డిసెంబరు నాటికి ఎన్ఏడీ ఫ్లైఓవర్ పూర్తి
ABN , First Publish Date - 2020-07-08T09:41:14+05:30 IST
ఎన్ఏడీ జంక్షన్లో చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు ఆఖరుకు పూర్తవుతాయని వీఎంఆర్డీఏ చైర్మన్

వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్
విశాఖపట్నం, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఎన్ఏడీ జంక్షన్లో చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు ఆఖరుకు పూర్తవుతాయని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తెలిపారు. ఆయన ఈ పనులపై మంగళవారం వీఎంఆర్డీఏ కార్యాలయంలో వీడియో సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. దీనికి వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, పనులు చేస్తున్న విజయ్ నిర్మాణ్ కంపెనీ ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు. ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తయ్యాయని కాంట్రాక్టర్లు తెలిపారు.
ట్రాఫిక్ సమస్యలు, లారీల సమ్మె, ఇసుక లభించకపోవడం, కరోనా లాక్డౌన్ కారణంగా పనుల్లో జాప్యం జరిగిందని వివరించారు. ఎగువ రోటరీకి సంబంధించి విమానాశ్రయం నుంచి ఎన్ఎస్టీఎల్ వైపు వెళ్లే రహదారి నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే దీనిపై వాహనాలను అనుమతిస్తామని పేర్కొన్నారు. గోపాలపట్నం వైపు రహదారి పనులు ఆగస్టు 15కి, మర్రిపాలెం వైపు పనులు అక్టోబరు 15కి పూర్తి చేస్తామని వివరించారు. ఎన్ఎస్టీఎల్ నుంచి విమానాశ్రయం వైపు రహదారి పనులను నవంబరు 30కి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దిగువ రోటరీ పనులు డిసెంబరు నెలాఖరుకు పూర్తవుతాయన్నారు.
ఇక్కడ నిర్మించాల్సిన రైలు ఓవర్ బ్రిడ్జికి రైల్వే అధికారుల నుంచి ఇంకా అనుమతులు రాలేదని, అవి వచ్చిన నాటి నుంచి ఏడు నెలల వ్యవధిలో ఆ పనులు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో అడిషనల్ కమిషనర్ సామూన్, ఎస్ఈ కె.రామ్మోహన్రావు, సీయూపీ సురేశ్‌బాబు, సీఏఓ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.