కదం తొక్కిన కార్మికులు

ABN , First Publish Date - 2020-11-27T05:40:34+05:30 IST

ప్రధాని మోదీ ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోలేని పక్షంలో పతనం తప్పదని ఏఐటీయూసీ, సీఐటీయూ, ఇఫ్టూ, సీపీఐ, సీపీఎం తదితర వామపక్ష కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.

కదం తొక్కిన కార్మికులు
తగరపువలసలో సీఐటీయూ ప్రదర్శన

కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోకుంటే మోదీ ప్రభుత్వం పతనం

సీపీఐ, సీపీఎం నేతలు జేవీ సత్యనారాయణ మూర్తి, సీహెచ్‌ నరసింగరావు

నగరంలో పెద్దఎత్తున కార్మిక ప్రదర్శన

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మికులు కదంతొక్కారు. గురువారం నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో  భాగంగా అనేక ప్రాంతాల్లో వామపక్షాలు, కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

సిరిపురం, నవంబరు 26: ప్రధాని మోదీ ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోలేని పక్షంలో పతనం తప్పదని ఏఐటీయూసీ, సీఐటీయూ, ఇఫ్టూ, సీపీఐ, సీపీఎం తదితర వామపక్ష కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో  సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావులు మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలను తమ అనుయాయులైన అంబానీ, అదానీ తదితర కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడతామంటే కార్మికవర్గం, విశాఖ ప్రజనీకం చూస్తూ ఊరుకోరన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పోస్కోకు కట్టబెట్టే చర్యలను తక్షణమే విడనాడకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులకు, సంపద సృష్టించే కార్మికులకు నష్టం చేసేవారిని ప్రజలు క్షమించారన్నారు. ఇప్పటికైనా కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ, ఇఫ్టూ నాయకుడు వై.కొండయ్య, సీఐటీయూ నాయకులు ఎం.జగ్గునాయుడు, పడాల రమణ, ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, కె.సత్యాంజనేయ, ఎస్కే రెహమాన్‌, ఎం.మన్మథరావు, అఖిలపక్ష కార్మిక సంఘాలు, వామపక్షాల నాయకులు, అసంఘటిత రంగాల కార్మికులు పాల్గొన్నారు. కాగా రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం నుంచి ప్రారంభమైన కార్మిక ప్రదర్శన సంగం-శరత్‌ మీదుగా గురజాడ అప్పారావు విగ్రహం, ఆశీలమెట్ట మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సాగింది. 


మధురవాడ: మధురవాడలో పాక్షికంగా బంద్‌ జరిగింది. ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆటోలను నిలిపివేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్‌ చేశారు. పొన్నాడ సాయి, వైఎస్‌ మూర్తి, ఎం.సత్యం, సురేశ్‌, సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.


తగరపువలస: వివిధ కర్మాగారాలకు చెందిన కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన బైపాస్‌ రోడ్డు వరకు సాగాక అంబేడ్కర్‌ కూడలిలో మానవహారాన్ని నిర్వహించారు. నాయకులు ఎస్‌.అప్పలనాయుడు, నర్సింగరావు, పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.


పద్మనాభం: కేంద్రం విధానాలను నిరసిస్తూ పద్మనాభం కూడలి నుంచి కుంతీమాధవస్వామి ఆలయం వరకు ర్యాలీ చేపట్టాక రాస్తారోకో చేశారు. సీఐటీయూ నాయకులు రవ్వా నర్సింగరావు, పి.ఆదినారాయణతో పాటు అంగన్‌వాడీ వర్కర్లు, వివిధ సంఘాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.


వెంకోజీపాలెం: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పీఠికను చదివి వినిపించి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించి, రాజ్యాంగం యొక్క విలువలను విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌.కె.వి.రంగారావు వివరించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఎస్‌.అప్పలనాయుడు, కె.ప్రవీణ్‌కుమార్‌, పి.శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2020-11-27T05:40:34+05:30 IST