టీడీపీ కార్యవర్గంలో గ్రామీణానికి పెద్దపీట

ABN , First Publish Date - 2020-11-07T05:06:47+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం శుక్రవారం ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నుంచి 19 మందికి చోటు లభించింది. వీరిలో 11 మంది గ్రామీణ నియోజకవర్గాల వారే వున్నారు.

టీడీపీ కార్యవర్గంలో గ్రామీణానికి పెద్దపీట
నర్సీపట్నంలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణులు

19 మందిలో 11 మంది రూరల్‌ వారే.....


విశాఖపట్నం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం శుక్రవారం ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నుంచి 19 మందికి చోటు లభించింది. వీరిలో 11 మంది గ్రామీణ నియోజకవర్గాల వారే వున్నారు. పాడేరు నుంచి ఇద్దరు, చోడవరం, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి నుంచి ఒక్కొక్కరు; నగరానికి అనుకుని వున్న పెందుర్తి నుంచి ముగ్గురు, భీమిలి నుంచి ఇద్దరికి పదవులు దక్కాయి. గ్రామీణ ప్రాంతం నుంచి పదవులకు ఎంపికైన నాయకులు, వారి బయోడేటా.....


చింతకాయల విజయ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నర్సీపట్నం టౌన్‌: చింతకాయల విజయ్‌... మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతుల పెద్ద కుమారుడు. ఇతను ఎలకా్ట్రనిక్స్‌ కమ్యూనికేషన్స్‌లో బీటెక్‌ చేశారు. పొలిటికల్‌ అడ్మినిస్ర్టేషన్‌లో మాస్టర్‌ డిగ్రీ, జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ ఇన్‌ పాలిటికల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేశారు. సుమారు పదేళ్ల క్రితం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2012లో అన్‌రాక్‌ నిర్వాసిత రైతుల కోసం 200 కి.మీ. పాదయాత్ర చేశారు. విజయ్‌ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నర్సీపట్నంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  


కోట్ని బాలాజీ, రాష్ట్ర కార్యదర్శి

తుమ్మపాల: అనకాపల్లి మండలం బవులవాడ గ్రామానికి చెందిన కోట్ని బాలాజీ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన సమైక్యాంధ్ర పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2015లో తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అఽధ్యక్షునిగా నియమితులయ్యారు.  


ధూళి రంగనాయకులు, రాష్ట్ర కార్యదర్శి

రాంబిల్లి: మండలంలోని హరిపురం గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకుడు ధూళి రంగనాయకులు 1994 నుంచి 2006 వరకు గ్రామ టీడీపీ అధ్యక్షునిగా పనిచేశారు. 2006లో పంచదార్ల ఎంపీటీసీ సభ్యునిగా గెలుపొందారు. 2009 నుంచి 2017 వరకు టీడీపీ మండల అధ్యక్షునిగా పనిచేశారు. 2017 నుంచి 2019 వరకు ఎలమంచిలి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షునిగా సేవలందించారు. 


బత్తుల తాతయ్యబాబు, రాష్ట్ర కార్యదర్శి 

బుచ్చెయ్యపేట: మండలంలోని వడ్డాది గ్రామానికి బత్తుల తాతయ్యబాబు 1995 నుంచి టీడీపీలో వున్నారు. తెలుగు రైతు మండల అధ్యక్షునిగా, మాడుగుల నియోజకవర్గం ప్రచార కార్యదర్శిగా, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా, జిల్లా ఆర్టీఏ మెంబర్‌గా పనిచేశారు. వడ్డాది సర్పంచ్‌గా, బుచ్చెయ్యపేట ఎంపీపీగా ప్రజలకు సేవలందించారు. రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ పటిష్టానికి మరింత కృషి చేస్తానని అన్నారు. 


బొర్రా నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి

పాడేరు: మండలంలోని కిండంగి గ్రామానికి చెందిన బొర్రా నాగరాజు.... టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో వున్నారు. పార్టీ పాడేరు మండల అధ్యక్షునిగా మూడు పర్యాయాలు పనిచేశారు. జిల్లా కమిటీ సభ్యునిగా, ఎస్‌టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. రెండు పర్యాయాలు ఎస్‌టీ సెల్‌ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించారు. 


ఎంవీవీ ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి

కొయ్యూరు: కొయ్యూరుకు చెందిన ఎంవీవీ ప్రసాద్‌ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో ఎస్‌టీ సెల్‌ రాష్ట్ర ఉపాఽధ్యక్షునిగా, ఎస్‌టీ సెల్‌ జిల్లా అధ్యక్షునిగా, పాడేరు నియోజకవర్గం త్రిసభ్య కమిటీలో సభ్యుడిగా వ్యవహరించారు. టీడీపీ హయాంలో గిరిజన సహకార సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. 


Updated Date - 2020-11-07T05:06:47+05:30 IST