‘టెన్‌’షన్‌!

ABN , First Publish Date - 2020-04-05T16:52:20+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా..

‘టెన్‌’షన్‌!

పదో తరగతి పరీక్షలపై సందిగ్ధం

తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు

ఆందోళనలో తల్లిదండ్రులు

కరోనా విధులకు ఉపాధ్యాయులు

తొలుత పీఈటీలు, పీడీలు...

ఎంపీడీవోలకు రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు

విద్యారంగంలో అయోమయం

కరోనా కారణంగా మూడు వారాలుగా పాఠశాలలు బంద్‌


నర్సీపట్నం(విశాఖపట్నం): కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం గడిచిన మూడు వారాలుగా పాఠశాలలను మూసివేయడంతో విద్యా వ్యవస్థలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యా సంవత్సరం ముగిసే తరుణంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


గత నెల 19వ తేదీ నుంచి మూతపడిన విద్యాసంస్థలు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈనెల 14వ తేదీతో లాక్‌డౌన్‌ ముగుస్తుందా? లేదా? అనేది ప్రభుత్వపరంగా ఇప్పటివరకు స్పష్టంకాలేదు. అయితే ఏటా విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఏప్రిల్‌ 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. దీంతో ఈ ఏడాది 14వ తేదీన లాక్‌డౌన్‌ ఎత్తివేసినా...విద్యా సంస్థలు తిరిగి తెరుచుకుంటాయా? లేదా? అనేది అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.


టెన్త్‌ పరీక్షలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా

రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాయి. వాస్తవానికి గత నెల 23 నుంచి జరగాల్సిన పబ్లిక్‌ పరీక్షలను స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా తొలుత 31వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 14వ తేదీతో లాక్‌డౌన్‌ ముగిసిన పక్షంలో పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తుందేమోనని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పరీక్షలు మే నెలాఖరులో జరగవచ్చునని ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నది. అయితే అప్పటికి వైరస్‌ ప్రభావం పూర్తిగా తగ్గుతుందా...అంటే స్పష్టంగా చెప్పలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నదీ ఎవరికీ అంతుబట్టడం లేదు.


ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు

సాధారణంగా పదో తరగతి పరీక్షల కోసం విద్యార్థులను మూడు నెలల ముందు నుంచే ఉపాధ్యాయులు సిద్ధం చేస్తూ ఉంటారు. విద్యార్థులు సైతం పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయోనన్న ఉత్కంఠతో ఎదురుచూస్తు ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పబ్లిక్‌ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి?, అసలు జరుగుతాయా? లేదా?... అనేది తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. లాక్‌డౌన్‌ ముగిసేంత వరకు ఎదురుచూడకుండా ప్రభుత్వం సత్వరమే తగిన నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.


కరోనా విధులకు ఉపాధ్యాయులు

విద్యాసంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో వున్న ఉపాధ్యాయులకు కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలకు సంబంధించిన విధులను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పీఈటీలు, పీడీలను ఆయా మండలాల ఎంపీడీవోలకు రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూసేందుకు రైతుబజార్లు, తదితర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ మైక్‌ ప్రచారం చేసేందుకు పీఈటీ, పీడీ సేవలను ఉపయోగించుకుంటారని ప్రభుత్వ వర్గాల సమాచారం. మహిళలు, వృద్ధులు మినహా మిగతా ఉపాధ్యాయుల సేవలను కూడా కరోనా విధులకు మళ్లించే అవకాశం ఉందంటున్నారు.


విద్యాసంవత్సరం ముగించాలని యోచన

లాక్‌డౌన్‌ ప్రభావంతో ప్రస్తుత విద్యాసంవత్సరం ముగించాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఈనెల 14 వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ గడువు 14వ తేదీతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో 15వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించే కంటే 23వ తేదీ వరకు సెలవులు పొడిగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ఏప్రిల్‌ 23 వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బియ్యం, గుడ్లు, పప్పు చెక్కీలు అందజేయాలని శనివారం ఆదేశాలు వచ్చాయి. అంటే ఈ విద్యా సంవత్సరానికి పాఠశాలలు నిర్వహించే అవకాశం లేదని ఉపాధ్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తిరిగి జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని చెబుతున్నారు. 

Updated Date - 2020-04-05T16:52:20+05:30 IST