‘కారిడార్‌’ సబ్‌ స్టేషన్‌ పనులు అడ్డుకుంటాం

ABN , First Publish Date - 2020-11-07T05:43:20+05:30 IST

నక్కపల్లి మండలం అమలాపురం పంచాయతీ పరిధి పాటిమీద గ్రామంలో గల కారిడార్‌ నిర్వాసితులు రెవెన్యూ అధికారుల తీరుపై శుక్ర వారం భగ్గుమన్నారు.

‘కారిడార్‌’ సబ్‌ స్టేషన్‌ పనులు అడ్డుకుంటాం
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నినాదాలు చేస్తున్న గ్రామస్థులు

 న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదు

పాటిమీద గ్రామ నిర్వాసితుల స్పష్టీకరణ

 పట్టాలేని భూములు తీసుకొని పరిహారం ఇవ్వాలి డిమాండ్‌


నర్సీపట్నం టౌన్‌, నవంబరు 6 : నక్కపల్లి మండలం అమలాపురం పంచాయతీ పరిధి పాటిమీద గ్రామంలో గల  కారిడార్‌ నిర్వాసితులు రెవెన్యూ అధికారుల తీరుపై శుక్ర వారం భగ్గుమన్నారు. తమకు న్యాయం జరిగే వరకు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. విశాఖ- చెన్నై కారిడార్‌లో భాగంగా పాటిమీద గ్రామంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా భూములు, ఇళ్లు, కొబ్బరి చెట్లు కోల్పోతున్న  నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమ, బుధవారాల్లో ఆందోళనలు చేప ట్టారు. ఈ నేపథ్యంలో నిర్వాసితుల సమస్యలపై చర్చించేం దుకు సబ్‌ కలెక్టర్‌ శుక్రవారం ఆహ్వానించినట్టు సీపీఎం నాయకుడు ఎం.అప్పలరాజు విలేఖరులకు తెలిపారు. జిరాయితీ, పట్టా భూములకు నష్టపరిహారం ఇచ్చినట్టే.. పట్టాలు లేకుండా సాగు చేసుకుంటున్న 10 ఎకరాల భూమికి పరిహారం ఇవ్వాలని చర్చల సందర్భంగా గ్రామస్థులు కోరా రన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం తక్కువ ఇచ్చారని, కొబ్బరి చెట్టుకు రూ.3,480లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.150 మాత్రమే పరిహారం ఇచ్చారని సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లారన్నారు. చర్చలు జరుగుతుండగా, సాగు చేసుకుంటున్న భూముల గురించి మాట్లాడ వద్దని చెప్పి చర్చల మధ్యలోంచి సబ్‌ కలెక్టర్‌ చాంబర్‌లోకి వెళ్లిపోయారని చెప్పారు. దీంతో అధికారుల తీరుపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగినట్టు తెలిపారు. సాగుభూములకు నష్టపరిహారం ఇచ్చే వరకు సబ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులను అడ్డుకుంటామని నాయకులు ఆర్‌.శ్రీను, జి.నర్సింగరావు, ఆర్‌.అప్పారావు తదితరులు స్పష్టం చేశారు. 


Updated Date - 2020-11-07T05:43:20+05:30 IST