-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » SIMHAGIRI CROWD
-
సింహగిరికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2020-11-22T05:05:44+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు.

శనివారం ఒక్కరోజే దేవస్థానానికి రూ.15.2 లక్షల ఆదాయం
కొండదిగువ అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్
గంటల తరబడి స్తంభించిన ట్రాఫిక్..
సింహాచలం, నవంబరు 21: వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంతో పాటు శనివారం కావడంతో ఉత్తరాంధ్ర, తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఉదయం ఐదు గంటల నుంచే కొండదిగువ దేవస్థానం ప్రధాన విచారణ కేంద్రాల వద్ద భక్తులు రద్దీ కనిపించింది. స్వామివారి దర్శనానికి ఉచిత, రూ.100, రూ.300 క్యూ లైన్లలో భక్తులు బారులుతీరారు. దీంతో ఆలయ గరుడ మండపం నుంచి రాజగోపురం వరకు అతి శ్రీఘ్రదర్శనం కోసం భక్తులు సుమారు గంటసేపు వేచివుండాల్సి వచ్చింది. అలాగే ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద కూడా రద్దీ వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీ దృష్ట్యా రూ.300, రూ.100 టికెట్ల విక్రయాల ద్వారా రూ.10.1 లక్షలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.4.2 లక్షలు, తలనీలాలు, టోల్‌గేట్ టికెట్ల అమ్మకాలతో మొత్తం రూ.15,27,210 ఆదాయం దేవస్థానం ఖజానాకు సమకూరినట్టు ఆలయ రికార్డుల ప్రకారం తెలుస్తోంది.
స్తంభించిన ట్రాఫిక్..
అప్పన్న స్వామి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో కొండదిగువ ట్రాఫిక్ స్తంభించిపోయింది. శ్రీదేవి కాంప్లెక్స్‌లో దేవస్థానం దర్శనం, వాహనాల టికెట్ల కోసం వచ్చిన భక్తులు తమ వాహనాలను పైడితల్లెమ్మ ఆలయం నుంచి ప్రధాన కూడలి వరకు ఇష్టానుసారంగా పార్కింగ్ చేశారు. దీంతో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గోశాల నుంచి పాతఅడివివరం కూడలి వరకు పెద్దసంఖ్యలో వాహనాలు బారులుతీరి నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం వాటిల్లింది. గోపాలపట్నం ట్రాఫిక్ ఎస్‌ఐ వెంకటరావు సిబ్బందితో వచ్చి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
