‘చంద్రబాబుకు రుణపడి ఉంటా.. టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తా’

ABN , First Publish Date - 2020-10-19T17:31:42+05:30 IST

తెలుగుదేశం శ్రేణులంతా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ప్రతి ఒక్క కార్యకర్త దీనిని బాధ్యతగా తీసుకోవాలని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం టీడీపీ కార్యాలయంలో విశాఖ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు,

‘చంద్రబాబుకు రుణపడి ఉంటా.. టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తా’

నాయకులను ఇబ్బందులకు గురిచేస్తే రోడ్లమీదకొచ్చి ఆందోళన చేస్తాం..

అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు బుద్ధా నాగజగీశ్వరరావు వ్యాఖ్యలు

వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి

ఐకమత్యంతో పనిచేస్తే మళ్లీ టీడీపీదే అధికారం

పార్టీ శ్రేణులకు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపు

టిడ్కో ఇళ్లను పేదలకు ఎందుకు పంపిణీ చేయడంలేదని ప్రభుత్వానికి సూటి ప్రశ్న

పార్లమెంటరీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన పల్లా, బుద్ద 

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నేతలు వెల్లడి


విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం శ్రేణులంతా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ప్రతి ఒక్క కార్యకర్త దీనిని బాధ్యతగా తీసుకోవాలని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం టీడీపీ కార్యాలయంలో విశాఖ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు, బుద్దా నాగజగదీశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, కొంతమంది నాయకులు వెళ్లినంత మాత్రాన పార్టీ బలహీనపడదని, పైగా కొత్త కేడర్‌తో మరింత బలోపేతం అవుతుందని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి నాయకులు కృషి చేయాలని, అందరం కలిసికట్టుగా పని చేసి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువద్దామన్నారు.


జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని పాలన చేస్తున్నారే తప్ప ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయడం లేదని చినరాజప్ప ఆరోపించారు.   రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు, వరదల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, కానీ సీఎం జగన్‌ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వర్షాల వల్ల రోడ్లు పూర్తిగా పాడైపోయాయని, బాగు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న అడ్డగోలు నిర్ణయాలపై కొంతమంది కోర్టులను ఆశ్రయిస్తున్నారని వీటిపై న్యాయస్థానాలు ఇస్తున్న ఆదేశాలను పాలకులు తప్పుపట్టం సరికాదని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ హయాంలో నిర్మించిన ఎనిమిది లక్షల టిడ్కో ఇళ్లను ఈ ప్రభుత్వం లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. 


అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత చంద్రబాబుకు, జిల్లా నాయకులకు రుణపడి ఉంటానని అన్నారు. రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో సమావేశమై టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వ పోలీసు కేసులు పెట్టిస్తున్నదని విమర్శించారు.  కార్యకర్తలు, నాయకులను ఇబ్బందిపెడితే రానున్న రోజుల్లో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తామన్నారు. భవన నిర్మాణదారులకు ఇసుక సరఫరా చేయాలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. టీడీపీ హయాంలో పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా, జాబితాలను రద్దు చేయడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, తెలుగుమహిళ అధ్యక్షురాలు అనిత, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-19T17:31:42+05:30 IST