కుదుటపడని కూలీల బతుకులు

ABN , First Publish Date - 2020-12-19T06:39:11+05:30 IST

‘కూలోడు బతుకేటో అరదం కావడం లేదు. ఈ సమచ్చరంలో గట్టిగా నెల్రోజులు పనైనా దొరకనేదు. కరోనా వచ్చిన తరవాత నుంచి ఇప్పిటికీ పని దొరకడము నేదు. కేసులు తగ్గి నాయని తెలిసి పనులు దొరుకుతాయని రెన్నెళ్ల కిందట ఊరు నుంచి వచ్చినాము.

కుదుటపడని కూలీల బతుకులు
ఎన్‌ఏడీ జంక్షన్‌లో పనుల కోసం వేచివున్న భవన నిర్మాణ కార్మికులు

కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గినా...దొరకని రోజువారీ పనులు

లాక్‌డౌన్‌ తరువాత సొంతూళ్లకు వెళ్లిన వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు

పరిస్థితులు మెరుగుపడడంతో నగరానికి తిరిగి రాక

రోజులు గడుస్తున్నా...మెరుగుపడని పరిస్థితులు

గంటల తరబడి జంక్షన్లలో నిలబడి ఇళ్లకు వెళ్లిపోతున్న వైనం

ఇసుక సరఫరా సక్రమంగా లేకపోవడం,

సిమెంట్‌ ధరలు పెరగడమే కారణమంటూ ఆవేదన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)  

‘కూలోడు బతుకేటో అరదం కావడం లేదు. ఈ సమచ్చరంలో గట్టిగా నెల్రోజులు పనైనా దొరకనేదు. కరోనా వచ్చిన తరవాత నుంచి ఇప్పిటికీ పని దొరకడము నేదు. కేసులు తగ్గి నాయని తెలిసి పనులు దొరుకుతాయని రెన్నెళ్ల కిందట ఊరు నుంచి వచ్చినాము. పెతిరో జూ సెంటరకెళ్లి నిలబడి రావడమే మిగులుతోంది తప్పా...పనులు మాత్రం దొరక్కంతన్నాయి. ఊరు నుంచి వచ్చి రెన్నెళ్లయినా ఆరు రోజులే పని దొరికింది. మా ఇంటిదానికైతే ఒక ్కరోజూ దొరకనేదు’

...ఇదీ ఇసుకతోట ప్రాంతానికి చెందిన రోజువారీ కూలి రామారావు ఆవేదన. 

ప్రస్తుతం ఒక్క రామారావుదే కాదు...భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది కూలీలదీ ఇదే పరిస్థితి. కరోనాతో మొదలైన వీరి కష్టాలు నేటికీ కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు వెళ్లిపోయామని, కేసులు తగ్గుముఖం పట్టి బస్సులు తిరగడం ప్రారంభమైన తరువాత నగరానికి వచ్చామని...రోజులు గడుస్తున్నా పనులు దొరకడం లేదని వెంకోజీపాలెం ప్రాంతంలో నివాసం వుంటున్న తాపీమేస్ర్తీ వెంకటరావు వాపోయాడు. ప్రతిరోజూ క్యారేజీ పట్టుకుని సెంటర్‌కు వెళ్లి గంటల తరబడి ఎండలో నిలబడి...ఎవరు పనికి పిలుస్తారా అని ఆశగా ఎదురుచూడడం, తిరిగి వచ్చేయడం జరుగుతోందన్నాడు. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి వుంటుందో తమకే అర్థం కావడం లేదని, అప్పు చేసి ఇంటి అద్దె, కరెంట్‌ బిల్లు వంటివి కట్టుకోవాల్సి వస్తోందన్నాడు. 


రెండు రోజులు దొరకడం కష్టమే.. 

