ప్రాణాల మీదకు తెచ్చిన పరుగు

ABN , First Publish Date - 2020-05-09T07:16:37+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాద సమయంలో వెలువడిన విష వాయువును పీల్చిన వారిలో చిన్నారులతో పోలిస్తే పెద్దలే కొంతమేర ఎక్కువ

ప్రాణాల మీదకు తెచ్చిన పరుగు

పాలిమర్స్‌ ప్రమాదం తరువాత భయంతో పరుగులు తీసిన పెద్దలు

ఎక్కువ శ్వాస తీసుకోవడంతో అధిక మోతాదులో విషవాయువు పీల్చేసిన వైనం 

పెద్దలు ఎత్తుకొని తీసుకువెళ్లడంతో పిల్లలకు ఉపశమనం

చిన్నారుల్లో విష వాయువు తీవ్రత తక్కువగా

ఉండడానికి అదే కారణం అంటున్న వైద్యులు

కేజీహెచ్‌లో వివిధ రకాల వైద్య పరీక్షలు

ఎక్స్‌రేలో ముగ్గురికి ఇన్‌ఫెక్షన్‌ 

ఐదు నుంచి ఏడు రోజులపాటు పరిశీలన

మరోసారి పరీక్షలు చేసిన తరువాత డిశ్చార్జి


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)

ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాద సమయంలో వెలువడిన విష వాయువును పీల్చిన వారిలో చిన్నారులతో పోలిస్తే పెద్దలే కొంతమేర ఎక్కువ ప్రభావితం అయ్యారు. 52 మంది చిన్నారులను ఆస్పత్రిలో చేర్చగా, వీరందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. సాధారణంగా ఇటువంటి సంఘటనల్లో పెద్దలతో పోలిస్తే చిన్నారులపై ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. అయితే ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో చిన్నారులపై ప్రభావం తక్కువగా వుండడానికి...వారు ఆందోళనతో పరుగులు తీయకపోవడమే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.


శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, కళ్లు మండడం వంటి లక్షణాలతో పాలిమర్స్‌లో ఏదో ప్రమాదం జరిగిందన్న భయంతో పెద్దలు ఆందోళన చెందుతూ పరుగులు పెట్టారని, ఈ క్రమంలో అలిసిపోయి ఎక్కువగా గాలి పీల్చడంతో విషవాయువు ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్లిందని వైద్యులు చెబుతున్నారు. పదేళ్లలోపు పిల్లలను వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఎత్తుకుని వెళ్లారని, దీనివల్ల పిల్లలు అలిసిపోలేదని, తద్వారా ఎక్కువ గాలి పీల్చాల్సిన అవసరం ఏర్పడలేదన్నారు. అయితే కొంతమంది పిల్లలు ఇంటిలోనే స్పృహ తప్పి పడిపోయారని, ఇవన్నీ పిల్లలపై విషవాయువు ప్రభావం తక్కువ కావడానికి దోహదపడినట్టు వైద్యులు చెబుతున్నారు. 


5 నుంచి 7 రోజులు.. 

ఎల్‌జీ పాలిమర్స్‌ విషవాయువు ప్రభావానికి గురై, చికిత్స పొందుతున్న చిన్నారులను కనీసం ఐదు నుంచి వారం రోజులపాటు పర్యవేక్షణలో వుంచాలని వైద్య నిపుణులు నిర్ణయించారు. ఇప్పటికే ఊపిరితిత్తులు, మూత్రపిండాల పనితీరును పరిశీలించారు. రక్తం, మూత్ర పరీక్షలు చేశారు, ఎక్స్‌రేలు తీశారు. ముగ్గురు చిన్నారులకు ఇన్‌ఫెక్షన్‌ వున్నట్టు ఎక్స్‌రేలో తేలడంతో వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. మరో నలుగురు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా ఆక్సిజన్‌ అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. మిగిలిన చిన్నారులంతా ఆరోగ్యంగానే ఉన్నారు. రెండు, మూడు రోజుల తరువాత ఇవే పరీక్షలు నిర్వహించి, ఫలితాలు మెరుగ్గా వుంటే మరో మూడు రోజులు పర్యవేక్షణలో వుంచి డిశ్చార్జి చేస్తామని తెలిపారు. 


పిల్లలపై తక్కువ ప్రభావానికి అదే కారణం ..డాక్టర్‌ రామ్‌ గణేశ్‌, ప్రొఫెసర్‌, పీడియాట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌ 

సాధారణంగా మనం నడిచి వెళ్లేటప్పుడు ఒకరకంగా, పరుగెత్తేప్పుడు మరోరకంగా శ్వాస తీసుకుంటాం. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో పిల్లలను క్షేమంగా తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు యత్నించి వారిని ఎత్తుకుని పరుగెత్తారు. ఈ క్రమంలో పెద్దలు శ్వాస ఎక్కువగా తీసుకుని ఇబ్బందులకు గురయ్యారు. పిల్లలు మాత్రం సాధారణంగానే శ్వాస తీసుకోవడంతో విషవాయువు ప్రభావం వారిపై కొంత తక్కువ చూపింది.

Updated Date - 2020-05-09T07:16:37+05:30 IST