కొండలు కరిగిపోతున్నాయ్‌!

ABN , First Publish Date - 2020-12-29T06:36:47+05:30 IST

అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అనుమతులు లేకుండా యథేచ్ఛగా గ్రావెల్‌ను తవ్వి, దర్జాగా తరలించేస్తున్నారు. అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు.

కొండలు కరిగిపోతున్నాయ్‌!
అసకపల్లి సర్వే నంబరు 1 కొండ వాలులో గ్రావెల్‌ తవ్విన దృశ్యం

యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు 

రాత్రి సమయాల్లో తరలింపు 

దృష్టిసారించని అధికారులు 

ప్రభుత్వ ఆదాయానికి  గండి 


సబ్బవరం, డిసెంబరు 28:


అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అనుమతులు లేకుండా యథేచ్ఛగా గ్రావెల్‌ను తవ్వి, దర్జాగా తరలించేస్తున్నారు. అధికార యంత్రాంగం కనీసం పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. గ్రావెల్‌ తవ్వకాలతో సబ్బవరం మండలంలోని పలు ప్రాంతాల్లో కొండలు ఇప్పటికే సగానికి పైగా కరిగిపోయాయి.


సబ్బవరం మండలం సెమీ అర్బన్‌గా గుర్తింపు పొందడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. దీనికి తోడు విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోందనే ప్రకటనలతో మండలంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో లే-అవుట్లు వెలుస్తున్నాయి. వీటి అభివృద్ధి, ఇళ్ల నిర్మాణాలు, రహదారుల ఏర్పాటు తదితర పనులకు గ్రావెల్‌, రాయి అవసరం వుండడంతో డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వ ఇళ్ల స్థలాల లేఅవుట్ల అభివృద్ధికి గ్రావెల్‌ అవసరం. అయితే అక్రమార్కులు ప్రభుత్వ సంపదను ప్రభుత్వానికే విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలోని అసకపల్లి సర్వే నంబర్‌ 1, అమృతపురం రాజ్‌చెరువు సర్వే నంబరు 294, సబ్బవరం సర్వే నంబరు 286, సూదికొండ, పల్లవానిపాలెం, గొల్లలపాలెం తదితర ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారం గ్రావెల్‌ తవ్వేస్తున్నారు. గత వారం వరకూ శని, ఆదివారాల్లో...రాత్రి సమయాల్లో గ్రావెల్‌ తవ్వి ట్రాక్టర్లు, లారీలు, డంపర్ల ద్వారా తరలించుకుపోయేవారు. ఇటీవల ప్రతిరోజూ రాత్రి పది నుంచి ఉదయం ఐదు గంటల వరకూ నిరాటంకంగా గ్రావెల్‌ తరలించుకుపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. డిమాండ్‌ను బట్టి ట్రాక్టర్‌ గ్రావెల్‌ ధర రూ.800 నుంచి 1,000, లారీ ధర రూ.1,800 నుంచి 2,000, డంపర్‌ లారీ గ్రావెల్‌ ధర రూ.5 వేలు నుంచి 8 వేల వరకూ విక్రయిస్తున్నారు. ఈ అక్రమాలపై విజిలెన్స్‌, మైనింగ్‌ అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చినా వారు స్పందించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. 


దాడులపై లీకవుతున్న సమాచారం 


ఒకవేళ మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులు క్షేత్రస్థాయి దాడులు చేసినా...ఆ సమాచారం ముందుగానే అక్రమార్కులకు చేరిపోతోంది. దీంతో వారు తప్పించుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి కార్యాలయంలోనూ కిందిస్థాయి సిబ్బందికి నెలవారీ ముడుపులు అందుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. దాడులు చేసినప్పుడు వాహనాలు పట్టుబడినా, ఎంతోకొంత ముట్టజెప్పి బయటపడుతున్నారని, అది కుదరకపోతేనే వాహనాల సీజ్‌, జరిమానాల వరకూ వ్యవహారం వెళుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం


అనుమతి లేకుండా గ్రావెల్‌ తరలించడం నేరం. అక్రమ క్వారీలు వున్న గ్రామాల్లో వీఆర్‌ఏలతో నిఘా పెడతాం. అక్రమాలపై స్థానికుల నుంచి నేరుగా సమాచారం కోరుతున్నాం. పట్టాల పంపిణీ పని ఒత్తిడి వల్ల ఇతర విషయాలపై దృష్టిసారించలేకపోతున్నాం. అక్రమ క్వారీలను పరిశీలించి బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. 

-కె.రమాదేవి, తహసీల్దార్‌, సబ్బవరం

Updated Date - 2020-12-29T06:36:47+05:30 IST