గురువుల అడ్డదారులు

ABN , First Publish Date - 2020-07-15T17:21:37+05:30 IST

సమగ్రశిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)లో కొలువు అంటేనే ఒక మాయాజాలం..

గురువుల అడ్డదారులు

సిఫారసులు, పెద్దల ఆశీస్సులతో ఎస్‌ఎస్‌ఏలో పోస్టింగ్‌

కొద్ది రోజుల్లోనే నగరంలోని పాఠశాలకు బదిలీ

ఉత్తర్వులు జారీ చేస్తున్న విద్యాశాఖ

ఉపాధ్యాయ వర్గాలు అభ్యంతరం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): సమగ్రశిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)లో కొలువు అంటేనే ఒక మాయాజాలం. ఇందుకు తొలి నుంచి చివరి వరకు ప్రతీది అడ్డగోలు వ్యవహారమే. సిఫారసులు, పెద్దల ఆశీస్సులతో ఎస్‌ఎస్‌ఏలో పోస్టింగ్‌ పొందిన టీచర్లు తరువాత నగర పరిసరాల్లో కోరుకున్న పాఠశాలలో తిరిగి పోస్టింగ్‌ తెచ్చుకుంటున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ జిల్లా విద్యాశాఖ గుడ్డిగా ఆర్డర్‌ ఇవ్వడం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఇందుకు తాజాగా ఎస్‌ఎస్‌ఏలో ‘అల్టర్‌నేట్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌’గా కేవలం ఆరు నెలలు పనిచేసిన అనురాధకు, నగరంలోని తోటగరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రేడ్‌-1 తెలుగు పండిట్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. దీనిపై టీచర్లు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఆమె ఈ ఏడాది జనవరిలో ఎస్‌ఎస్‌ఏలో అల్టర్‌స్కూల్‌ కోఆర్డినేటర్‌గా ఫారెన్‌ సర్వీస్‌పై వెళ్లారు. అంతకు ముందు పాయకరావుపేట మండలం గొడిచెర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రేడ్‌-1 తెలుగు పండిట్‌గా పనిచేస్తూ ఎస్‌ఎస్‌ఏలో పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. ఏడాదిపాటు ఈ పోస్టులో కొనసాగాలని ఎస్‌ఎస్‌ఏ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు.


అయితే  తోటగరువు ఉన్నత పాఠశాలలో గ్రేడ్‌-1 తెలుగు పండిట్‌ పోస్టు ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో ఎస్‌ఎస్‌ఏ అధికారులు ఆమెను రిలీవ్‌ చేసి విద్యాశాఖకు సరెండర్‌ చేయడంతో కోరుకున్న చోట పోస్టింగ్‌ ఇచ్చారు. ఆమె ఉన్నతస్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో నగరంలోనే పోస్టింగ్‌ ఇచ్చారనే ప్రచారం సాగుతున్నది. ఈమెతోపాటు ఎస్‌ఎస్‌ఏలో పనిచేసి వెనక్కి వచ్చిన అమరావతి అనే టీచర్‌ మాత్రం గతంలో తాను పనిచేసిన కేటగిరీ-3లోని పాఠశాలలోనే పోస్టింగ్‌ తీసుకున్నారు. 


నిబంధనలకు విరుద్ధం

విద్యా శాఖ నుంచి టీచర్లు పలు విభాగాలకు డెప్యూటేషన్‌పై వెళుతుంటారు. వీరిని తొలుత విద్యా శాఖ రిలీవ్‌ చేస్తుంది. డెప్యూటేషన్‌ పూర్తయిన తరువాత తిరిగి విద్యా శాఖలో రిపోర్టు చేస్తారు. తరువాత సదరు టీచరు.... తొలుత ఏ పాఠశాల నుంచి రిలీవ్‌ అయ్యేరో... తిరిగి అదే పాఠశాల లేదా అదే కేటగిరీకి చెందిన పాఠశాలలో పోస్టింగ్‌ ఇవ్వాలి. ఉదాహరణకు కేటగిరీ-3(అంటే జిల్లాలో శివారు పాఠశాలలు) పాఠశాలలో పనిచేసే టీచరు డెప్యూటేషన్‌/ ఫారెన్‌ సర్వీస్‌లో వెళ్లి తిరిగి వస్తే అదే కేటగిరీలో ఉన్న పాఠశాలలోనే నియమించాలి. కేటగిరి 1, 2లో పనిచేసి రిలీవ్‌ అయి తిరిగి వస్తే తిరిగి అదే కేటగిరీలోని పాఠశాలల్లోనే నియమించాలి. ఇది పాఠశాల విద్యాశాఖ రూపొందించిన నిబంధన. కానీ జిల్లా విద్యా శాఖకు ఈ నిబంధనలేవీ వర్తించవు... అనేకంటే అమలుకానివ్వరని టీచర్లే వ్యాఖ్యానిస్తుంటారు. గడచిన ఏడాదిలో సమగ్రశిక్షా అభియాన్‌లో ఫారెన్‌ సర్వీస్‌ పూర్తిచేసుకున్న ఆరుగురు టీచర్లకు నగర పరిసరాల్లోనే పోస్టింగ్‌ ఇచ్చారు. వీరిలో ఎక్కువమంది కేటగిరి-3లో పనిచేసిన వారే!  


అవసరం మేరకు పోస్టింగ్‌: బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో

తోటగరువు ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మేరకు తెలుగు పండిట్‌ టీచరు అవసరం ఉంది. అందుకే అనురాధకు పోస్టింగ్‌ ఇచ్చాం. అయితే ఒక కేటగిరీ పాఠశాలనుంచి రిలీవ్‌ అయిన టీచర్లను తిరిగి అదే కేటగిరీలోని పాఠశాలలో నియమించాలనేది లేదు. గతంలో పలువురు టీచర్లను ఖాళీల మేరకు నియమించాం. 


Updated Date - 2020-07-15T17:21:37+05:30 IST