ఇక తీరం దారులు స్మార్ట్‌!

ABN , First Publish Date - 2020-03-02T10:29:50+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో అర్థంతరంగా నిలిచిపోయిన స్మార్ట్‌ రోడ్స్‌ పనులు త్వరలో పునః ప్రారంభం కాబోతున్నాయి. స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.150

ఇక తీరం దారులు స్మార్ట్‌!

  • రహదారుల పునః నిర్మాణాలకు అనుమతి
  • రివర్స్‌ టెండరింగ్‌ పేరిట స్మార్ట్‌ ప్రాజెక్టులు నిలిపేసిన ప్రభుత్వం
  • వీటిలో ఐదు రోడ్లకు మోక్షం
  • రూ.50 కోట్లతో ఆరు కి.మీ. మేర నిర్మాణాలు 
  • తీరనున్న వాహన చోదకులు, ప్రజల అవస్థలు

(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో అర్థంతరంగా నిలిచిపోయిన స్మార్ట్‌ రోడ్స్‌ పనులు త్వరలో పునః ప్రారంభం కాబోతున్నాయి. స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.150 కోట్లతో 19 రోడ్లను స్మార్ట్‌ రోడ్లుగా నిర్మించే పనులు ప్రారంభించారు. తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో 25 శాతం పనులు మించని ప్రాజెక్టులను నిలిపేయాలని నిర్ణయించింది. దీంతో చాలా ప్రాజెక్టులు నిలిచిపోగా వాటిలో స్మార్ట్‌ రోడ్స్‌ కూడా ఉన్నాయి. రోడ్ల నిర్మాణం అర్థంతరంగా ఆగిపోవడంతో ఆ రోడ్లపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత ఐదు రోడ్లను  ప్రారంభించేందుకు పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీవీఎంసీ అధికారులకు అనుమతిచ్చారు. 


స్మార్ట్‌సిటీగా ఎంపికైన విశాఖలో సుమారు రెండు వేల కోట్ల రూపాయల ఖర్చుతో 28 ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. అందులో ఒకటైన స్మార్ట్‌ రోడ్స్‌  పేరుతో రూ.150 కోట్లతో 20 కిలోమీటర్ల మేర 19 రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన 19 రోడ్ల స్వభావాన్ని పూర్తిగా మార్చేందుకు వీలుగా గత ప్రభుత్వ హయాంలోనే పనులు ప్రారంభించారు. రోడ్డుపై వాహనాలు వెళ్లి వచ్చేందుకు అవసరమైన 12 అడుగుల వెడల్పుతో తారు రోడ్డు నిర్మించి, రోడ్డుకి ఇరువైపులా విశాలమైన ఫుట్‌పాత్‌లు, సైకిలింగ్‌ ట్రాక్‌లు, గ్రీనరీ పెంచేందుకు బెర్మ్‌లను ఏర్పాటు చేసేలా స్మార్ట్‌రోడ్స్‌ ప్రాజెక్టులో డిజైన్‌ చేశారు. ఈ మేరకు జీవీఎస్‌ఎస్‌సీఎల్‌ టెండర్లు పిలవగా షాపూర్జీ కంపెనీ టెండర్లు దక్కించుకుంది. రామకృష్ణా మిషన్‌ రోడ్డు, పాండురంగాపురం రోడ్డు, సిరిపురం ఆలిండియా రేడియో వెనుక రోడ్డు, పెదవాల్తేరు రోడ్డు, వుడా చిల్డ్రన్‌ థియేటర్‌ రోడ్డు, పెదవాల్తేరు డౌన్‌ రోడ్‌, డిఫెన్స్‌ క్వార్టర్స్‌ రోడ్‌, వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనా రోడ్డుతోసహా 19 రోడ్లను స్మార్ట్‌ రోడ్స్‌గా అభివృద్ధి చేసే పనులు ప్రారంభించారు. ఆ రోడ్ల పనులన్నీ శరవేగంగా జరుగుతుండగా టెండర్లలో అవినీతి జరిగిందనే ఆరోపణపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పనులపై రివర్స్‌ టెండరింగ్‌ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో  స్మార్ట్‌ రోడ్స్‌ పనులు అర్థంతరంగా ఆపేయాల్సి వచ్చింది. నెలల తరబడి పనులు అలాగే ఉండిపోవడంతో ఆయా రోడ్లల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీనిపై జీవీఎంసీ అధికారుల వద్ద స్థానికులు, వాహనచోదకులు తరచూ తీవ్ర  అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఆ పనులు నిలిచిపోయిన 19 రోడ్లలో అతి ప్రధానమైన పాండురంగాపురం డౌన్‌, రామకృష్ణామఠం రోడ్డు, వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనా రోడ్డు, పెదవాల్తేరు డౌన్‌ రోడ్డు, డిఫెన్స్‌ క్వార్టర్స్‌ రోడ్డు పనులను తక్షణం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, వాటి పనులు తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలంటూ జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు గత ఏడాది అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇటీవల నగరానికి వచ్చిన పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీవవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించినపుడు స్మార్ట్‌రోడ్స్‌లోని ఐదు రోడ్లు పనులు తిరిగి ప్రారంభించుకునేందుకు మౌఖికంగా అంగీకారం తెలిపారు. దీంతో రూ.50 కోట్ల ఖర్చుతో ఆరు కిలోమీటర్ల మేర రోడ్లను పూర్తి చేసేందుకు అడ్డంకి తొలగినట్టయింది. మంత్రి మౌఖికంగా అంగీకారం తెలిపినప్పటికీ రాత పూర్వకంగా ఉత్తర్వులు వెలువడిన వెంటనే పనులు ప్రారంభించేలా జీవీఎంసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందుకోసం సంబంధిత కాంట్రాక్టర్‌ సంస్థతో కూడా చర్చలు జరిపారు. ఏదిఏమైనా గత తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన స్మార్ట్‌ రోడ్స్‌ పనులు త్వరలోనే తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని జీవీఎంసీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-03-02T10:29:50+05:30 IST