విస్తరిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-05-30T08:59:00+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదుకాని ప్రాంతంలో ఒకేసారి నాలుగైదు కేసులు

విస్తరిస్తున్న కరోనా

కొత్త ప్రాంతాల్లో నమోదవుతున్న కేసులు

గ్రామీణ జిల్లాలోని పలు మండలాల్లో వ్యాప్తి

అచ్యుతాపురం మండలంలో ఒకే కుటుంబంలో నలుగురికి  

నగర పరిధిలోని మధురవాడ ప్రాంతంలో ఐదుగురికి వైరస్‌ నిర్ధారణ

అధికారులు, వైద్యుల్లో ఆందోళన

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

జిల్లాలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదుకాని ప్రాంతంలో ఒకేసారి నాలుగైదు కేసులు వెలుగుచూస్తుండడంతో వైద్యులు, అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 


నగరంలోని అల్లిపురం ప్రాంతంలో మార్చి 19న మొదటి కేసు నమోదైంది. మక్కా వెళ్లి వచ్చిన వృద్ధుడికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఆయన ద్వారా భార్యకు వైరస్‌ సోకింది. అనంతరం పద్మనాభం మండలం రేవిడి వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడికి (అతను కూడా ఇంగ్లండ్‌ నుంచి వచ్చాడు) పాజిటివ్‌ వచ్చింది. అతని ద్వారా మరో ముగ్గురు కుటుంబ సభ్యులకు సోకింది. నగర పరిధిలోని దండుబజార్‌లో కేసులు నమోదు కావడానికి ముందు వరకు మూడొంతులు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్లోనే కనిపించాయి.


దీంతో అధికారులు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, వారితో సన్నిహితంగా వున్నవారిని క్వారంటైన్‌ చేయడంతోపాటు పరీక్షలు నిర్వహించగలిగారు. అయితే ప్రస్తుతం వైరస్‌ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుండడం, దానికి గల కారణాలు, కాంటాక్టు హిస్టరీ తెలుసుకునేలోపు మరిన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. 


ఇవీ కొత్త ప్రాంతాలు

జిల్లాలోని పాజిటివ్‌ కేసుల్లో అత్యధికం నగర పరిధిలోనే నమోదు కాగా...గ్రామీణ జిల్లాలో పద్మనాభం మండలం రేవిడి వెంకటాపురంలో మూడు, నర్సీపట్నంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి వైరస్‌ సోకింది. తరువాత చాలారోజులు రూరల్‌ ప్రాంతంలో కేసులు నమోదుకాలేదు. సరిగ్గా నెల రోజుల కిందట కశింకోట మండలం చింతలపాలెం గ్రామంలో ఓ మహిళకు వైరస్‌ నిర్ధారణ అయింది. ఆ తరువాత చీడికాడ మండలం బైలపూడిలో రెండు,  బుచ్చెయ్యపేట మండలం దిబ్బడి, చోడవరం మండలం అంకుపాలెంలో ఒక్కొక్కటి, అచ్యుతాపురం మండలం ఇరువాడ పంచాయతీ పరిధిలోని చిట్టిబోయినపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.


నగర పరిధిలో ఇప్పటివరకూ కేసులు నమోదుకాని మధురవాడ ప్రాంతంలో తాజాగా ఐదుగురికి వైరస్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ప్రాంతాలకు వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. 


ఇప్పటివరకూ కేసులు నమోదైన ప్రాంతాలు

నగరంలోని అల్లిపురం, బంగారమ్మమెట్ట (డాబాగార్డెన్స్‌), చెంగల్రావుపేట, చినవాల్తేర్‌, దండుబజార్‌, గాజువాక, జ్ఞానాపురం, గోపాలపట్నం, ఐటీఐ జంక్షన్‌, కొబ్బరితోట, కేఆర్‌ఎం కాలనీ, మాధవధార, మహారాణిపేట, పూర్ణామార్కెట్‌, పెదజాలారిపేట, పిఠాపురం కాలనీ, రైల్వే న్యూ కాలనీ, రెల్లివీధి, శాంతినగర్‌, సింహాద్రిపురం, శ్రీనగర్‌, ముస్లింతాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, రూరల్‌లో...నర్సీపట్నం, పద్మనాభం మండలం రేవిడి వెంకటాపురం, కశింకోట, చీడికాడ, బుచ్చెయ్యపేట మండలాలు


కొత్త ప్రాంతాలు.. 

నగరంలో మధురవాడ, రూరల్‌లో చోడవరం మండలం అంకుపాలెం, అచ్యుతాపురం మండలం ఇరువాడ పంచాయతీ చిట్టిబోయినపాలెం 

Updated Date - 2020-05-30T08:59:00+05:30 IST