చెస్ట్ ఆస్పత్రిలో మరణ మృదంగం!
ABN , First Publish Date - 2020-07-27T11:33:18+05:30 IST
చెస్ట్ ఆస్పత్రిని జిల్లా కొవిడ్ ఆస్పత్రిగా గుర్తించి, కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు

24 గంటల్లో ఆరుగురి మృతి
ఎవరు, ఏ కారణంతో చనిపోయారో వెల్లడించని సిబ్బంది
చికిత్సలో తీవ్ర జాప్యం.. ఖాళీలేని వెంటిలేటర్లు
పూట వ్యవధిలో కుమారుడు, తండ్రి మృతి
కరోనా నెగెటివ్ అంటూ మృతదేహాల అప్పగింత
ఆస్పత్రి ఆవరణలోనే శవాలతో దళారుల వ్యాపారం
శ్మశానవాటికకు మృతదేహం తరలింపు, దహన సంస్కారాలకు రూ.30 వేలు డిమాండ్
పట్టించుకోని అధికారులు
నగరంలోని చెస్ట్(ఛాతి) ఆస్పత్రిలో మరణమృదంగం మోగుతోంది. గత 24 గంటల్లో అక్కడ ఆరుగురు చనిపోయారు. వీరు ఎవరు? ఏ కారణాలతో చనిపోయారో చెప్పడానికి ఆస్పత్రి సిబ్బంది నిరాకరిస్తున్నారు. జిల్లా యంత్రాంగం సైతం కరోనా మరణాలపై సరైన వివరాలు వెల్లడించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా ఛాతి ఆస్పత్రిలో చనిపోయిన వారి శవాలతో దళారులు వ్యాపారం చేస్తున్నారు. తరలింపు, దహన సంస్కారం కోసం ఒక్కో శవానికి రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఛాతి ఆస్పత్రిలో చికిత్స అందించడంలో తీవ్ర జాప్యం అవుతున్నదని రోగుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి)
చెస్ట్ ఆస్పత్రిని జిల్లా కొవిడ్ ఆస్పత్రిగా గుర్తించి, కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని ఇక్కడికి తీసుకు వస్తున్నారు. అనకాపల్లి మండలం దిబ్బపాలేనికి చెందిన తాటికొండ కృష్ణారావు(56)కు అనారోగ్యంగా ఉండడంతో నాలుగు రోజుల క్రితం అనకాపల్లిలో ఓ ప్రైవేటు వైద్యుడికి చూపించారు. ఈసీజీ తీశాక... గుండెకు సంబంధించిన సమస్య ఉందని పెద్ద ఆస్పత్రిలో చూపించుకోవాలని సూచించారు. ఆయన తండ్రి తాటికొండ నూకయ్యశెట్టి(85)కి కూడా ఆయాసంగా ఉండటంతో శనివారం ఉదయం 108కి ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చి అనకాపల్లిలోని ఎన్‌టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి విశాఖపట్నంలో చూపించుకోవాలని చెస్ట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. రెండు ప్రైవేటు అంబులెన్స్‌ల్లో వారు శనివారం సాయంత్రం చెస్ట్ ఆస్పత్రికి వచ్చారు. వారితోపాటు కృష్ణారావు కుమారుడు, కుమార్తె సహాయంగా వచ్చారు. ఆస్పత్రిలో వెంటిలేటర్లు ఖాళీలేవని, ఆక్సిజన్ పెట్టే ప్రయత్నం చేస్తామని సిబ్బంది వారికి చెప్పారు. ఏం చికిత్స చేశారో తెలియదు గానీ రాత్రి ఒంటి గంటకు కృష్ణారావు చనిపోయాడని బయట ఉన్న ఆయన పిల్లలకు సమాచారాన్ని అందించారు.
