చెరకు బకాయిల చెల్లింపు ప్రశ్నార్థకం

ABN , First Publish Date - 2020-02-16T08:17:18+05:30 IST

చెరకు బకాయిల చెల్లింపు ప్రశ్నార్థకం

చెరకు బకాయిల చెల్లింపు ప్రశ్నార్థకం

  • ఎన్‌సీడీసీ రూ.100 కోట్ల 
  • రుణంపై దాగుడుమూతలు
  • అమలు కాని జీవో నంబరు 2
  • నెల గడచినా విడుదల కాని నిధులు
  • చేతులెత్తేసిన షుగర్స్‌ యాజమాన్యాలు
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు
  • ఆందోళనలో రైతులు, కార్మికులు

చోడవరం, ఫిబ్రవరి 15: జిల్లాలో షుగర్‌ ఫ్యాక్టరీల పరిధిలోని చెరకు రైతుల బకాయిలు, కార్మికుల వేతనాల చెల్లింపు ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకోసం ఎన్‌సీడీసీ నుంచి రావలసిన రూ.100 కోట్ల రుణం ఇంతవరకు విడుదల కాలేదు. రుణం మంజూరుకు గతనెల 9వ తేదీన జారీ చేసిన జీవోఎంఎస్‌ నంబరు-2 అమలుకు నోచుకోలేదు. బకాయిలు, వేతనాల చెల్లిస్తామంటూ అధికార పార్టీ నేతలు సంక్రాంతి పండుగ ముందు నుంచి ఆర్భాటం చేశారు. అయితే నెల రోజులు కావస్తున్నా.. ఇప్పటి వరకూ ఆ ఎన్‌సీడీసీ రుణం మాత్రం ఫ్యాక్టరీ ఖాతాలకు జమ కాకపోవడంతో జిల్లాలో చెరకు రైతుల బకాయిలు, కార్మికుల వేతనాల చెల్లింపు ప్రశ్నార్థకం అయ్యింది.


జిల్లాలోని నాలుగు సహకార షుగర్‌ ఫ్యాక్టరీల ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన రాష్ట్రప్రభుత్వం వాటికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలోని మూడు షుగర్‌ ఫ్యాక్టరీలతోపాటు, విజయనగరం జిల్లా భీమసింగి షుగర్‌ ఫ్యాక్టరీకి నిధులు కేటాయిస్తున్నట్టు జీవో నంబరు 2 జారీ చేసింది. మంజూరైన వంద కోట్ల రుణంలో తాండవ ఫ్యాక్టరీకి రూ.19.66 కోట్లు, ఏటికొప్పాకకు రూ.27.61 కోట్లు, గోవాడకు రూ.40.28 కోట్లు, విజయనగరం జిల్లా భీమసింగి ఫ్యాక్టరీకి రూ.12.45 కోట్లు కేటాయించింది. గోవాడకు మంజూరైన రూ.40 కోట్లలో రూ.18 కోట్లు బకాయిలు, కార్మికుల వేతనాలకు పోగా, మిగిలిన రూ.22 కోట్లు ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు వినియోగించాలంటూ జీవోలో సూచించింది. ఎన్‌సీడీసీ రుణం మంజూరైందని, చెరకు రైతుల బకాయిలతోపాటు, కార్మికుల వేతనాలు కూడా వారంలోగా చెల్లింపులు పూర్తవుతాయంటూ అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా సంక్రాంతి పండుగ ముందు పత్రికా ముఖంగా ప్రకటించారు. దీంతో గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద సీఎం, స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ చిత్రపటాలకు పాలాభిషేకాలు కూడా నిర్వహించారు. సంక్రాంతి పండుగ ముందు రుణంపై జీవో జారీ కావడంతో తమ బకాయిలకు మోక్షం కలుగుతుందని రైతులు, తమ వేతన బకాయిలు చేతికి అందుతాయన్న ఆనందంలో కార్మికులు మునిగిపోయారు. షుగర్‌ ఫ్యాక్టరీ అధికారులు సైతం ఎన్‌సీడీసీ రుణం రావడం ఖాయమని, బకాయిలు చెల్లింపులు పూర్తవుతాయన్న నమ్మకంతోనే ఉన్నారు. 


జీవో సరే....నిధులేవీ?

ఎన్‌సీడీసీ రెండో విడత రుణం మంజూరుపై ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ, నెలరోజులు దాటినా ఇంతవరకూ ఆ నిధులు మాత్రం విడుదల కాలేదు. ఇటు అధికార పార్టీ నేతలు.. అటు అధికారులు హడావిడి చేసినా నిధులు మాత్రం రాలేదు. ఇదే సమయంలో షుగర్‌ ఫ్యాక్టరీలకు కేటాయించిన రుణం ఆర్థిక శాఖ నుంచి ట్రెజరీలకు జమ అయ్యిందని, అక్కడ నుంచి నేరుగా ఆయా ఫ్యాక్టరీలకు రావడమే తరువాయి అంటూ ప్రచారం జరిగింది. అయితే ఇపుడు ఈ ప్రచారమూ కూడా పాతబడిపోయింది. ప్రస్తుతం ఎన్‌సీడీసీ రుణం మంజూరుపై ఎవరూ మాట్లాడడం లేదు. ఆ రుణం ఎప్పుడు వస్తుందనేది ఇటు అధికారులు కానీ, అటు అధికార పార్టీ నేతలు కానీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రుణం వచ్చేసింది.. తమ బకాయిలు చేతికి అందడం ఖాయమన్న ఆశతో ఉన్న చెరకు రైతులకు ఈ పరిస్థితి ఆందోళనకు గురిచేస్తున్నది. కాగా, రుణం మంజూరవుతుందన్న ధీమాతో షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న పంచదారను కుదవపెట్టి, కార్మికులకు అడ్వాన్స్‌ రూపంలో కొంతమేర వేతనాలు చెల్లించారు. రుణం వస్తే వాటిని సర్దుబాటు చేసి, సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు పేమెంట్లు ఇవ్వవచ్చన్న ఉద్దేశంతో ఈ విధంగా సర్దుబాటు చేశారు. అయితే రుణం మాత్రం విడుదల కాకపోవడంతో సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు చెల్లింపులపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్‌సీడీసీ రుణం వస్తే తప్ప ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఏమీ చేసేటట్టు కనిపించడం లేదు. 

Updated Date - 2020-02-16T08:17:18+05:30 IST