పన్ను వసూళ్లు తగ్గాయ్‌

ABN , First Publish Date - 2020-04-01T10:15:31+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పన్ను వసూళ్లపై పడింది.

పన్ను వసూళ్లు తగ్గాయ్‌

జీవీఎంసీ ఖజానాపై కరోనా ఎఫెక్ట్‌

ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం రూ.350 కోట్లు 

రూ.250 కోట్లు దాటని వైనం

మార్చి మాసాంతంలో లాక్‌డౌన్‌తో గడ్డు పరిస్థితి

అభివృద్ధి పనులు మందగించే అవకాశం

ప్రస్తుతం ప్రజలు చెల్లించే స్థితిలో లేరు

వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే బకాయిల వసూలు


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పన్ను వసూళ్లపై పడింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులు కలిపి రూ.350 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, మంగళవారం ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి రూ.250 కోట్లు దాటకపోవడం గమనార్హం. ఏటా మార్చి నెలలోనే రూ.100 కోట్లు వరకూ వసూలవుతాయి. కానీ కరోనా నేపథ్యంలో ఈ నెల పెద్దగా పన్నులు వసూలు కావడంతో లక్ష్యానికి ఆమడదూరంలో ఉండిపోవాల్సి వచ్చింది.


జీవీఎంసీ పరిధిలో సుమారు 4.8 లక్షల ఆస్తిపన్ను అసెస్‌మెంట్‌లు (ఇంటి, ఖాళీ స్థలాల పన్ను) ఉన్నాయి. వీటన్నింటి ద్వారా ఆస్తి పన్ను రూపంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.301 కోట్లు వసూలైంది. దీంతో 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి రెవెన్యూ విభాగం అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలుచేశారు. ప్రతి అసెస్‌మెంట్‌ నుంచి కచ్చితంగా పన్ను వసూలయ్యేలా చూడడం, అసెస్‌మెంట్‌ పరిధిలోకి రాని భవనాలు, దుకాణాలను గుర్తించి వాటిని పన్ను పరిధిలోకి తేవడం, నివాస వినియోగం పేరిట పన్ను చెల్లిస్తూ...వాణిజ్య అవసరాలకు వాడుతున్న భవనాలను గుర్తించడం వంటి చర్యలు తీసుకున్నారు.


వీటన్నింటి వల్ల పన్నుల వసూళ్లలో తొలి అర్ధ సంవత్సరంలో మంచి పురోగతి కనిపించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జూలై నాటికి రూ.103 కోట్లు వసూలు కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో జూలై ఆఖరు నాటికి రూ.108 కోట్లు వసూలైంది. జీవీఎంసీ పరిఽధిలో మొండి బకాయిల కింద సుమారు రూ.400 కోట్ల వరకూ వుండడంతో వాటిని కూడా వసూలు చేసేందుకు ప్రత్యేక దృష్టిసారించారు. అలాగే కొత్తగా అందుబాటులోకి వచ్చిన వార్డు సచివాలయ వ్యవస్థను కూడా పన్ను వసూళ్లు పెంచేందుకు వినియోగించుకునే ప్రయత్నం చేశారు. డోర్‌ నంబర్లు ప్రకారం ఒక్కో వార్డులోకి వచ్చే ఇళ్లను మ్యాపింగ్‌ చేసి ఆయా వార్డు సెక్రటరీలకు అందజేశారు.


బిల్‌ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఆయా వార్డులకు వెళ్లినప్పుడు వార్డు సెక్రటరీల సహకారంతో ప్రతీ అసెస్‌మెంట్‌ నుంచి పన్నులు వసూలయ్యేలా దృష్టి సారించారు. అయితే మార్చి నెల చివరి నాటికి పన్ను చెల్లించకపోతే అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి, ఎక్కువ మంది మార్చి నెల చివరి 15 రోజుల్లోనే పన్నులు చెల్లిస్తుంటారు. దీనివల్ల చివరి 15 రోజుల్లో ప్రతిరోజు సగటున ఏడు కోట్ల రూపాయల వరకూ వసూలవుతుంది. అయితే సరిగ్గా అప్పటి నుంచే కరోనా వైరస్‌ అలజడి మొదలవడంతో పన్నుల వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. జీవీఎంసీకి పన్నులే ప్రధాన ఆర్థిక వనరు కావడంతో పన్నుల రూపంలో ఖజానాకు గణనీయంగా గండి పడినట్టయింది. దీని ప్రభావం జీవీఎంసీ పరిధిలో సాధారణ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పడే అవకాశం వుందని జీవీఎంసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 


పన్ను వసూళ్లు తగ్గడంపై జీవీఎంసీ డీసీఆర్‌ ఫణిరామ్‌ వద్ద ప్రస్తావించగా, ప్రస్తుతం సిబ్బంది కరోనా విధుల్లో వున్నందున పన్నుల వసూళ్లపై దృష్టి సారించలేకపోయామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలను పన్ను చె ల్లించాలని ఒత్తిడి చేయడం సరికాదు కాబట్టి, ఆ పనిచేయడం లేదన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లోటును భర్తీ చేసుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు.

Updated Date - 2020-04-01T10:15:31+05:30 IST