30 ఏళ్ల కల నెరవేరింది

ABN , First Publish Date - 2020-12-29T06:34:25+05:30 IST

‘పూరిపాకలో చాలాకాలం వెళ్లదీశాం. ప్రభుత్వ సహాయానికి తోడు కష్టార్జితంతో మనస్సుకు నచ్చిన పొదరిల్లు నిర్మించుకున్నాం. దానికి జాతీయస్థాయిలో గుర్తింపు దక్కడం చెప్పలేనంత సంతోషంగా ఉంది.’

30 ఏళ్ల కల నెరవేరింది

ప్రభుత్వ సాయానికి తోడు కష్టార్జితంతో సంపాదించుకున్న సొమ్ముతో పొదరిల్లు కట్టుకున్నాం

జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఇంటి యజమాని సత్రబోయిన దుర్గ


విశాఖపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): 


‘పూరిపాకలో చాలాకాలం వెళ్లదీశాం. ప్రభుత్వ సహాయానికి తోడు కష్టార్జితంతో మనస్సుకు నచ్చిన పొదరిల్లు నిర్మించుకున్నాం. దానికి జాతీయస్థాయిలో గుర్తింపు దక్కడం చెప్పలేనంత సంతోషంగా ఉంది.’ ...అంటూ ఇన్నోవేటివ్‌ కన్‌స్ట్రక్షన్‌ విభాగంలో జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిన ఇంటి యజమాని సత్రబోయిన దుర్గ, ఆమె భర్త అప్పన్నబాబు సంతోషం వ్యక్తంచేశారు. అప్పన్నబాబు ఆనందం ఆయన మాటల్లోనే.... 


‘‘మా తండ్రి కృష్ణ 30 ఏళ్ల కిందట ఉపాధి కోసం తుని నుంచి విశాఖ మమ్మల్ని తీసుకుని వచ్చేశారు. పెదగంట్యాడ గవర్నమెంట్‌ ఆస్పత్రి వెనుక పాక వేసుకుని నివాసం ఉండేవాళ్లం. స్టీల్‌ప్లాంట్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో మట్టి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాళ్లం. నాన్న మరణించిన తర్వాత నేను, భార్య దుర్గ, 15 ఏళ్ల కొడుకు, 13 ఏళ్ల కుమార్తెతో అక్కడే వుంటూ కూలిపనులు చేసుకునేవాళ్లం. తొమ్మిదేళ్ల కిందట స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం అక్కడున్న వారందరినీ ఖాళీ చేయించి వెంకన్నపాలెం సమీపంలోని ఉప్పర కాలనీలో 60 గజాలు చొప్పున స్థలం కేటాయించింది. నాకు కేటాయించిన స్థలంలో పాక వేసుకున్నాం. రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న హౌసింగ్‌ స్కీమ్‌లో దరఖాస్తు చేసుకోగా, ఇల్లు మంజూరైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్‌ కింద ఇచ్చిన రూ.2.5 లక్షల సాయంతోపాటు మేము ముందుగానే ఇంటి కోసం చీటీలు కట్టి దాచి పెట్టుకున్న లక్ష రూపాయలను వెచ్చించి నిర్మాణం ప్రారంభించాం. ఆ డబ్బు చాలకపోవడంతో కొంత అపు తీసుకుని మా ఆశలకు అనుగుణంగా ఉన్నంతలోనే అన్ని వసతులతో నిర్మాణం పూర్తిచేసి గృహ ప్రవేశం చేశాం. ఇప్పుడు ఆ ఇంట్లోనే అందరం సౌకర్యవంతంగా జీవనం సాగిస్తున్నాం. మా ఇంటికి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు లభించిందని, వచ్చే నెల ఒకటిన దేశ ప్రధాని నరేంద్రమోదీ మాతో వీడియో కాన్ఫరెన్స్‌లో భేటీ అవుతారని చెబితే..మొదట నమ్మలేకపోయాం. ఇప్పుడు అందరూ మాతో మాట్లాడుతూ ఇంటి నిర్మాణం గురించి అడుగుతుంటే గర్వంగా ఉంది.

Updated Date - 2020-12-29T06:34:25+05:30 IST