స్టేడియం అధ్వానం

ABN , First Publish Date - 2020-12-06T06:13:08+05:30 IST

క్రీడాకారులకు, ఉదయం, సాయంత్రం వేళ్లల్లో వాకింగ్‌కు వెళ్లే వారికి ఎంతో ఉప యోగకరంగా వున్న స్థానిక ఎన్‌టిఆర్‌ మునిసిపల్‌ స్టేడియం నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు.

స్టేడియం అధ్వానం
విరిగిన గేటు

నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు

విరిగిపోయిన గేట్లు...వెలగని లైట్లు 

బహిర్భూమిగా మారిన గ్యాలరీ ప్రాంతం

కాలువలు అస్తవ్యస్తం...వర్షంపడితే మైదానం బురదమయం

రాత్రిపూట మందుబాబులు, అసాంఘిక కార్యక్రమాలకు నిలయం

చుట్టుపక్కల నివాసితులు డంపింగ్‌ యార్డుగా వాడుతున్న వైనం 

ఇబ్బంది పడుతున్న క్రీడాకారులు, వాకర్స్‌ 



అనకాపల్లి, డిసెంబరు 5: క్రీడాకారులకు, ఉదయం, సాయంత్రం వేళ్లల్లో వాకింగ్‌కు వెళ్లే వారికి ఎంతో ఉప యోగకరంగా వున్న స్థానిక ఎన్‌టిఆర్‌ మునిసిపల్‌ స్టేడియం నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. కొన్ని గేట్లు పాడైపోగా, మరికొన్నింటిని ఆకతాయిలు ధ్వంసం చేశారు. వర్షం పడితే స్టేడియం చెరువును తలపిస్తున్నది. మరుగుదొడ్ల నిర్మాణం మధ్యలోనే ఆపేశారు. జిమ్‌ను ఇక్కడి నుంచి తరలించేశారు. గ్యాలరీల కింది స్థలం బహిర్భూమిగా మారింది. పలుచోట్ల లైట్లు వెలగకపోవడంతో రాత్రి పూట అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. 

ప్రస్తుత వైసీపీ నేత దాడి వీరభద్రరావు తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా వున్నప్పుడు అనకాపల్లికి స్టేడియం మంజూరు చేయించి, ఎన్టీఆర్‌ పేరుమీద నిర్మాణం చేయించారు. తరువాత దశల వారీగా పలు అభివృద్ధి పనులు జరిపించారు. పీలా గోవింద సత్యనారాయణ ఎమ్మెల్యేగా వున్నప్పుడు సుమారు రూ.25 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ఏడాది కరోనా వైరస్‌ ప్రబలి, లాక్‌డౌన్‌ విధించేంత వరకు స్టేడియం నిర్వహణ కొంతమేర బాగానే ఉంది. తరువాత కొంతకాలంపాటు అక్కడ రైతుబజార్‌ ఏర్పాటుచేశారు.  అప్పటి నుంచి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ప్రొఫెషనల్‌ క్రీడాకారులు కాకుండా, గల్లీ క్రీడాకారులు స్టేడియంలో హల్‌చల్‌ చేస్తున్నారు. బెట్టింగులతో క్రికెట్‌ ఆడుతున్నారు. 


స్టేడియం చుట్టూ పలుచోట్ల వున్న గేట్లు నిర్వహణ లేక పాడైపోతున్నాయి. ఆకతాయిలు కొన్ని గేట్లను ధ్వంసం చేశారు. కాలువలు పూడుకుపోవడం వల్ల వర్షం పడితే స్టేడియం ఆవరణలో నీరు నిలిచి, బురదమయం అవుతున్నది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కాలువపై పలకలు తీసేశారు. స్టేడియం గ్యాలరీ కింద ప్రాంతాన్ని బహిరంగ మరుగుదొడ్డిగా మార్చేశారు. ఈశాన్య భాగంలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. స్టేడియంలో కొన్ని లైట్లు వెలగడం లేదు. రాత్రిపూట మందుబాబులు, ‘చీకటి పనులు’ చేసేవారికి అడ్డాగా మారింది. ఇక్కడ మేడపై వున్న జిమ్‌ను తరలించేశారు. చట్టుపక్కల ఇళ్లల్లో నివాసం వుంటున్నవారు చెత్తా చెదారాన్ని స్టేడియంలో పడేస్తున్నారు.

Updated Date - 2020-12-06T06:13:08+05:30 IST