ఇది జరిగిన అర గంటకే ఆస్పత్రి సమీపంలోని దళారులు రంగ ప్రవేశం చేసి, మృతదేహాన్ని జ్ఞానాపురం శ్మశానవాటికకు తరలించడానికి, అక్కడ దహన సంస్కారాలు చేయడానికి రూ.30 వేలు అవుతుందని, ఇందుకు అంగీకారమైతే వెంటనే తీసుకెళతామని బేరానికి దిగారు. దళారులు పెద్ద మొత్తం అడగడంతో వారు దిబ్బపాలెం గ్రామపెద్దలకు ఫోన్ చేసి చెప్పారు. వ్యాపారి అయిన కృష్ణారావు కుటుంబానికి స్థానికంగా మంచిపేరు ఉండడంతో గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని, విమ్స్ ఆస్పత్రి పరిసరాల్లో ఓ ప్రైవేటు అంబులెన్స్‌ని రూ.4 వేలకు మాట్లాడి, మృతదేహాన్ని ఆదివారం ఉదయానికి దిబ్బపాలెం తీసుకుపోయారు. అక్కడే దహన సంస్కారాలు చేశారు. అవి పూర్తయిన తరువాత తాతయ్య (కృష్ణారావు తండ్రి) నూకయ్యశెట్టి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని మళ్లీ చెస్ట్ ఆస్పత్రికి వచ్చారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రి సిబ్బంది బయటకు వచ్చి, నూకయ్యశెట్టి చనిపోయారని చెప్పారు. దీంతో వారు హతాశులయ్యారు. సీరియస్‌గా ఉందని ఇక్కడికి తీసుకువస్తే.... చికిత్స చేయకుండా ప్రాణాలు తీశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రిలో దళారులు రాజ్యం ఏలుతున్నారని, శవాలతో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై జిల్లా అధికారులు జోక్యం చేసుకొని విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వారికి కరోనా పరీక్షలు చేశారా? లేదా?
చనిపోయినవారిలో కృష్ణారావుకి గుండె సంబంధ సమస్య ఉందని, సకాలంలో చికిత్స పొందకపోవడం వల్ల మృతిచెందాడని ఛాతి ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఆయన తండ్రి నూకయ్యశెట్టికి 85 ఏళ్లు కావడంతో వృద్ధాప్యం వల్ల చనిపోయారని అంటున్నారు. వారికి కరోనా అని నిర్ధారణ కాలేదని, నెగెటివ్ నివేదిక రావడం వల్లే శవాలను బంధువులకు అప్పగించారని వైద్య సిబ్బంది తెలిపారు. కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. ప్రస్తుత సమయంలో నివేదిక రావడానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతున్నది. అలాంటిది శనివారం సాయంత్రం ఆస్పత్రిలో చేరి, రాత్రి ఒంటి గంటకు చనిపోయిన కృష్ణారావుకి కరోనా పరీక్ష ఎప్పుడు చేశారు? నివేదిక ఎప్పుడు వచ్చిందో స్పష్టం చేయాల్సి వుంది. అలాగే నూకయ్యశెట్టికి కూడా నెగెటివ్ నివేదిక వచ్చిందని అంటున్నారు. ఆ రెండు నివేదికలు తమకు అందించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
అగనంపూడి సీహెచ్‌సీ (దిబ్బపాలెం గ్రామం ఈ ఆస్పత్రి పరిధిలో వుంది) వైద్యసిబ్బంది మాట్లాడుతూ, చెస్ట్ ఆస్పత్రిలో మరణించిన ఆరుగురికి ఆదివారం కరోనా పరీక్షలు చేశారని, వీరిద్దరికీ(కృష్ణారావు, నూకయ్యశెట్టి) నెగెటివ్ వచ్చిందని దిబ్బపాలెం పెద్దలకు తెలిపారు. నెగెటివ్ వచ్చిన మృతదేహాలను మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని, పాజిటివ్ అయితే... ప్రభుత్వ సిబ్బందే శ్మశానవాటికకు తరలించి దహన సంస్కారాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. కాగా గత 24 గంటల్లో ఛాతి ఆస్పత్రిలో ఆరుగురు చనిపోయారు. వారు ఎవరు? ఏ కారణాలతో చనిపోయారో చెప్పడానికి ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు.