టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయండి

ABN , First Publish Date - 2020-11-25T06:45:46+05:30 IST

టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని హోం శాఖ మాజీ మంత్రి, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మకాయల చినరాజప్ప సూచించారు.

టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయండి
టీడీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణాన్ని పరిశీలిస్తున్న చినరాజప్ప

మాజీ మంత్రి చినరాజప్ప


అనకాపల్లి, నవంబరు 24: టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని హోం శాఖ మాజీ మంత్రి, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. అనకాపల్లి ఎన్టీఆర్‌ మార్కెట్‌ ఎదురుగా సుమారు 15 సెంట్ల స్థలంలో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ భవనాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, అధినేత నారా చంద్రబాబునాయుడు సూచన మేరకు గ్రామ, వార్డు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలతో పార్టీ క్యాలెండర్‌ ప్రకారం సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి కార్యక్రమాలపై పోరాటానికి త్వరలో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన డీడీఆర్‌సీ సమావేశంలో టిడ్కో గృహాలపై జరిగిన అంశంపై వైసీపీ నాయకులు వాదోపవాదాలు చేసుకున్నారని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ టిడ్కో గృహాలపై అవినీతి, అక్రమాలు జరగలేదని చెప్పడం గమనార్హమని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన గృహాలు కాబట్టి బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని రాజప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, నాయకులు కొణతాల వెంకటరావు, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more