ఇసుకపై దిగొచ్చిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-06-16T11:27:20+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక కొరతపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో..

ఇసుకపై దిగొచ్చిన ప్రభుత్వం

సొంత అవసరాలకు స్థానికంగానే ఏర్పాటు

ఎడ్లబండ్లతో తీసుకువెళితే పూర్తిగా ఉచితం

ట్రాక్టర్‌ అయితే టన్నుకు రూ.285 రేటు

గ్రామ సచివాలయాల్లోనే అనుమతులు

రీచ్‌ నుంచి ఐదు కిలోమీటర్ల వరకే లోపు అయితేనే...

దుర్వినియోగం చేస్తే జరిమానా 

నదులు, వాగులు, గెడ్డల్లో రీచ్‌లను గుర్తించిన అధికారులు

తొలుత తొమ్మిదింటికి అనుమతి

త్వరలో ఏడు పాత రీచ్‌లు పునఃప్రారంభం

ఏజెన్సీలో 20 రీచ్‌లకు ఐటీడీఏ పీవో ప్రతిపాదన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక కొరతపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. జిల్లాల్లో నదులు, వాగులు, గెడ్డల్లో ఇసుక లభ్యత వున్న ప్రాంతాలను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. స్థానికంగా ప్రజలు సొంత నిర్మాణాలకు అవసరమైన ఇసుకను తీసుకువెళ్లడానికి మార్గదర్శకాలు రూపొందించింది. ఎంపిక చేసిన రీచ్‌ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో ఇళ్లు, ఇతర నిర్మాణాలకు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లడానికి వెసులుబాటు కల్పించింది. అయితే ఇసుక అవసరమైనవారు గ్రామ సచివాలయానికి వెళ్లి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అనుమతి పత్రం పొందాల్సి వుంటుందని పేర్కొంది.


ఈ పత్రం వుంటేనే ఇసుక ర్యాంపులోకి ఎండ్ల బండ్లను వెళ్లనిస్తారు. కాగా ఎడ్ల బండ్లు కాకుండా ట్రాక్టర్‌ ద్వారా ఇసుక తీసుకువెళ్లాలనుకుంటే టన్నుకు రూ.285 చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో తూనిక యంత్రాలు అందుబాటులో ఉండవు కాబట్టి, ట్రాక్టర్‌ తొట్టెలో నాలుగున్నర టన్నుల ఇసుక పడుతుందని అంచనా వేశారు. ట్రాక్టర్‌ ద్వారా ఇసుక తీసుకువెళ్లేవారు కూడా గ్రామ సచివాలయంలోనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. నిర్ణీత మొత్తాన్ని చెల్లించి రశీదు పొందాలి. దీనిని రీచ్‌ వద్ద చూపితేనే ఇసుక తీసుకువెళ్లనిస్తారు. ఇసుక రవాణా సమయంలో అధికారులు ఎక్కడైనా ఆపి తనిఖీ చేస్తే, రశీదు చూపించాల్సి ఉంటుంది.


దారి మళ్లిస్తే జరిమానా

సొంత అవసరాలకు మాత్రమే ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక తీసుకువెళ్లవచ్చని, అయితే సొంత అవసరాల మాటున ఎవరైనా ఇసుక విక్రయిస్తే జరిమానాలు విధిస్తామని గనుల శాఖ సహాయ సంచాలకుడు బైరాగినాయుడు చెప్పారు. తొలిసారి పట్టుబడితే రూ.2 వేలు, రెండోసారి అయితే రూ.3 వేలు, మూడోసారి అయితే రూ.5 వేలు జరిమానా విధించి, బండిని సీజ్‌ చేస్తామని స్పష్టం చేశారు. 


తొలుత తొమ్మిది ఇసుక రీచ్‌లు

జిల్లాలో నదులు, వాగులు, గెడ్డల్లో తొమ్మిదిచోట్ల ఇసుక లభ్యత వుందని అధికారులు గుర్తించారు. నాతవరం మండలం బురదపల్లి అగ్రహారం, గొలుగొండ మండలం ఏఎల్‌ పురం, మాకవరపాలెం మండలం బీఎస్‌ పేట, చోడవరం మండలం జుత్తాడ, కోటవురట్ల మండలం గొట్టివాడ, కైలాసపట్నం, పెదబయలు మండలం చుట్టుమెట్ట, గలగండ, గంపరాయి వద్ద రీచ్‌ల నుంచి ఇసుక తీసుకువెళ్లవచ్చు. అనుమతుల అధికారాన్ని గ్రామ సచివాలయాలు, రెవెన్యూ అధికారులకు అప్పగించారు. 


మరో ఏడు పాత రీచ్‌లు

చోడవరం మండలం గవరవరం, లక్కవరం, దేవరాపల్లి మండలం తిమిరాం, తెనుగుపూడి, కలిగొట్ల, మాడుగుల మండలం సాగరం, పోతలపూడి అగ్రహారం, వీరవల్లి అగ్రహారం, ఎరుకువాడలో గత ఏడాది గుర్తించిన పాత రీచ్‌లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే దీనిపై ఇంకా ప్రకటన వెలువడలేదు.


ఏజెన్సీలో 20 రీచ్‌లు

ఏజెన్సీలో ఇసుక అవసరాలను పరిగణనలోకి తీసుకుని 20 చోట్ల ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలని పాడేరు ఐటీడీఎ పీవో ప్రతిపాదించారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - 2020-06-16T11:27:20+05:30 IST