నగర పరిధిలో సుమారు మూడు లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఉంటారు. వీరిలో 70-80 శాతం మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లే. వీరంతా లాక్‌డౌన్‌ విధించడంతో కుటుంబాలతో సహా సొంతూళ్లకు వెళ్లిపోయారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి నగరానికి చేరుకున్నారు. గతంలో మాదిరిగానే రోజువారీ పనుల కోసం నగరంలోని అనేక ప్రాంతాల్లోని కూడళ్ల వద్ద క్యారేజీలు పట్టుకుని ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రతిరోజూ నిరీక్షించడమే తప్ప..పనులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వారంలో ఐదు రోజులు పని దొరికితే..ఇప్పుడు రెండు రోజులు దొరకడమూ కష్టంగా మారిందంటున్నారు. ప్రతి సెంటర్‌లో వేయి నుంచి మూడు వేల మంది ఉంటే...వారిలో 400-500 మందికి కూడా పని దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఇసుక, సిమెంట్‌తోనే సమస్య 

ప్రస్తుతం తమకు పనులు దొరకకపోవడానికి ఇసుక ధర, సక్రమంగా అందకపోవడమే కారణమని భవన నిర్మాణ రంగ కూలీలు ఆరోపిస్తున్నారు. బడా కాంట్రాక్టర్లకు దొరుకుతున్న ఇసుక...చిన్న చిన్న ప్యాచ్‌ వర్కులు, నిర్మాణాలు చేసుకునే వారికి లభించడం లేదన్నారు. చిన్న చిన్న నిర్మాణాలపైనే 60-70 శాతం మంది నిర్మాణ కూలీలు ఆధారపడి వున్నారని చెబుతున్నారు. ఇసుక, పెరిగిన సిమెంట్‌ ధరలతో పనులు జరగడం లేదని వాపోతున్నారు. 


ఆర్థిక ఇబ్బందులు

పనులు దొరుకుతాయన్న ఆశతో వచ్చి..ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోజువారీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు లేకపోవడంతో పూట గడవడానికి అ ప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. పెరిగిన కూరగాయల ధరలు, కరెంట్‌ చార్జీలు, ఇంటి అద్దెలతో బతకడమే కష్టంగా ఉందని..అప్పులు చేస్తే వడ్డీలు పెరిగి పోతున్నాయని వారంతా వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో సొంతూళ్లకు వెళ్లిపోదామంటే సి గ్గేస్తోందని, అలాగని ఇక్కడ వుండలేని పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. 


కృత్రిమ కొరతతో కూలీల పొట్ట కొడుతున్నారు.. 

- పడాల రమణ, భవన నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర ప్రెసిడెంట్‌

 వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తరువాత అన్ని రంగాలు క్రమంగా కోలుకుంటున్నా.. నిర్మాణ రంగంలో మాత్రం పరిస్థితి అలానే కొనసాగుతోంది. దీనికి కారణం కరోనా వైరస్‌ కా దు...ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించి దోచుకుంటున్న పాలకుల స్వార్థం. కొత్త ఇసుక పాలసీ పేరుతో...వచ్చిన ఏడాదిలో ఇసుక కొరత సృష్టించి నాలుగు నెలలు పనులు లేకుండా చేశారు. ఆ ఇబ్బందులు నుంచి మెల్లగా కోలుకుంటున్న తరుణంలో కరోనా వైరస్‌ మళ్లీ కోలుకోలేని దెబ్బ కొట్టింది. వైరస్‌ వ్యాప్తి తగ్గి పనులు ప్రారంభమవుతాయని భావిస్తుంటే..ఇంకా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇప్పటికీ చేయడానికి పనులు దొరకని పరిస్థితి. ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో భవన నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యలు చూస్తారు. 


అప్పులు చేసి బతుకు వెళ్లదీస్తున్నాం.. 

- ఎల్‌.బంగార్రాజు, రోజువారీ కూలీ

కరోనా సమయంలో ఊరెళ్లి నెలన్నర కిందట వచ్చాము. మా ఇంటిది, నేను వెళ్లి రోజూ జంక్షన్‌లో నిలబడడమే తప్ప పని దొరకడం లేదు. నెలన్నరలో నాకు నాలుగు రోజులు పని దొరకితే..మా ఇంటి దానికి అదీ దొరకనేదు. ఊళ్లో వుంటే ఉపాధి పనికి వెళ్లినా కొంత డబ్బు వచ్చేది. ఇక్కడకు వచ్చి ఇరుక్కుపోయినట్టు అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలాగని ఊరెళ్లలేని పరిస్థితి. ప్రతిరోజూ పని దొరుకుతుందన్న ఆశతో సెంటర్‌కు వెళ్లడం రావడమే మిగులుతోంది. 


Updated Date - 2020-12-19T06:39:11+05:30 IST