వైసీపీలో చల్లారని చిచ్చు?.. పార్టీ కీలక నేత తీరుపై అసంతృప్తి..!

ABN , First Publish Date - 2020-12-15T06:32:21+05:30 IST

అధికార పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి రాజుకుంటోంది. ఇది నగరంలో మరో వర్గాన్ని తయారుచేసే స్థాయికి చేరిందని పార్టీలో చర్చ జరుగుతోంది.

వైసీపీలో చల్లారని చిచ్చు?.. పార్టీ కీలక నేత తీరుపై అసంతృప్తి..!

సీఎం వద్ద పంచాయితీ జరిగిన తరువాత కూడా ఇసుమంతైనా మార్పు లేదంటున్న నేతలు

అధికారులకు ఆయన మాటే వేదవాక్కు...

కనీసం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన

ఇటీవల నగరానికి వచ్చిన వైవీ సుబ్బారెడ్డిని కలిసి గోడువెళ్లబోసుకున్న పలువురు నేతలు

తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన?

మరో గ్రూపు సిద్ధం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అధికార పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి రాజుకుంటోంది. ఇది నగరంలో మరో వర్గాన్ని తయారుచేసే స్థాయికి చేరిందని పార్టీలో చర్చ జరుగుతోంది. మొన్నటివరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు జిల్లాలో ప్రాధాన్యం లేదని, అధికారులు ఎవరూ తమ మాట వినడం లేదని బాధపడుతూ వచ్చారు. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో బహిరంగంగానే కొందరు అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనిపై పార్టీ అధినేత సమక్షంలోనే పంచాయితీ జరిగింది. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ అక్కడ...వారు కుండబద్దలు  కొట్టినట్టు చెప్పారు. దాంతో ఇక్కడి పార్టీ బాధ్యుడికి అధినేత పలు సూచనలు చేశారు. నాయకత్వంపై వ్యతిరేకత వచ్చిదంటే...ఇబ్బందులు తప్పవని, జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి పంపించారు. ఆయన ఆ మరుసటిరోజే ప్రభుత్వ అతిథి గృహంలో ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇకపై తరచూ సమావేశాలు ఏర్పాటుచేసి, అందరి అభిప్రాయాలు తెలుసుకుంటానని ప్రకటించారు. అయితే ఆ తరువాత కూడా ఎటువంటి మార్పు లేదని పార్టీ నాయకులు వాపోతున్నారు. ఇప్పటికీ జిల్లా అధికారులు పార్టీ బాధ్యుడు చెప్పిన పనులు మినహా తాము చెప్పినవేవీ చేయడం లేదని చెబుతున్నారు. ‘ఆయన’ ఆశీస్సులు వుంటే చాలని, ప్రతి ఒక్క నాయకుడికి సలామ్‌ కొట్టక్కర్లేదన్నట్టుగా ఉన్నతాధికారులు ప్రవర్తిస్తు న్నారని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అధికారులు విపరీతమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్టు అధికార పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇటీవల నగరానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వచ్చారు. ప్రొటోకాల్‌ ప్రకారం ఆయన బస చేసే ప్రాంతంలో, ప్రయాణించే మార్గంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) అధికారులు తగిన చర్యలు చేపట్టాలి. గతంలో వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా పనిచేసిన బసంత్‌కుమార్‌ కుమారుడి వివాహానికి నాటి గవర్నర్‌ నరసింహన్‌ వచ్చినప్పుడు....అప్పటి జీవీఎంసీ అధికారులు సుమారుగా రూ.15 లక్షలు వెచ్చించి విశాలాక్షినగర్‌లో ప్రాంతంలో రహదారులు బాగున్నా, వాటిపై మళ్లే మరో లేయరు వేశారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వస్తున్నారని, ఆయన సాగర్‌నగర్‌లో ఉంటారని, అటు వైపు రహదారి బాగా లేదని, బాగు చేయాలని స్థానిక సంఘాల నాయకులతో పాటు ఆ నియోజకవర్గ నేతలు జీవీఎంసీ ఉన్నతాధికారులను లేఖ ద్వారా కోరారు. అక్కడక్కడా గోతుల్లో రాళ్లు వేసి, మట్టి పోశారే తప్ప రహదారిని బాగు చేయలేదు. వాస్తవానికి ప్రొటోకాల్‌ పాటించాల్సిన బాధ్యత అధికారులకూ ఉంది. కానీ వారు ఇప్పుడు వైసీపీ ప్రధాన బాధ్యుడు వచ్చినపుడు అప్రమత్తంగా వుంటే చాలని, ఇంకెవరూ నగరానికి వచ్చినా ఏమీ చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


సుబ్బారెడ్డి రాక వెనుక వ్యూహం

మూడు రోజుల క్రితం వైసీపీ నాయకుడు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ పనిపై నగరానికి వచ్చారు. టీటీడీ తరపున శ్రీవారి కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఆయనకు గతంలో విశాఖలో వ్యాపారాలు, అనుచర వర్గం ఉన్నాయి. ఈ నేపథ్యలో ఆయనకు స్వాగతం పలకడానికి విశాఖ విమానాశ్రయానికి ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు సమన్వయకర్తలు వెళ్లారు. ఆయన బీచ్‌రోడ్డులోని ఓ స్టార్‌ హోటల్‌లో బస చేయగా కొందరు పార్టీ నాయకులు వెళ్లి కలిశారు. అక్కడి నుంచి అంతా బయలుదేరి రుషికొండలో టీటీడీ నిర్మిస్తున్న దేవాలయం వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి కార్తీక దీపోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో పార్టీ కార్యకలాపాలపై వారి మధ్య చర్చ జరిగింది. ఆయన్ను కలిసిన నాయకులంతా తమకు అన్యాయం జరుగుతోందని, ఏ పనులు జరగడం లేదని, అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు.  


మార్పు కోసమేనా?

విశాఖపట్నం అధికార పార్టీకి చాలా కీలకమని, ఇక్కడ అసంతృప్తి అధికంగా ఉన్నందున, త్వరలో నాయకత్వ మార్పులు జరిగే సూచనలు ఉన్నాయని, అందుకే సుబ్బారెడ్డి విశాఖలో అడుగు పెట్టారని పార్టీలో కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఏం జరగబోతుందో చూడాలి.

Read more