టీడీపీ వెంటే దక్షిణ కేడర్‌

ABN , First Publish Date - 2020-09-21T10:07:58+05:30 IST

విశాఖ దక్షిణలో తెలుగుదేశానికి బలమైన కేడర్‌ ఉందని మరోసారి నాయకులు నిరూపించారు. పార్టీ టిక్కెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ వైసీపీలోకి వెళ్లినా ద్వితీయశ్రేణి నాయకత్వం మాత్రం తెలుగుదేశంలో ఉన్నారు.

టీడీపీ వెంటే దక్షిణ కేడర్‌

పార్టీ శ్రేణులతో సమావేశమైన సీనియర్‌ నేతలు అయ్యన్న, బండారు

11 మంది కార్పొరేట్‌ అభ్యర్థులు, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు హాజరు

పార్టీకి విధేయులమని విస్పష్టం


విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖ దక్షిణలో తెలుగుదేశానికి బలమైన కేడర్‌ ఉందని మరోసారి నాయకులు నిరూపించారు. పార్టీ టిక్కెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ వైసీపీలోకి వెళ్లినా ద్వితీయశ్రేణి నాయకత్వం మాత్రం తెలుగుదేశంలో ఉన్నారు. వాసుపల్లి నిర్ణయం నేపథ్యంలో ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్లు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు, ఇతర నేతలు దక్షిణ కేడర్‌తో సమావేశమయ్యారు. అయితే వాసుపల్లి వెళ్లిపోవడంతో కొంతమంది అతని వెంట ఉంటారని అనుకున్నప్పటికీ ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారంతా హాజరయ్యారు. ఈ ఏడాది మార్చిలో జీవీఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినపుడు దక్షిణలో 13 వార్డులకు అభ్యర్థులను ఖరారుచేశారు.


వీరిలో విల్లూరి తిరుమలదేవి, పంపర రాజ్యలక్ష్మి, కేదారి లక్ష్మి, పుక్కళ్ల రాజేశ్వరి, వి. గొల్లయ్యబుజ్జి, పూర్ణిమ, గోడి విజయలక్ష్మి, బొట్ట పరదేశియాదవ్‌, పొడుగు సుగుణ,బొచ్చా రాము, వాసుపల్లి దానేష్‌ హాజరయ్యారు. దొడ్డి బాపు ఆనంద్‌, రవిశంకర్‌లు మాత్రం రాకపోయినా ఆనంద్‌ సోదరుడు రామానంద్‌ హాజరయ్యారు. ఇంకా వార్డు అధ్యక్ష, కార్యదర్శులతోపాటు సీనియర్లు వచ్చారు. వాసుపల్లి పార్టీ మారుతున్నట్టు శుక్రవారం ఉదయం నుంచి నియోజక వర్గంలో ప్రచారంతో పలువురు నేతలు అతన్ని ఫోన్‌లో వివరణ కోరడం అందుకు ఆయన కాదని చెప్పారు. అయితే శనివారం మధ్యాహ్నం ఇద్దరు కుమారులతో వాసుపల్లి ముఖ్యమంత్రిని అమరావతిలో కలిసిన విషయం టీవీల్లో చూసిన నియోజకవర్గ నేతలు, కేడర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు అయితే వాసుపల్లి తీరును దుయ్యబట్టారు. పదేళ్లపాటు కలిసి మెలిసి ఉంటూ తన అభివృద్థి కోసం పనిచేసిన నాయకుల్ని మాటమాత్రంగా చెప్పకపోవడంపై మండిపడ్దారు.


రక్షణరంగంలో పనిచేశానని, క్రమశిక్షణ, దేశభక్తి తనకు ఎక్కువని చెప్పుకునే వ్యక్తి, అధికార వ్యామోహంతో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మధ్యలో వచ్చిన వ్యక్తి మధ్యలోనే వెళ్లిపోయారు.. తప్ప తామంతా పార్టీలో ఉంటామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పార్టీ కార్యాలయంలో కార్పొరేషన్‌ టిక్కెట్లు పొందిన అభ్యర్థులు, ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఇదే సమయంలో అధిష్టానం ఆదేశాలతో జిల్లా నేతలు రంగంలోకి దిగి ఆదివారం సమావేశం ఏర్పాటుచేశారు.


ఎమ్మెల్యే వెళ్లినా నియోజకవర్గంలో పార్టీపట్టు సడలకుండా చర్యలు తీసుకోవాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో నియోజకవర్గం నుంచి పలువురు నేతలు, కార్యకర్తలఅభిప్రాయాలను సీనియర్‌ నేతలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు పార్టీపై తమకున్న విధేయతను ప్రకటించారు. దక్షిణలో పలువురు నేతలు గతంలో పార్టీనివీడినా కేడర్‌, ముఖ్య నాయకులు మాత్రం తెలుగుదేశంలో ఉన్న విషయాన్ని పలువురు గుర్తుచేశారు. అందువల్ల దక్షిణ నియోజకవర్గంలో నాయకులు మోసం చేసినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటి ఉంటున్నారని సమావేశంలో పలువురు నేతలు చెప్పడం ద్వారా క్షేత్రస్థాయి కేడర్‌కు భరోసా ఇచ్చారు. అయితే సమావేశంతో సరిపెట్టకుండా వెంటనే వార్డులో పర్యటించాలని పలువురు కార్యకర్తలు సూచనలు అధిష్ఠానం పరిగణన తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ముగ్గురు/ఐదుగురితో కమిటీఏర్పాటుచేయాలని కోరుతున్నారు.

Updated Date - 2020-09-21T10:07:58+05:30 IST