మండిన జిల్లా ..ఉదయం నుంచే గాడ్పుల ప్రభావం
ABN , First Publish Date - 2020-05-24T08:12:14+05:30 IST
జిల్లాలో శనివారం కూడా ఎండ తీవ్రత కొనసాగింది. వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీయడంతో వాతావరణం బాగా ..

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
వడదెబ్బకు ఉపాధి కూలి మృతి
రావికమతంలో 42.29 డిగ్రీలు
విమానాశ్రయంలో 36.2
27వ తేదీ వరకూ ఇదే పరిస్థితి
విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం కూడా ఎండ తీవ్రత కొనసాగింది. వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీయడంతో వాతావరణం బాగా వేడెక్కింది. ఉదయం నుంచే ఎండ ప్రభావానికి గాలులు తోడయ్యాయి. అత్యవసర పనులున్న వారు తప్ప మిగిలిన వారంతా ఇళ్లకు పరిమితమయ్యారు. దీంతో మధ్యాహ్న సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు ఎండకు తీవ్ర ఇబ్బందిపడ్డారు. బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్టకు చెందిన బూరి కోటేశ్వరరావు అనే కూలి వడదెబ్బకు మృతి చెందాడు. శనివారం జిల్లాలో అత్యధికంగా రావికమతంలో 42.29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ ఎయిర్‌పోర్టులో 36.2 డిగ్రీలు నమోదైంది. కాగా ఏజెన్సీలో క్యుములోనింబస్ మేఘాలు ఆవరించడంతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. కాగా ఈనెల 27 వరకు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా వుండాలని నిపుణులు చెబుతున్నారు.