నేటి నుంచి ఆరో విడత ఉచిత బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2020-06-18T09:33:26+05:30 IST

లాక్‌డౌన్‌ అమలు తరువాత ఆరో విడతగా తెల్ల రేషన్‌ కార్డుదారులకు గురువారం నుంచి ఉచితంగా బియ్యం, శనగలు

నేటి నుంచి ఆరో విడత ఉచిత బియ్యం పంపిణీ

వేలిముద్రలు తప్పనిసరిపై కార్డుదారుల్లో ఆందోళన

కరోనా నేపథ్యంలో మినహాయింపునకు డిమాండ్‌


విశాఖపట్నం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ అమలు తరువాత ఆరో విడతగా తెల్ల రేషన్‌ కార్డుదారులకు గురువారం నుంచి ఉచితంగా బియ్యం, శనగలు అందజేయనున్నారు. రూ.10కి అర కిలో పంచదార ఇస్తారు. జిల్లాలో 12.45 లక్షల తెల్ల కార్డుదారులు ఉన్నారు. కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో వేలిముద్ర వేయాలనే నిబంధనలపై కార్డుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. లాక్‌డౌన్‌ అమలు తరువాత మార్చి 29న ఉచిత బియ్యం పంపిణీ సమయంలో వేలిముద్ర విధానం తొలగించారు. అటు తరువాత వేలిముద్ర తప్పనిసరి చేశారు.


రేషన్‌ డిపోలలో శానిటైజర్‌ వినియోగించాలని ప్రభుత్వం నిబంధన విధించినా, అటువంటి ఏర్పాట్లు లేవు. పింఛన్లు పంపిణీలో అమలు చేసే ఫొటో విధానం వర్తింపజేయాలని పలువురు సూచిస్తున్నారు. దీనిపై రూరల్‌ డీఎస్‌వో రొంగలి శివప్రసాద్‌ వద్ద ప్రస్తావించగా వేలిముద్రల ద్వారా బియ్యం పంపిణీ చేయాలని మాత్రమే ఆదేశాలు ఉన్నాయన్నారు. అయితే వేలిముద్ర వేసే ముందు శానిటైజర్‌ వినియోగించాలన్నారు. 

Updated Date - 2020-06-18T09:33:26+05:30 IST