కొన్ని కళకళ వెలవెల

ABN , First Publish Date - 2020-05-29T09:31:43+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా సుమారు రెండు నెలలపాటు నిలిచిపోయిన వ్యాపారాలు మళ్లీ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి.

కొన్ని కళకళ వెలవెల

లాక్‌డౌన్‌ తరువాత ప్రారంభమైన వ్యాపార కార్యకలాపాలు

ఎలక్ర్టానిక్‌, గృహోపకరణ వస్తువుల విక్రయాలు ఫర్వాలేదు

భారీగా ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌ల అమ్మకాలు

ఆన్‌లైన్‌ తరగతులు/సమావేశాలతో

స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లకు డిమాండ్‌

ఇంకా ఊపందుకోని వస్త్ర, బంగారు ఆభరణాల విక్రయాలు

కనీసం 10-15 శాతం విక్రయాలు కూడా జరగని వైనం

మరో నాలుగు నెలలు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని వ్యాపారుల అంచనా


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కారణంగా సుమారు రెండు నెలలపాటు నిలిచిపోయిన వ్యాపారాలు మళ్లీ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఎలక్ర్టికల్‌, గృహోపకరణాల షాపులు కొద్దిరోజుల కిందటే తెరుచుకోగా, వస్త్ర, బంగారం, పాదరక్షల దుకాణాలు రెండు రోజుల కిందట మొదలయ్యాయి. అయితే కొన్నిరకాల వ్యాపారాలు బాగానే సాగుతున్నా, మరికొన్ని చాలా మందకొడిగా ఉన్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.నగరంలో ఎలక్ర్టానిక్‌, గృహోపకరణాలు విక్రయించే షాపులు కాస్త కొనుగోలుదారులతో కళకళలాడుతుండగా, వస్త్ర, బంగారు, పాదరక్షలు దుకాణాలు మాత్రం వెలవెలబోతున్నాయి. ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌లు విక్రయించే దుకాణాలకు మాత్రం అధికసంఖ్యలో వినియోగదారులు తరలివస్తున్నారు. నగరంలోని ఒక ప్రధాన షోరూమ్‌లో ప్రతిరోజూ 100 వరకు ఏసీలు విక్రయమవుతుండగా, అదేస్థాయిలో కూలర్ల అమ్మకాలు సాగుతున్నాయి. ఫ్రిజ్‌లు, ఫ్యాన్ల విక్రయాలు కూడా భారీగానే జరుగుతున్నట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే ఏటా జరిగే వ్యాపారాలతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారం చాలా తక్కువని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. 


భారీగా ఫోన్‌లు, ట్యాబ్‌ల విక్రయాలు

లాక్‌డౌన్‌ తరువాత ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు విక్రయాలు భారీగానే జరుగుతున్నట్టు ఆయా వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వ్యాపార, ఉద్యోగ సమావేశాలు, విద్యార్థులకు తరగతులు ఆన్‌లైన్‌లోనే జరుగుతుండడంతో అందుకు అవసరమైన స్మార్ట్‌ ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు. వీటి బిజినెస్‌ సాధారణ రోజులతో పోలిస్తే 20 శాతం పెరిగినట్టు పేర్కొంటున్నారు. నగర పరిధిలోని సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ షోరూమ్‌లు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ట్యాబ్‌లను డిమాండ్‌కు అనుగుణంగా నగర వ్యాపారులు సరఫరా చేయలేకపోతుండడంతో ఆన్‌లైన్‌లో కొంతమంది కొనుగోలు చేసుకుంటున్నారు. 


వస్త్ర వ్యాపారం 15 శాతమే...

రెండు నెలల తరువాత తెరిచినా వస్త్ర, బంగారం దుకాణాలు మాత్రం వెలవెలబోతున్నాయి. సాధారణ రోజుల్లో వ్యాపారంతో పోలిస్తే వస్త్ర వ్యాపారం 15 శాతంలోపే జరుగుతోందని సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ తెలిపారు. ఆర్థికంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడం, వస్త్ర దుకాణాలకు రావడానికి భయపడడం వల్ల వ్యాపారం ఇంకా ఊపందుకోలేదని ఆయన పేర్కొన్నారు.


ఇక బంగారు ఆభరణాల కొనుగోళ్లు 8-10 శాతం జరుగుతున్నాయని, అది కూడా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు వున్నవాళ్లు మాత్రం వస్తున్నారని కంకటాల గ్రూప్‌ చైర్మన్‌, విశాఖ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ కంకటాల మల్లిక్‌ తెలిపారు. వస్త్ర, బంగారం వ్యాపారాలు పుంజుకోవాలంటే కనీసం మరో నాలుగు నెలలు సమయం పడుతుందని పేర్కొంటున్నారు. పాదరక్షలు కొనుగోళ్లు కూడా అంతంత మాత్రంగానే వున్నట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. రోజుకు పది జతలు విక్రయించడం కూడా కష్టమవుతోందని ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని ఓ ప్రధాన షోరూమ్‌ యజమాని పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-29T09:31:43+05:30 IST