ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి

ABN , First Publish Date - 2020-12-15T05:49:55+05:30 IST

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని పులివెందులలో ఓ దళిత మహిళపై జరిగిన అత్యాచారాన్ని కానీ మరణాన్ని గానీ ఖండించలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంటే.. ఇక రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం తెలుగు మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పుచ్చా విజయ్‌కుమార్‌లు విమర్శించారు.

ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి
ప్లకార్డులు, బ్యానర్‌ పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న తెలుగు మహిళలు

రాష్ట్రంలో మహిళలకు రక్షణేది ముఖ్యమంత్రి?

నినదించిన తెలుగు మహిళలు

సిరిపురం, డిసెంబరు 14: ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని పులివెందులలో ఓ దళిత మహిళపై జరిగిన అత్యాచారాన్ని కానీ మరణాన్ని గానీ ఖండించలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంటే.. ఇక రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం తెలుగు మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పుచ్చా విజయ్‌కుమార్‌లు విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్‌ నియోజయవర్గం మహిళా విభాగం, టీడీపీ ఎస్సీ సెల్‌ సంయుక్త ఆధ్వర్యంలో పులివెందుల ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణేది ముఖ్యమంత్రి.. అంటూ ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు దారిపొడుగునా అక్కమ్మ, చెల్లమ్మ అంటూ నుదుటిపై ముద్దుపెట్టిన అన్నయ్య ఇప్పుడెక్కడా కనిపించడం లేదని దుయ్యబట్టారు. హోంశాఖ మంత్రి సుచరిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషనర్‌ చైర్మన్‌ పద్మలు కనీసం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గలగల సత్యవతి, చెరుకూరి నాగేశ్వరరావు, మంగాదేవి, త్రివేణి, రమాదేవి, ఎస్‌.సుజాత, స్రవంతి, ఈతలపాక సుజాత, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-15T05:49:55+05:30 IST