విశాఖ ‘తూర్పు’లో.. టెన్షన్‌.. టెన్షన్‌

ABN , First Publish Date - 2020-12-27T06:19:21+05:30 IST

విశాఖపట్నంలో ఎన్నడూ లేని కొత్త సంస్కృతి ఇటీవల..

విశాఖ ‘తూర్పు’లో.. టెన్షన్‌.. టెన్షన్‌
తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్న అక్కరమాని విజయనిర్మల

సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన నగరం

విశాఖ రాజకీయాల్లో కొత్త సంస్కృతి

ఓ పార్టీకి చెందిన నాయకుల నివాసాలు/కార్యాలయాల పైకి వెళ్లేందుకు మరో పార్టీ నేతల యత్నం

‘తూర్పు’లో తరచుగా ఉద్రిక్త పరిస్థితులు

తలలు పట్టుకుంటున్న పోలీసులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఎన్నడూ లేని కొత్త సంస్కృతి ఇటీవల కాలంలో మొదలైంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుల ఇళ్ల మీదకు, కార్యాలయాల మీదకు దండెత్తడానికి అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజల్లో ఏదైనా వర్గం, ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని కోరుతూ మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు, కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయడం రివాజు. కానీ ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే నివాసం, కార్యాలయం మీదకు అధికార పార్టీ నాయకులు వెళ్లేందుకు యత్నించడం విశేషం. 


తూర్పు నియోజకవర్గంలో సిటింగ్‌ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ తరపున అక్కరమాని విజయనిర్మల గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు అదే పార్టీకి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ రెండుసార్లు వెలగపూడిపై పోటీ చేసి ఓటమి చెందారు. వెలగపూడి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. ఇది సహించలేకపోతున్న అక్కరమాని విజయనిర్మల వర్గం ఏదో ఒకటి చేసి వెలగపూడిపై పైచేయి సాధించాలని కొద్దికాలంగా యత్నిస్తోంది. 


పార్టీ అధినేతను విమర్శించారని రెండుసార్లు

వైసీపీ అధినేత జగన్‌ను ఎమ్మెల్యే వెలగపూడి విమర్శించారని ఆరోపిస్తూ అక్కరమాని విజయనిర్మల వర్గం గతంలో రెండుసార్లు ఆయన ఇలు/కార్యాలయంపైకి వెళ్లేందుకు యత్నించింది. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు వారిని నిలువరించారు. ఇటీవల మూడు రాజధానుల నిర్ణయానికి వెలగపూడి మద్దతు ఇవ్వడం లేదని, అమరావతి వెళ్లి అక్కడి రైతులకు మద్దతుగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ మరోసారి ఆయన కార్యాలయం/ఇంటిపైకి వెళ్లేందుకు అక్కరమాని వర్గం యత్నించింది. అప్పుడు కూడా పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. తాజాగా ఎమ్మెల్యే వెలగపూడి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించగా, దమ్ముంటే వాటిని నిరూపించాలని ఆయన ప్రతి సవాల్‌ చేశారు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఈస్ట్‌ పాయింట్‌ కాలనీలోని షిర్డీ ఆలయానికి వచ్చి ప్రమాణం చేస్తానని ప్రకటించారు. ఈ సవాల్‌కు విజయసాయిరెడ్డి స్పందించకుండా మౌనం దాల్చారు. ఇదే అదనుగా భావించిన అక్కరమాని విజయనిర్మల...శనివారం ఉదయం తాము షిర్డీ ఆలయానికి వస్తామని, వెలగపూడి రావాలని సవాల్‌ చేశారు. ఒకవేళ వెలగపూడి రానట్టయితే తానే సాయిబాబా ఫొటో తీసుకొని ఆయన కార్యాలయానికి వెళతానని స్పష్టంచేశారు. ఈ పరిణామం పోలీసువర్గాల్లో కలవరం రేపింది. అయితే ఈ విషయం రాత్రే తెలుసుకున్న వెలగపూడి రామకృష్ణబాబు కూడా అప్రమత్తమయ్యారు. ఆ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు సమాచారం ఇచ్చి కార్యాలయానికి రావాలని సూచించారు. దాంతో వారంతా శనివారం ఉదయమే ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు కొందరు, ఎంవీపీ కాలనీలోని కార్యాలయం దగ్గరకు మరికొందరు చేరుకున్నారు.


రెండుచోట్ల వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ రెండు వర్గాల సవాళ్లు, ప్రతి సవాళ్లు గమనించిన పోలీసు ఉన్నతాధికారులు ఘర్షణ జరిగే అవకాశం వుందని భావించి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి ఇంటికి, కార్యాలయానికి వెళ్లే మార్గాలన్నింటిలోను ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఏ వాహనాన్ని అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. స్థానికులు తప్ప..ఇంకెవరూ అటు వెళ్లకుండా చేశారు. మరోవైపు ఈస్ట్‌ పాయింట్‌ కాలనీ షిర్డీ సాయి ఆలయం వద్ద కూడా మరికొన్ని బృందాలను ఏర్పాటుచేశారు. ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ముందుజాగ్రత్తగా శనివారం ఉదయం ఎంవీపీలోని వెలగపూడి కార్యాలయం వద్ద ద్వారకా ఏసీపీ మూర్తి ఆధ్వర్యంలో, ఈస్ట్‌ షిర్డీ సాయి ఆలయం వద్ద ఏసీపీ త్రినాథ్‌, హర్షిత ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 


ముందుగా ప్రకటించినట్టుగానే ఉదయం పది గంటలకు వైసీపీ నేతలు, కార్యకర్తలతో అక్కరమాని విజయనిర్మల ఈస్ట్‌ షిర్డీ సాయిబాబా ఆలయానికి చేరుకున్నారు. ఏసీపీ త్రినాథరావు, త్రీటౌన్‌ సీఐ రామారావు ఆమె వద్దకు వెళ్లి ప్రస్తుత తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దంటూ హితవుపలికారు. అయినప్పటికీ ఆమె కారు దిగి ఆలయంలోకి వెళ్లి బాబాకు పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా ఫొటో తీసుకుని ఎమ్మెల్యే కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నించారు. జీసీసీ కార్యాలయం వద్ద పోలీసులు ఆమెను అడ్డుకుని వెనక్కి పంపేశారు. ఉదయం 9 గంటలకు మొదలైన ఈ డ్రామా మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాగింది. అక్కడ అక్కరమాని విజయనిర్మల, ఇక్కడ వెలగపూడి మరోసారి సవాళ్లు విసురుకొని ఆందోళన ముగించారు. ఈ సందర్భంలో అటు ఈస్ట్‌పాయింట్‌ కాలనీలోను, ఇటు ఎంవీపీ కాలనీలోను ఉద్రిక్త వాతారణం నెలకొంది. ఏమి జరుగుతున్నదో స్థానికులకు అర్థం కాలేదు. మొత్తానికి గొడవలు జరగకుండా పోలీసులు నివారించారు. అధికార పార్టీకి చెందిన నాయకురాలు అయినందున అక్కరమాని వర్గాన్ని ఏమీ చేయలేకపోతున్నామని, ప్రశాంత విశాఖలో ఇలాంటి గొడవలు మొదలైతే నగరమంతా పాకుతాయని, అది మంచిది కాదని వారు పార్టీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.Updated Date - 2020-12-27T06:19:21+05:30 IST