జీడి రైతు గోడు

ABN , First Publish Date - 2020-04-14T09:09:39+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో జీడిపిక్కలు కొనుగోలుకు వ్యాపారులు ఎవరూ రావడం

జీడి రైతు గోడు

లాక్‌డౌన్‌తో నిలిచిన రవాణా వ్యవస్థ

పిక్కల కొనుగోలుకు రాని వ్యాపారులు

కిలో రూ.70కు కొంటున్న దళారులు

గత ఏడాది రూ.150

అసలే ప్రతికూల వాతావరణంతో సగానికి తగ్గిన దిగుబడులు

దిక్కుతోచని స్థితిలో సాగుదారులు

మరోవైపు కౌలు చెల్లించాలంటూ భూ యజమానుల ఒత్తిడి


గొలుగొండ, ఏప్రిల్‌ 13:

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో జీడిపిక్కలు కొనుగోలుకు వ్యాపారులు ఎవరూ రావడం లేదు. కొనుగోలుదారులు రాకపోవడంతో రైతులు జీడిపిక్కలను ఇళ్లల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. అయితే  కౌలు డబ్బులు చెల్లించాలంటూ భూ యజమానుల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో తోటలను తీసుకుని సాగు చేస్తున్న రైతులకు దిక్కు తోచడం లేదు. 


జిల్లాలోని మైదాన ప్రాంతంతోపాటు ఏజెన్సీలోని కొయ్యూరు మండలంలో అధిక విస్తీర్ణంలో జీడిమామిడి తోటలు ఉన్నాయి. ఉత్పత్తి అయిన జీడి పిక్కలను తుని, పలాసతోపాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కొన్నిచోట్ల దళారులు కొనుగోలు చేసి, ఫ్యాక్టరీలకు అమ్ముతుంటారు. కాపు బాగా కాస్తే ఎకరాకు ఐదారు బస్తా(80 కిలోలు)ల పిక్కల దిగుబడి వస్తుంది. కానీ గత ఏడాది వర్షాలు సరిగా పడకపోవడం, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మంచు అధికంగా పడడం, ఫిబ్రవరి మొదటి వారంలో అకాల వర్షాలు పడడం, తెగుళ్లు వ్యాపించడంతో ఈ సీజన్‌లో కాపు బాగా తగ్గిపోయింది. ఎకరాకు రెండు నుంచి మూడు బస్తాలు మాత్రమే పిక్కల దిగుబడి వస్తున్నట్టు రైతులు చెబుతున్నారు.


చేతికి అందిన కొద్దిపాటి పంటను అయినా అమ్ముకుందామంటే కరోనా వైరస్‌ అడ్డంకిగా మారింది. లాక్‌డౌన్‌ కారణంగా జీడిపిక్కల ఫ్యాక్టరీలను మూసివేశారు. వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో జీడిపిక్కల కొనుగోలుకు ఎవరూ రావడం లేదు. స్థానికంగా కిలోల చొప్పున కొనుగోలు చేసి, తుని లేదా పలాసల్లో అమ్ముకునే దళారులు కొద్దోగొప్పో కొనుగోలు చేసినా కిలో రూ.70లకు మించి చెల్లించడం లేదు. గత ఏడాది బస్తా (80 కిలోలు) పిక్క రూ.12 వేల వరకు ఽపలికింది. ఈ లెక్కన కిలో రూ.150 పడింది. కానీ ఈ ఏడాది దిగుబడి సగానికి పడపోగా, ధర సైతం సగానికి తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.  


కౌలు రైతులు అప్పులపాలు

సొంతంగా జీడిమామిడి తోటలు వున్న రైతులకన్నా కౌలుకు సాగుచేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జీడి పిక్కలు కొనుగోలుకు వ్యాపారులు రాకపోవడం, మరోవైపు కౌలు డబ్బులు చెల్లించాలని భూ యజమానులు ఒత్తిడి చేస్తుండడంతో దిక్కు తోచడం లేదని గొలుగొండకు చెందిన ఓ కౌలు రైతు వాపోయారు. అక్కడక్కడా దళారులు కొనుగోలు చేస్తున్నప్పటికీ బస్తా రూ.6,500కు అడుగుతున్నారని, ఇటు దిగుబడి లేక, అటు ధర సైతం సగానికి పడిపోవడంతో పెట్టుబడి కూడా చేతికి రాదని రైతులు అంటున్నారు. 

Updated Date - 2020-04-14T09:09:39+05:30 IST