‘స్వచ్ఛభారత్ మిషన్’ టాప్ 10లో జీవీఎంసీ
ABN , First Publish Date - 2020-09-14T09:05:08+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘స్వచ్ఛభారత్ మిషన్’లో..
ప్రజల భాగస్వామ్యం కేటగిరీలో దేశంలోనితొలి పది నగరాల్లో విశాఖకు స్థానం
జీవీఎంసీ, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలు ఒక యూనిట్‌గా పరిగణన
ఈ నెలాఖరున ర్యాంకు ఖరారు
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘స్వచ్ఛభారత్ మిషన్’లో ప్రజల భాగస్వామ్యం కేటగిరీలో విశాఖపట్నం దేశంలోని తొలి పది నగరాల్లో నిలిచిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావు తెలిపారు. స్వచ్భభారత్ మిషన్‌లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, చెత్తవిభజనతోపాటు సానిక సంస్థలు అందించే సేవలు, కార్యక్రమాలపై అవగాహన, పనుల్లో లోటుపాట్లను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రజల్లో చైతన్యం ఏస్థాయిలో ఉందనే దానిపై కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో సర్వే నిర్వహించింది. ప్రతి జిల్లాలో కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాంక్‌ని నిర్ణయిస్తారు.
ఈ క్రమంలో జీవీఎంసీతోపాటు జిల్లాలోని నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలను ఒక యూనిట్‌గా తీసుకున్నారు. జాతీయస్థాయిలో మొదటి పది స్థానాల్లో చోటు దక్కింది. ఫలితాలను పరిశీలించిన తర్వాత ఈనెలాఖరునాటికి తుది ర్యాంకుల ఫలితాలను వెల్లడిస్తారు. ఈ క్రమంలో జీవీఎంసీ కమిషనర్ డాకర్ జి.సృజనతోపాటు జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్.... స్వచ్ఛభారత్‌లో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతితోపాటు ప్రజలను ఏ విధంగా భాగస్వామ్యులుగా చేస్తున్నామనే దానిపై ఈనెల 11న ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులకు ఆన్‌లైన్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.