిన రూ.10వేల విషయంలో వివాదం ఏర్పడడంతో ఇద్దరూ కలసి హత్య చేసినట్టు విచారణలో తేలిందన్నారు. నిందితురాలు జమునను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి రిమాండ్‌కు తరలించామని, మరో నిందితుడు రవి కోసం గాలిస్తున్నామన్నారు. విలేకర్ల సమావేశంలో హెచ్‌సీ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2020-12-27T06:34:23+05:30 IST